శ్రీసీతారామచంద్రస్వామివారికి స్వర్ణ కిరీటాన్ని ధరింపజేస్తున్న అర్చకులు
సాక్షి, కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం కనులపండువగా జరిగింది. స్వామివారి కల్యాణం జరిగిన మరుసటి రోజున అదే వేదికపై మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శిల్ప కళా శోభితమైన కల్యాణ మండపంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకను కనులారా చూసిన భక్తులు పులకించిపోయారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన పల్లకీలో ఆలయం నుంచి గిరిప్రదక్షిణగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి, కల్యాణ మండపంపై వేంచేయింపజేశారు. ముందుగా స్వామివారికి ఆరాధన జరిపి సకల విఘ్నాలు తొలగిపోయేలా విశ్వక్సేన పూజ, పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేశారు.
తరువాత పట్టాభిషేకం తంతు ప్రారంభించారు. సీతారామచంద్రస్వామివారి పట్టాభిషేకం ప్రాశస్త్యం గురించి వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు. శ్రీరాముడు లోకకల్యాణం కోసం చేసిన త్యాగం గురించి వర్ణించారు. శ్రీరాముడి పాలన నేటి తరాల కు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి కంటే కూడా పట్టాభిషేక మహోత్సవమే గొప్పదని తెలిపారు. ముక్కోటి దేవుళ్లలో ఒక్క సీతారామచంద్రస్వామికి మాత్రమే పట్టాభిషేకం సొంతమని, మరెవ్వరికీ ఈ అవకాశం లేదని వివరించారు. ఆ తర్వాత రామదాసు కాలంనాటి బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, ఛత్రం సమర్పించి కిరీట ధారణ చేశారు. అనంతరం ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషిక్తుడిని చేశారు.
పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్
మహాపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరై ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు రామాలయంలో పూజలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు, భద్రమహర్షి ఆలయాలను కూడా దర్శించుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ, ఆలయఈవో తాళ్లూరి రమేష్‌బాబు, ఏఈవో శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment