సీసీ టీవీ పుటేజీల పరిశీలన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బంగారు నగల మాయంపై విచారణ కొనసాగుతోంది. సీతమ్మ వారి పుస్తెలతాడు, లక్ష్మణస్వామి లాకెట్ మాయమై, పది రోజుల తర్వాత తిరిగి అదే చోట కనిపించిన వ్యవహారంలో కొంతమంది అర్చకులు, దేవస్థానం ఉద్యోగుల పాత్ర ఉందనే ప్రచారం సాగింది. దీనిపై డీఈ రవీందర్‌ను విచారణ అధికారిగా నియమించారు. గర్భగుడిలో నగలు భద్రపరిచే బీరువాలోకి ఎవరెవరు వెళ్లారో సీసీ టీవీ పుటేజీలను ఆదివారం పరిశీలించారు. పవిత్రోత్సవాలు ప్రారంభమైన ముందు రోజు ఓ అర్చకుడు నగలు భద్రపరచగా.. పవిత్రోత్సవాలు ముగిసిన తరువాత స్వామివారి కల్యాణం ప్రారంభించిన రోజున మరో అర్చకుడు నగలు బీరువాలోంచి తీసుకొచ్చినట్లుగా వెల్లడైంది.
నగలు మాయమై, తిరిగి ప్రత్యక్షమైన రోజు వరకు మొత్తం 12 మంది అర్చకులు గర్భగుడిలోని బీరువా వద్దకు వెళ్లి వచ్చినట్లుగా సీసీ పుటేజీల్లో వెల్లడైనట్లు తెలిసింది. ఈవో రమేశ్‌బాబుతో చర్చించిన తర్వాత అర్చకుల నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే, దేవస్థానంలోని అధికారితోనే నగల మాయంపై విచారణ జరిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతమ్మ పుస్తెల తాడు, లక్ష్మణుడి లాకెట్‌ను అమెరికాలోని ఓ ఆధ్యాత్మిక సంస్థకు అమ్మే క్రమంలోనే వాటిని మాయం చేశారని, ఇందులో దేవాదాయశాఖకు చెందిన ఓ కీలక వ్యక్తి ప్రమేయం కూడా ఉందనే ప్రచారం సాగింది.
భక్తుల నుంచి వస్తున్న విమర్శలతో దీనిని మరుగున పరిచేందుకే దేవస్థానం అధికారులు విచారణకు ఇక్కడి అధికారిని నియమించారనే ఆరోపణలు వస్తున్నారుు. ఈ మొత్తం పరిణామాలపై తీవ్ర ఆవేదనతో ఉన్న కొంతమంది అర్చకులు త్వరలోనే దేవాదాయశాఖ ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. వైదిక కమిటీలోని ఓ కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేయటం కూడా చర్చనీయాంశంగా మారింది.
నగల మాయంపై కొనసాగుతున్న విచారణ
Published Mon, Oct 10 2016 3:08 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM
Advertisement