కల్యాణం.. కమనీయం | Grand celebrate to Sri seetharamula kalyanam | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Published Sun, Mar 29 2015 1:02 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

కల్యాణం.. కమనీయం - Sakshi

కల్యాణం.. కమనీయం

* భద్రాద్రిలో వేడుకగా సీతారాముల కల్యాణం  
* ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్

 
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ వేడుకగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించి భక్తజనం పులకించిపోయారు. రామయ తండ్రి సీతమ్మ వారిని పరిణయమాడిన వేళ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబసమేతంగా కల్యాణానికి విచ్చేశారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా శనివారం వేకువజామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచారు. స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తరువాత ఉత్సవమూర్తులను పూల పల్లకిలో ఉంచి మంగళ వాయిద్యాలతో, వేదనాద పురస్సరంగా సకల విధ రాజలాంఛనాలతో గిరిప్రదక్షిణ నిర్వహించారు.

ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. భక్తుల రామనామస్మరణ మధ్య శిల్ప కళాశోభితంగా పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నిర్మించిన కల్యాణ మండపంపై సీతమ్మ వారిని, స్వామివారిని ఆసీనులను చేశారు. కల్యాణ వేడుకలో భాగంగా స్వామివారికి తిరువారాధన, విష్వక్సేనపూజ నిర్వహించారు. అందరి గోత్రనామాలు జపించి, చేయబోయే కల్యాణ తంతుకు ఎలాంటి విఘ్నాలూ జరగకుండా కర్మణ్యే పుణ్యాహవచనం అనే మంత్రంతో మండపశుద్ధి చేశారు. కల్యాణానికి సంబంధించిన వస్తువులకు ఎటువంటి దోషాలు లేకుండా మంత్రజలంతో ప్రోక్షణ గావించారు. దీని ద్వారా కల్యాణ సామగ్రి అంతా సీతారాములకు వినియోగించేందుకు యోగ్యతమవుతాయి. శ్రీ యముద్వాహ్యస్యే అన్న సంకల్పంతో స్వామికి ఎదురుగా సీతమ్మను కూర్చుండబెట్టారు. కన్యావరణను జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణం గావించారు. వధూవరుల వంశ గోత్రాల ప్రవరలు ప్రవచించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదక స్నానం నిర్వహించి వరపూజ చేశారు.
 
 గతేడాది కంటే కాస్త తగ్గిన భక్తులు
 శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గతేడాదికంటే స్వల్పంగా తగ్గినప్పటికీ.. సుమారు 60 వేలు పైగా భక్తులు హాజరయ్యూరు. విద్యార్థుల పరీక్ష లు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కడప జిల్లా ఒంటిమిట్టలోనూ సీతారాముల కల్యాణం జరగటంతో కొంతమంది భక్తులు తగ్గినట్లు భావిస్తున్నారు. కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఇంకా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పొంగులే టి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, జడ్జిలు చల్లా కోదండరామ్, సునీల్ చౌదరి, శివశంకర్‌రావు, ఎస్. జగన్నాథం, ఐ.రమేశ్, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, పువ్వాడ అజయ్‌కుమార్, రాంరెడ్డి వెంకటరెడ్డి, కోరం కనకయ్య, మదన్‌లాల్, జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి, పూల రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు,  జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జాయింట్ కలెక్టర్ దివ్య, భద్రాచలం ఆర్‌డీవో అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
 
 రామదాసు ఆభరణాలతో కల్యాణం
 భక్త రామదాసు చేయించిన బంగా రు ఆభరణాలను స్వామివారికి, అమ్మవారికి అలంకరించారు. మధుపర్కప్రాశన అనంతరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామికి నివేదించారు. సీతారాములకు నూతన వస్త్రాలంకరణ చేశారు. లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని మహాసంకల్పం పఠించారు. కన్యాదానంతో పాటు గోదానం, భూదానం చేయించారు. స్వామికి ఎనిమిది శ్లోకాలు, అమ్మవారికి మరో ఎనిమిది శ్లోకాలతో మంగళాష్టకం చదివారు.
 
 సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్తరామదాసు చేయించిన మంగళసూత్రాలకు మాంగల్యపూజ నిర్వహించి సీతమ్మ వారికి మాంగల్యధారణ గావించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. సీతారాముల శిరస్సు పైనుంచి జాలువారిన తలంబ్రాల కోసం భక్తులు ఎంతో ఆసక్తి చూపారు. తాత్కాలిక నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశారు. మహదాశీర్వచనం నిర్వహించి హారతి పట్టడంతో స్వామివారి కల్యాణ తంతు పూర్తయింది. ఆ తరువాత స్వామి వారిని తిరువీధి సేవకు తీసుకెళ్లారు.
 
నేడు శ్రీరామ పట్టాభిషేకం
స్వామివారి  పట్టాభిషేక మహోత్సవం ఆదివారం మిథిలాస్టేడియంలోని కల్యాణ మండపంపై  ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.  శ్రీరామపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement