అంగరంగ వైభవంగా రామయ్య కల్యాణం
భద్రాచలం : భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారు సీతమ్మ వారి మెడలో మాంగల్యధారణ గావించారు. పురోహితులు పవిత్రమైన అభిజిత్ లగ్నంలో కల్యాణ రాముడి చేత జగన్మాత వైదేహి మెడలో మాంగల్యధారణ చేయించారు. అంతకు ముందు వేద పండితులు మూలమూర్తులకు కల్యాణం అనంతరం మిథిలా మండపానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
సీతారాముల కల్యాణం ఇలలో జరిగే రమణీయ వేడుక. ఊరూరా రాములోరి పెళ్లి జరిగినా భద్రాద్రి కల్యాణోత్సవం కనులారా చూసిన వారిదే వైభోగం. నీలమేఘశ్యాముని నామస్మరణతో భద్రాద్రి పరవశించింది. రామాయణ రసరమ్య సన్నివేశాలతో పులకించిన దివ్యధాత్రి భద్రాచలంలో రామయ్య కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తజనులు తరలి వచ్చారు.
దాంతో స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన భక్తులతో భద్రాద్రి కిక్కిరిసిపోయింది. సీతారాముల కల్యాణానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కాగా శనివారం జరిగే శ్రీరాముడి మహాపట్టాభిషేకంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొంటారు.