భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కానీ ఇందుకనుగుణంగా ఆలయంలో సౌకర్యాలు మాత్రం మెరుగపడటం లేదు. అభివృద్ధి పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. శ్రీరామ నవమి ఉత్సవాల సమయంలో హడావిడి చేసిన ఆలయ అధికారులు ఆ తర్వాత అభివృద్ధి పనుల గురించి పూర్తిగా మరిచిపోయారు. గతంలో ఈవోలుగా పనిచేసిన చంధ్రశేఖర్ ఆజాద్, ఆ తర్వాత వచ్చిన రామచంద్రమోహన్, మధ్యలో కొంతకాలం పనిచేసిన బదరీనారాయణాచార్యులు తమదైన రీతిలో భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లకుండా ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చే పట్టే వారు. అభివృద్ధి పనులు కూడా అదే రీతిన సాగాయి. కానీ ప్రస్తుతం అభివృద్ధి పనులతో పాటు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల శోభ కూడా కనిపించడం లేదు. గతంలో వరలక్ష్మీ వత్రం, పవిత్రోత్సవాలు ఎంతో అట్టహాసంగా చేసేవారు.
కానీ ఈ ఏడాది ఈ ఉత్సవాలు నామమాత్రంగానే జరిగాయని పలువురు భక్తులు అంటున్నారు. ఆలయంలో జరిగే కార్యక్రమాలపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. అర్చకులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుత ఈఓ రఘునాధ్ వైదిక కమిటీని ఉన్నఫళంగా రద్దు చేయటం ఈ విమర్శలకు మరింత బలం చేకూరుస్తోంది. అర్చకులు రెండు వర్గాలుగా విడిపోవటం భద్రాద్రి చరిత్రలో ఇదే మొదటి సారని, ఇందుకు ప్రస్తుత ఆలయాధికారులు నిర్వాకమే కారణమనే ప్రచారం కూడా ఉంది. దేవస్థానం పాలక మండలి లేకపోవటంతో పాలనపై ప్రశ్నించే వారు కరువయ్యారు.
గత ఏడాది నవంబర్‌లో పాలక మండలి పదవీకాలం పూర్తి కాగా, నూతన ట్రస్టు బోర్డును వేసేందుకు ప్రభుత్వం వెనుకంజ వేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా స్పెసిఫైడ్ అథారిటీ (సాధికారిత) కమిటీని వేసినప్పటికీ ఉత్సవాల సమయంలో వీరి అజమాయిషీ నామమాత్రమే అయింది. గత తొమ్మిది నెలలుగా ఆలయంలో అభివృద్ధి పనులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షణలోని సాధికారిత కమిటీ ఎట్టకేలకు బాధ్యతలు చేపట్టేందుకు గురువారం ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో ఇప్పట్లో దేవస్థానానికి కొత్త పాలకమండలి నియామకం లేనట్లేనని తేలిపోయింది. ఇకనుంచి సాధికారిత కమిటీనే ఆలయాభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సమావేశం అవుతున్న కమిటీ రామాలయం అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలపై సమీక్షించనుంది.
రామయ్య అందాలను భక్తులు అద్దాలలో కనులారా తిలకించేందుకని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఉన్న సమయంలో అద్దాల మేడ నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ దీని గురించి ప్రస్తుత అధికారులు పూర్తిగా మరించిపోయారు.
చెన్నైకి చెందిన శ్రీనివాసన్ రూ.50 లక్షలతో బంగారు వాకిలి పనులను చేపట్టారు. దాత డబ్బులు ఇచ్చినప్పటికీ వాటిని సవ్యంగా వినియోగించుకోలేకపోవటంతో చివరకు ఆ పనులను ఆయనే స్వయంగా చేపట్టారు. అయితే బంగారు వాకిలి కూడా కొంత అసంపూర్తిగానే మిగిలిపోయింది.
మాడ వీధుల విస్తరణ పేరిట శ్రీరామనవమి ముందు హడావిడిగా చేసిన పనులు ప్రస్తుతం అర్ధంతరంగా నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసేందుకు ఆలయ ఆధికారులు శ్రద్ధ చూపటం లేదనే విమర్శ ఉంది.
రూ. 22 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా ప్రస్తుతం దాని ఊసే లేకుండా పోయింది.
పాలక మండలి ఉన్న సమయంలో టీటీడీ వారు కాటే జీల నిర్మాణం కోసం రూ. 5 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పుడు దాని ప్రస్థావనే లేదు.
ఉత్సవాల సమయంలో భక్తులకు సరైన వసతి, సౌకర్యాలు కరువయ్యాయి. ప్రస్తుతం ఉన్న గదులు, కాటేజీలు ఏమాత్రం సరిపోవటం లేదు. కొత్త కాటేజీల నిర్మాణంపై ఆలయ అధికారులు దృష్టి సారించటం లేదు. దాతలను కూడా ప్రోత్సహించకపోవటంతో వసతి సమస్య తీవ్రంగానే ఉంది.
రాజగోపురానికి మెరుగులు దిద్దేందుకని పెయింట్‌ను తొలగించి, దాన్ని అలాగే వదిలేశారు. దీంతో అది కళాహీనంగా మారింది.
సిబ్బందిలో నిర్లక్ష్వం పేరుకుపోతోంది. జమా ఖర్చులపై పర్యవేక్షణ లేదు. ఆడిట్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ అధికారులు దీనిపై దృష్టి సారించటం లేదు.
సాధికారిత కమిటీ అయినా ఇలాంటి సమస్యలపై దృష్టి సారించకపోతే ఆలయ పాలన పూర్తిగా గాడి తప్పే ప్రమాదం ఉందని భక్తులు అంటున్నారు.
భద్రాద్రి రామాలయంలో సౌకర్యాలు లేక భక్తుల ఇక్కట్లు
Published Thu, Aug 22 2013 6:24 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM
Advertisement
Advertisement