Seetharama chandra swamy
-
భద్రాద్రి రామయ్య సేవలో మంత్రి కొడాలి నాని
సాక్షి, అమరావతి/భద్రాచలం: తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మంత్రి కొడాలి నాని సోమవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి కోసం చేయించిన రూ.13 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజికి మంత్రి అందజేశారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలూ శ్రమిస్తున్న సీఎం జగన్‌కు అవసరమైన శక్తిని ప్రసాదించాలని సీతారామచంద్రస్వామిని ప్రార్థించినట్టు చెప్పారు. -
రామయ్యకు మహాపట్టాభిషేకం
సాక్షి, కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం కనులపండువగా జరిగింది. స్వామివారి కల్యాణం జరిగిన మరుసటి రోజున అదే వేదికపై మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శిల్ప కళా శోభితమైన కల్యాణ మండపంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకను కనులారా చూసిన భక్తులు పులకించిపోయారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన పల్లకీలో ఆలయం నుంచి గిరిప్రదక్షిణగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి, కల్యాణ మండపంపై వేంచేయింపజేశారు. ముందుగా స్వామివారికి ఆరాధన జరిపి సకల విఘ్నాలు తొలగిపోయేలా విశ్వక్సేన పూజ, పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేశారు. తరువాత పట్టాభిషేకం తంతు ప్రారంభించారు. సీతారామచంద్రస్వామివారి పట్టాభిషేకం ప్రాశస్త్యం గురించి వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు. శ్రీరాముడు లోకకల్యాణం కోసం చేసిన త్యాగం గురించి వర్ణించారు. శ్రీరాముడి పాలన నేటి తరాల కు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి కంటే కూడా పట్టాభిషేక మహోత్సవమే గొప్పదని తెలిపారు. ముక్కోటి దేవుళ్లలో ఒక్క సీతారామచంద్రస్వామికి మాత్రమే పట్టాభిషేకం సొంతమని, మరెవ్వరికీ ఈ అవకాశం లేదని వివరించారు. ఆ తర్వాత రామదాసు కాలంనాటి బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, ఛత్రం సమర్పించి కిరీట ధారణ చేశారు. అనంతరం ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషిక్తుడిని చేశారు. పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ మహాపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరై ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు రామాలయంలో పూజలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు, భద్రమహర్షి ఆలయాలను కూడా దర్శించుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ, ఆలయఈవో తాళ్లూరి రమేష్‌బాబు, ఏఈవో శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. -
భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత నెల 18 నుంచి జరుగుతున్న వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకెళ్లారు. అక్కడి పునర్వసు మండపంలో నవకలశ స్నపనం జరిపించారు. అనంతరం సుదర్శన చక్రానికి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత గరుడ పటాన్ని ధ్వజస్తంభం నుంచి దింపి ప్రత్యేక పూజలు చేశారు. దేవతలందరికీ ప్రత్యేక పూజల ద్వారా ఉద్వాసన(వీడ్కోలు) పలికారు. దీంతో బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు పరిసమాప్తమైనట్లు ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ప్రకటించారు. కాగా, సోమవారం నుంచి యథావిధిగా పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. -
ధనుర్మాసోత్సవాలు ప్రారంభం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మంగళవారం ధనుర్మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ అర్చకులు తీసుకొచ్చిన బిందెను అంతరాలయంలో ఉంచారు. ఆ తరువాత స్వామి వారి మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు, యాగబేరమూర్తులకు, నిత్య కల్యాణ మూర్తులకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు. స్వామి వారి కి నివేదన అనంతరం తిరుప్పావై పాశుర విన్నపం ఆచరించారు. ఉత్సవాల్లో భాగం గా బుధవారం ఆండాళమ్మ వారిని తాతగు డి వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం, అష్టోత్తర శతనామార్చన పూజలు జరిపించి మహా పూర్ణాహుతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్ర మంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, స్థానాచార్యులు కెఇస్థల శాయి, వేద పండితులు గుదిమళ్ల మురళీ కృష్ణమాచార్యులు, ఏఈవో శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు వెంకటప్పయ్య, పీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.