
కల్యాణ శోభలో సీతారాములు
రెండో భద్రాద్రిగా పేరొందిన నల్లగొండలోని రామాలయం సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. మంగళవారం స్వామి,అమ్మవార్ల కల్యాణం జరగనుంది. సోమవారం స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్,నల్లగొండ రామగిరిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించనున్న శ్రీరామ కల్యాణ మహోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఆలయం ఆవరణలో ఎదుర్కోళ్ల మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి తరఫున స్థానాచార్యులు శ్రీరంగాచార్యుల బృందం, రాములవారి తరఫున యం.అనంతచార్యుల బృం దం వాదోపవాదాలు, చర్చలు, చతురోక్తులతో ఎదుర్కొళ్ల కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు సీతారామచంద్రస్వామి వార్లను పల్లకిసేవతో ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించిన వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. ఎదుర్కొళ్ల కార్యక్రమానంతరం మళ్లీ స్వామి, అమ్మవార్లను ఆలయంలో ప్రవేశపెట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ మనోహర్‌రెడ్డి, ధర్మకర్తలు వంగరి వేమన సునీత, శ్రీనివాసాచార్యులు, జడల సువర్ణ, మెరుగు గోపి, అక్కినేపల్లి పద్మ, బుక్కా ఈశ్వరయ్య, వేదపండితులు సుజిత్‌కుమారాచార్య, హరికుమారనాచార్య, రామరంగాచార్యులు, రామకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.