బెళుగుప్ప: బుల్లితెర సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు బెళుగుప్పకు చెందిన రాచర్ల హరినాథ్ గుప్తా. రైతు, ధాన్యం వ్యాపారి రాచర్ల కోటేశ్వరప్ప పెద్ద కుమారుడు హరినాథ్‌గుప్తా టీవీ సీరియల్స్‌లో ఎస్సై, కానిస్టేబుల్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాయవాది, ఎమ్మెల్యే తదితర పాత్రల్లోనూ తన అభినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. హరినాథ్ గుప్తా తన మిత్ర బృందంతో కలిసి 1983లో గ్రామంలో ఒక వీధి నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలో ఎస్సైగా హరినాథ్ గుప్తా అభినయం అందరినీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన 2013లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అక్కడ జరిగే అనేక ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు. 2014లో తొలిసారిగా ‘ఈజీ మనీ’ అనే సినిమాలో కృష్ణభగవాన్, రాకెట్ రాఘవల కాంబినేషన్‌లో నటించే అవకాశం వచ్చింది.
నటించిన సినిమాలు, సీరియళ్లు..
ఆడదేఆధారం, జాబిలమ్మ, మిస్సమ్మ, సౌభాగ్యవతి, కాంచనగంగ, స్వాతిచినుకులు, అగ్నిపూలు, శ్రావణ సమీరాలు, కెరటాలు తదితర 15 సీరియళ్లలో హరినాథ్‌గుప్తా నటించారు. వీటిలో కెరటాలు సీరియల్‌లో రాజుపాలెం ఎస్సై పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పడ్డానండి ప్రేమలో మరి, ఊపిరి, శౌర్య, సింగం 123, భంభంబోలేనాథ్, వైరస్, మెంటల్ కృష్ణ తదితర సినిమాలలో నటించారు. ప్రస్తుతం విడుదల కానున్న ఆక్సిజన్, రూల్, కార్తీకా సినిమాలలోనూ నటించారు. రూల్ సినిమాలో ఎమ్మెల్యే పాత్ర పోషించారు.
అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి
నటనారంగంలో అవకాశాలు రావడమే కష్టం. వచ్చిన ఎలాంటి అవకాశాన్నీ వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. అనంత జిల్లా వాసిగా నటనా రంగంలో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జిల్లా నుంచి మరింత మంది నటనా రంగంలోకి రావాలి. అలాంటివారికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నా. – హరినాథ్‌గుప్తా
Comments
Please login to add a commentAdd a comment