నమ్మకాన్ని వమ్ము చేయొద్దు! | Dinawahi Harinath's Comments On Public Verdict In Parliament Elections | Sakshi
Sakshi News home page

నమ్మకాన్ని వమ్ము చేయొద్దు!

Published Fri, Jun 7 2024 9:55 AM | Last Updated on Fri, Jun 7 2024 9:55 AM

Dinawahi Harinath's Comments On Public Verdict In Parliament Elections

పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్డీఏకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. మోదీ హవా లేదనేది స్పష్టమైంది. ‘భారతదేశాన్ని రక్షించండి! ప్రజాస్వామ్యాన్ని కాపాడండి!’ అని దేశవ్యాప్తంగా ‘ఇండియా’ కూటమి, దాని భాగస్వామ్య పార్టీలు, సోషల్‌ మీడియా మేధావులు, అనేకమంది జర్నలిస్టులు చేసిన కృషి, ప్రజల స్పందన ద్వారా భారతదేశ లౌకిక సమాఖ్య స్ఫూర్తి కాపాడ బడింది. 400 సీట్లకు పైగా సాధించాలన్న బీజేపీ కల నెరవేరలేదు. ఎన్డీఏ 293 సీట్లతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ‘ఇండియా’ కూటమి తన బలాన్ని పెంచుకొని 233 సీట్లు పొందగలిగింది.

రామ జపం చేసిన అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది. యూపీలో అధికారంలో ఉండి కూడా కేవలం 37 సీట్లకే పరిమితమైంది. ‘ఇండియా’ కూటమి 43 స్థానాలు కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన కూటమిని విచ్ఛిన్నం చేసినందుకు ఎన్డీఏను ప్రజలు తిరస్కరించారు. 30 సీట్లు గెలుచుకొని ‘ఇండియా’ కూటమి బీజేపీని నివ్వెరపరిచింది. బెంగాల్‌లో మమతా బెనర్జీ తన పట్టు నిలబెట్టుకుంది. దక్షిణాదిన బలం పెంచుకోవాలని చూసిన బీజేపీ తమిళనాడులో ఒక్క సీటూ గెలవలేదు. కేరళలో ఒక్క స్థానం పొందింది. కర్ణాటకలో ఎనిమిది స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ– జనసేనలతో కలిసి 21 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణలో కేసీఆర్‌ వైఫల్యం బీజేపీకి అనుకూలించింది. జాతీయ రాజకీయాల్లో నేషనల్‌ ఫ్రంట్‌ పెట్టి ఆనాడు ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టించారు. నేడు మతోన్మాద ఎన్డీఏ పాలన మైనారిటీల పైనా, దళితులపైనా దాడులు కొనసాగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తున్న విధానాలను చంద్రబాబు సమీక్ష చేసుకొని ఎన్డీఏ భాగస్వామ్యం విషయంలో పునరాలోచన చేయాలి. భారతదేశ లౌకిక ఫెడరల్‌ స్ఫూర్తిని కాపాడాల్సిన చారిత్రక కర్తవ్యం చంద్రబాబుపై ఉంది. బిహార్‌లో నితీష్‌ కుమార్‌ సైతం ఎన్డీఏ కూటమి నుండి వేరుపడకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రజల తీర్పును గౌరవించి ఫాసిస్ట్‌ శక్తులను మూడోసారి అధికార పీఠం ఎక్కకుండా నిరోధించాలి. – దినవహి హరినాథ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement