సాక్షి, అమరావతి: వైద్య పరికరాలు, ఫర్నీచర్ సరఫరా చేసిన సంస్థకు ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) బిల్లులు చెల్లించినప్పటికీ, ఆ చెల్లింపులపై సందేహం వ్యక్తం చేస్తూ సంస్థ వైస్ చైర్మన్, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) డైరెక్టర్ కోర్టు ముందు హాజరు కావాలంటూ సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో హెల్త్ వెల్‌నెస్ కేంద్రాలకు వైద్య పరికరాలు, ఫర్నీచర్ సరఫరా చేసిన ఆర్మీ సర్జికల్ వర్క్స్ తమకు రూ.3.05 కోట్లను చెల్లించడంలేదంటూ దాఖలు చేసిన వ్యాజ్యంపై సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. ఆర్మీ సర్జికల్ వర్క్స్ బిల్లు చెల్లించేందుకు ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్ చైర్మన్ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేశారు.
ఆరోజు విచారణకు రాగా, డిసెంబరు 21నే బిల్లు చెల్లించినట్లు ఏపీఎంఎస్‌ఐడీసీ న్యాయవాది వెంకటరెడ్డి చెప్పారు. బిల్లులు చెల్లించాలని తాను ఆదేశాలు ఇవ్వకపోయినా ఆర్మీ సర్జికల్ కంపెనీకి బిల్లు చెల్లించడంపై సందేహం ఉందని న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ అన్నారు. పెండింగ్ బిల్లులన్నింటి వివరాలతో ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్ చైర్మన్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ వ్యాజ్యం డిసెంబర్ 29న మరోసారి విచారణకు రాగా.. ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్ చైర్మన్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్ ఆర్మీ సర్జికల్ వర్క్స్ బిల్లు రూ.3.05 కోట్లు విడుదల చేశారని, దానిని పిటిషనర్‌కు చెల్లించామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ స్పందిస్తూ, దాదాపు రూ.300 కోట్ల మేర బిల్లులు ఆ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారని, ఎంతెంత బిల్లులు చెల్లించాలో వివరాలను ఇవ్వడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. జనవరి 5న స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్ చైర్మన్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్‌లను న్యాయమూర్తి ఆదేశించారు.
బిల్లులు చెల్లించడమూ తప్పేనట
ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్ చైర్మన్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను చదివి వినిపించారు. పిటిషనర్ కంపెనీకి బిల్లులు చెల్లించకపోవడాన్ని సింగిల్ జడ్జి తప్పుపట్టారని, దీంతో వారికి బిల్లులు చెల్లించేశామని ఏఏజీ చెప్పారు. దీనినీ సింగిల్ జడ్జి తప్పుపట్టారన్నారు. ఆదేశాలు ఇవ్వకపోయినా ఎలా చెల్లిస్తారంటూ అధికారులపై మండిపడ్డారని, వారి వ్యక్తిగత హాజరుకు, మొత్తం బిల్లులు వివరాలు సమర్పించాలని ఆదేశాలిచ్చారన్నారు. ధర్మాసనం సైతం సింగిల్ జడ్జి ఉత్తర్వులను చదివింది. వెంటనే సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment