
రామాలయ ఈవో బదిలీ
భద్రాచలం టౌన్: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో ఎం.రఘునాథ్‌ను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు జీవోనెం10ని విడుదల చేసింది. దేవాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న టీ.రమేష్‌బాబుకు భద్రాచలం దేవస్థానం ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పచెప్పింది.
రచ్చకెక్కిన వివాదంతోనే...
రామాలయ ఈవోగా 2013 మార్చి1న రఘునాథ్ బాధ్యతలను స్వీకరించారు. 2013, 2014 సంవత్సరాలలో శ్రీరామనవమి, 2014 ముక్కోటి ఉత్సవాలతో పాటు శబరి ఉత్సవాలను సైతం విజయవంతంగానే నిర్వహించారు. అయితే పరిపాలనాపరంగా ఉద్యోగులు, వేదపండితులు, అర్చకులతో ఈవోకు అనేకమార్లు విభేదాలు పొడచూపాయి. ఈనేపథ్యంలోనే ఆలయంలో ఉన్న వైదిక కమిటీని సైతం రద్దు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా తన మాట వినని వారికి మెమోలను జారీ చేశారనే ఆరోపణలను సైతం మూటగట్టుకున్నారు.
కాగా, ఈవో వేధింపులకు పాల్పడుతున్నారని, ఆయనను సస్పెండ్ చేయాలంటూ ఆలయ ఉద్యోగులు, వేదపండిత ులు, అర్చకులు ఇటీవల ఆలయ ప్రాంగణంలో 9 రోజులు దీక్షలను చేశారు. ఈ దీక్షలకు టీజేఏసి నాయకులతో పాటు స్థానిక ప్రజా, కుల, ఉద్యోగ సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపా యి. దీనితో పాటు రామనారాయణ నామస్మరణను కావాలనే వివాదం చేశారంటూ వేదపండితులు దేవాదాయ శాఖ, ప్రభుత్వ అధికారులకు నివేదికలను అందచేశారు. ఈవోగా రఘునాథ్ బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి జరిగిన అనేక అభివృద్ధి పనులలో, టెండర్లలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ఈవోపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వీటన్నింటిపై సమాలోచనలు చేసిన ప్రభుత్వం ఈవోను తిరిగి వెనక్కిరప్పించుకునేందుకే నిర్ణయించి జీవోను విడుదల చేసింది. దీంతో పాటుగా ఈవో ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారి కావడంతో మరో 2, 3 నెలలోనైనా ఆంధ్రా ప్రాంతానికి పంపాల్సిందే కాబట్టి అప్పటి వరకైనా వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసినట్లు సమాచారం. రామాలయ ఈవోగా రఘునాథ్ 15 నెలలు పనిచేసిన కాలంలో ఉత్సవాలను విజయవంతం చేసి అభినందలను అందుకున్నా, ఉద్యోగులు, వేదపండితులతో సఖ్యత లేని కారణంగా వివాదాల ఈవోగా పేరుపడ్డారు.