తెలంగాణ ప్రకటిస్తే సుప్రీంలో పిల్
Published Fri, Aug 9 2013 2:22 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే సుప్రీంలో పిల్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇక్కడి ఒక హోటల్లో గురువారం సాయంత్రం అన్ని ప్రభుత్వ శాఖల జేఏసీ, ప్రజా సంఘాల జేఏసీ, బార్, డాక్టర్స్ అసోసియేషన్ల జేఏసీల ఆధ్వర్యంలో జరిగిన సమైక్యాంధ్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణను అడ్డుకునేందుకు రాజ్యాంగబద్ధంగా ఎన్ని విధాలుగా చేయొచ్చో అన్ని రకాలుగా చేస్తూనే, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉధృతం చేయాల్సి ఉందన్నారు.
రాష్ట్రాన్ని విభజించకుండా ఉండేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచినట్టు తె లిపారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకుపోవడానికి విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు మరింత ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరారు. వారికి పోలీసుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు ఓ లీగల్ కమిటీని బార్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తుందన్నారు. విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, అందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హోర్డింగ్స్ ద్వారా ప్రచారాన్ని చేపడతామని చెప్పారు.
జాతీయ రహదారిపై వంటావార్పు, మానవ హారాలు, రైల్‌రోకో, బంద్‌లను తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యంగా ఉంచుతున్నామంటూ కేంద్రం ప్రకటించేవరకూ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, మళ్ల విజయప్రసాద్, చింతలపూడి వెంకట్రామయ్య, అవంతి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. వివిధ సంఘాల నుంచి 38 మంది ప్రతినిధులు తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
Advertisement
Advertisement