‘లవర్స్’ సినిమా మొదట హిందీలో చేద్దామనుకున్నా!
‘‘హిందీలో ఓ సినిమా చేయాలనుకుని, మొదట ‘లవర్స్’ కథ తయారు చేసుకున్నా. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే, దర్శకుడు మారుతి ‘ప్రేమకథా చిత్రమ్’ను హిందీలో రీమేక్ చేయమని అడిగాడు. కుదర్లేదు. ఆ సమయంలోనే మారుతి ‘లవర్స్’ కథ విని తెలుగులో చేయమని అడిగారు. భవిష్యత్తులోనైనా ‘లవర్స్’ని హిందీలో చేస్తాను’’ అని దర్శకుడు హరినాథ్ చెప్పారు.
సుమంత్ అశ్విన్, నందిత జంటగా మారుతి సమర్పణలో మాయాబజార్ మూవీస్ సంస్థ నిర్మించిన ‘లవర్స్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోందని హరినాథ్ ఆనందం వెలిబుచ్చారు. తన సినీప్రస్థానం గురించి హరినాథ్ వివరిస్తూ -‘‘న్యూయార్క్ ఫిలిమ్ అకాడమీలో ఫిలిమ్ మేకింగ్, స్క్రీన్ రైటింగ్‌లో స్పెషల్ కోర్స్ చేశాను. ముంబైలో మూడు హిందీ సినిమాలకు పని చేశాను. శ్రీకాంత్ హీరోగా ‘లక్కీ’ సినిమాతో దర్శకునిగా మారాను. ఆ తర్వాత మళ్లీ ముంబై వెళ్లి ‘లవర్స్’ కోసం హైదరాబాద్ వచ్చాను.
ఇకపై రెగ్యులర్‌గా తెలుగు సినిమాలే చేస్తాను. ప్రస్తుతం నా దగ్గర నాలుగైదు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. ‘లవర్స్’ మేకింగ్ గురించి హరనాథ్ మాట్లాడుతూ -‘‘కథలో ఫ్రెష్‌నెస్ ఉంది. అలాగే ఆర్టిస్టుల్లోనూ ఫ్రెష్‌నెస్ ఉంది. సుమంత్ ఆశ్విన్, నందిత, సప్తగిరి ఈ సినిమా విజయంలో మెయిన్ పిల్లర్స్. మారుతి స్క్రిప్టు సైడ్ ఇచ్చిన సహకారం మరిచిపోలేనిది. ఆయన క్రియేటివ్ సైడ్ ఎక్కడా ఇన్‌వాల్వ్ కాలేదు’’ అని తెలిపారు.