భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: శ్రీ రాముడి వద్ద అన్ని కులాలు, వర్గాలు ఒకటేననే సత్యం చాటేందుకు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి అక్టోబర్ 18వ తేదీ నుంచి మూడురోజులు శబరి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ ఎం.రఘునాథ్ తెలిపారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గిరిజనులు, ప్రజల్లో ఆర్థిక అసమానతలు తొలగించి హిందూ మతం వైపు వారిని ఆకర్షించేందుకే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రామున్ని ఆరాధ్యదైవంగా కొలచిన శబరి గిరిజన మహిళ కావడం, రామాలయం ఏజెన్సీ ప్రాంతంలో ఉండటంతో శబరి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఏజెన్సీలో ఉంటూ రాముని దర్శనం చేసుకోని వారున్నారని..అటువంటి వారు ఇతర మతాలవైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. దీన్ని అరికట్టేందుకు ప్రచార రథాల ద్వారా ఉత్సవాలపై ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. గిరిజన ఆచార వ్యవహారాలను పరిశీలిస్తున్నామని, వారి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారమే ఉత్సవాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
ఆలయ అర్చకులతో సమీక్ష అనంతరం తుదిరూపు ఇస్తామన్నారు. గిరిజన, హరిజనవాడల్లో రూ. 3 లక్షల సీజీఎఫ్ నిధులతో రామాలయాలను నిర్మించి ఆ ఆలయాల్లోగిరిజన అర్చకుల ద్వారా పూజలు నిర్విహ స్తామన్నారు. వారికి రూ.2,500 గౌరవవేతనం అందించే బృహత్తర కార్యక్రమం వచ్చే ఏడాదికల్లా రూపుదిద్దుకుంటుందన్నారు. 2015లో జరిగే గోదావరి ఉత్సవాలకు ప్రణాళికను రూపొందించి ఉన్నతాధికారులకు పరిశీలనకు పంపామన్నారు. తానీషా కల్యాణ మండపాన్ని పూర్తిగా తీసివేసి రూ.5 కోట్ల వ్యయంతో ‘0 బ్లాక్’తో వందగదుల సత్రాన్ని భక్తుల వసతి కోసం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్లాన్‌కు రామాలయ స్పెసిపైడ్ అథారిటీ కమిటీ కూడా ఆమోదం తెలిపిందన్నారు. బిల్డింగ్ ప్లాన్‌నూ రూపొం దిస్తున్నామన్నారు. దీన్ని తిరుమల తిరుపతిలోని రామ్‌బగీజా సత్రం తరహాలో నిర్మిస్తామని తెలిపారు. తానీషా కల్యాణ మండపం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో దాతల సహకారంతో 30 ఏసీ గదులతో మరో సదనం, 18 గదులతో శ్రీరామ సదనానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గుట్టపైన రూ. 50 లక్షల వ్యయంతో ఓ కాటేజి, రూ. 60 లక్షలతో మరో కాటేజీని దాతల సహాయంతో నిర్మిస్తున్నామన్నారు. తూర్పుమెట్లకు రెండువైపులా మెట్లు, మధ్యలో విచారణ కేంద్రం నిర్మిస్తామని తెలిపారు. గోదావరి నీటిని ప్యూరిపైడ్ చేసి భక్తులకందించేందుకు వీలుగా ఆలయంలో ఐదు కూలర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పీఆర్వో కార్యాలయాన్ని బస్సుల పార్కింగ్ ప్రదేశానికి మార్చే ఆలోచన ఉందన్నారు. ఇక్కడి వరకు ఆర్టీసీ బస్సులు వచ్చేలా చూస్తామన్నారు. ఇక్కడి నుంచి గుట్టమీద ఉన్న టీటీడీ గదుల వరకు నిరంతరం ప్రైవేట్ వాహనాలను తిప్పేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుట్టపై మోడ్రన్ క్యాంటిన్‌కూ అనుమతిస్తామన్నారు.
సారపాక వద్దే ట్రాఫిక్‌ను ఆపేలా చర్యలు
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను సారపాక వద్దే ఆపేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల బ్రిడ్జిపై ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీసుశాఖల సలహా ప్రకారం సారపాకలో రూ.68 లక్షల వ్యయంతో 28 ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. ఏడాది క్రితమే దీనికి సంబంధించిన నగదును పాల్వంచ ఆర్డీఓ కార్యాలయానికి డిపాజిట్ చేశామన్నారు. మిథిలాస్టేడియాన్ని కూడా ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. కల్యాణ మండపం ఆవశ్యకత, శిల్పకళా సౌందర్యం విశిష్టతను తెలిపేలా గైడ్‌నూ నియమిస్తున్నామన్నారు. కల్యాణమండపానికి తాత్కాలికంగా ఉన్న గేట్లను తొలగించి వాటిస్థానంలో ముఖద్వారంతో కూడిన శాశ్వతగేట్లను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామన్నారు. 2015 గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నింటినీ పూర్తిచేస్తామని ఈఓ రఘునాథ్ తెలిపారు.
18 నుంచి శబరి ఉత్సవాలు
Published Sun, Sep 22 2013 5:36 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM
Advertisement
Advertisement