భద్రాచలంలో సీతారాముల కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.
భద్రాచలం : భద్రాచలంలో సీతారాముల కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారు సీతమ్మ వారి మెడలో మాంగల్యధారణ గావించారు. అంతకు ముందు శనివారం మూలమూర్తులకు కల్యాణం అనంతరం మిథిలా మండపానికి వూరేగింపుగా వేంచేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
సీతారాముల కల్యాణం ఇలలో జరిగే రమణీయ వేడుక. ఊరూరా రాములోరి పెళ్లి జరిగినా భద్రాద్రి కల్యాణోత్సవం కనులారా చూసిన వారిదే వైభోగం. దాంతో స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన భక్తులతో భద్రాద్రి కిక్కిరిసిపోయింది. కాగా ఈ నెల 29న శ్రీరాముడి మహాపట్టాభిషేకంలో గవర్నర్ నరసింహన్ పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ జరిగే ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.