భద్రాద్రిలో సెల్‌ఫోన్‌లతో నో ఎంట్రీ
ఇక నుంచి కౌంటర్లలోనే సెల్‌ఫోన్‌లను పెట్టి భక్తులు ఆలయ దర్శనానికి వెళ్లాలి. అయితే, దీనిపై భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గర్భగుడిలోకి వెళ్లేవారికి ఈ నిబంధన పెడితే ఓకే కానీ.. ఆలయ ప్రాంగణంలోకి తేవద్దనడం సమంజసం కాదని అంటున్నారు. కాగా, గర్భగుడిలోకి సెల్‌ఫోన్లను నిషేధించటం మంచిదేనని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. గతంలో కూడా ఇలాగే సెల్‌ఫోన్‌లను లోపలకి అనుమతించకుండా బయట కౌంటర్లు ఏర్పాటు చేశారు. కానీ, భక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావటంతో కొద్దికాలానికే ఈ నిబంధనను ఎత్తివేశారు. ఆలయంలో భద్రత చర్యలు పర్యవేక్షించేందుకు ఎస్టీఎఫ్ సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం హోంగార్డుల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. సెల్‌ఫోన్‌లను గర్భగుడిలోకి తీసుకెళ్లకుండా లేదా స్విచ్ఛాఫ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. కానీ, ఆలయ అధికారులు వీటిపై దృష్టి సారించకుండా ఏకంగా ఫోన్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని భక్తులు అంటున్నారు.