సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు ఇళ్ల యజమానులకు హైకోర్టు ధర్మాసనం సైతం గట్టి షాక్‌నిచ్చింది. రోడ్డు మార్జిన్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడమే కాకుండా వాటిని కూల్చివేసేందుకు అధికారులు నోటీసులిచ్చినా ఆ విషయాన్ని దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందిన ఇళ్ల యజమానులు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఖర్చులు విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది.
ఈమేరకు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ 14 మంది ఇళ్ల యజమానులు దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టి వేసింది. ఖర్చుల మొత్తాన్ని తగ్గించాలన్న విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. వాస్తవాలను దాచి పెట్టి కోర్టుల నుంచి సానుకూల ఉత్తర్వులు పొందే తీరును తామెంత మాత్రం ప్రోత్సహించబోమని తేల్చి చెప్పింది. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుందని, వారు సకాలంలో కోర్టును ఆశ్రయించి న్యాయం పొందే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించింది.
ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 14 మంది రూ.14 లక్షలను ఖర్చుల కింద చెల్లించాలంటూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ నేపథ్యం..
రహదారి విస్తరణలో భాగంగా పలు ఇళ్ల కూల్చివేతకు నిర్ణయం తీసుకున్న తాడేపల్లి మునిసిపల్ అధికారులు రోడ్ మార్జిన్లను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు ఈ ఏడాది మే 21న చట్ట ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయితే రాజకీయ పార్టీల అండతో ఈ నోటీసులను సవాలు చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది ఇళ్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సింగిల్ జడ్జి జస్టిస్ రవినాథ్ తిల్హారీ... పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
అటు తరువాత ఆ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా ఇళ్ల కూల్చివేత విషయంలో పిటిషనర్లకు అధికారులు ముందుగానే షోకాజ్ నోటీసులతో పాటు ఇతర నోటీసులు కూడా అందచేశారంటూ అందుకు సంబంధించి అన్ని ఆధారాలను మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తి ముందుంచారు.
వాటిని పరిశీలించిన న్యాయమూర్తి హైకోర్టును ఆశ్రయించిన 14 మంది పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందుకుని కూడా నోటీసులు ఇవ్వలేదంటూ హైకోర్టును తప్పుదోవ పట్టించడంపై మండిపడ్డారు.
కోర్టు ముందు వాస్తవాలను దాచి పెట్టినందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున 14 మందికి రూ.14 లక్షలను ఖర్చులుగా విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆ 14 మంది ఇళ్ల యజమానులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు.
కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారు...
ఇళ్ల యజమానుల తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ పిటిషనర్లందరూ వ్యవసాయదారులని పేర్కొన్నారు. వారికి షోకాజ్ నోటీసులకు, తుది నోటీసులకు తేడా తెలియదన్నారు. దీంతో నోటీసులు ఇవ్వలేదని చెప్పారన్నారు. అంతేకానీ కోర్టును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం వారికి లేదన్నారు.
జరిగిన తప్పులకు క్షమాపణ చెబుతున్నామన్నారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. ఇలాంటి వ్యాజ్యాల వల్ల కోర్టుల సమయం వృథా అవుతోందని పేర్కొంది. వాస్తవాలను తొక్కి పెట్టి పిటిషన్ దాఖలు చేయడం ద్వారా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా మిగిలిన కక్షిదారుల వ్యాజ్యం విచారణ జాబితాలో వచ్చే అవకాశం లేకుండా పోయిందని, ఇది ఓ రకంగా అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించింది. కేసులు సకాలంలో విచారణకు రాకపోవడంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, అందుకు ఇప్పటం ఇళ్ల యజమానులు లాంటి వారు దాఖలు చేసే వ్యాజ్యాలే కారణమని పేర్కొంది.
ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు హైకోర్టు ఎంతో సమయం వెచ్చించిందని తెలిపింది. ఆ సమయాన్ని నిజమైన బాధితులు దాఖలు చేసే వ్యాజ్యాలను విచారించేందుకు వెచ్చించి ఉంటే వారికి న్యాయం జరుగుతుందని పేర్కొంటూ అప్పీల్‌ను కొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment