పౌర హక్కులకు... మేమే సంరక్షకులం | Trust us to be guardians of liberties of our citizens Says CJI DY Chandrachud | Sakshi
Sakshi News home page

పౌర హక్కులకు... మేమే సంరక్షకులం

Published Sun, Dec 18 2022 5:16 AM | Last Updated on Sun, Dec 18 2022 5:16 AM

Trust us to be guardians of liberties of our citizens Says CJI DY Chandrachud - Sakshi

ముంబై: దేశంలో పౌరుల స్వేచ్ఛ తదితర హక్కులకు న్యాయస్థానాలే శ్రీరామరక్ష అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ పునరుద్ఘాటించారు. ప్రజలు కూడా ఈ విషయంలో న్యాయవ్యవస్థపైనే అపారమైన నమ్మకం పెట్టుకున్నారని స్పష్టం చేశారు. శనివారం బాంబే బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జస్టిస్‌ అశోక్‌ హెచ్‌.దేశాయ్‌ స్మారకోపన్యాసం చేశారు. దేశంలో స్వేచ్ఛా దీపిక నేటికీ సమున్నతంగా వెలుగుతోందంటే దాని వెనక ఎందరో గొప్ప న్యాయవాదుల జీవితకాల కృషి దాగి ఉందన్నారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టారు. ‘‘ఏ కేసూ చిన్నది కాదు, పెద్దదీ కాదు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ఒక సామాన్య కేసే ఇందుకు తాజా ఉదాహరణ. విద్యుత్‌ పరికరాల దొంగతనం కేసులో యూపీకి చెందిన ఒక వ్యక్తికి ట్రయల్‌ కోర్టు తొమ్మిది కేసుల్లో రెండేసి సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. కానీ అది ఏకకాలంలో, అంటే రెండేళ్లలోనే పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలివ్వడం మర్చిపోయింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ తప్పిదాన్ని సరిదిద్దాల్సి వచ్చింది. లేదంటే చిన్న దొంగతనం కేసులో దోషి ఏకంగా 18 ఏళ్ల జైల్లో మగ్గాల్సి వచ్చేది. అందుకే మరోసారి చెప్తున్నా.

జిల్లా కోర్టు మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టుకైనా చిన్న కేసు, పెద్ద కేసు అని విడిగా ఏమీ ఉండవు. అన్ని కేసులూ ముఖ్యమైనవే’’ అన్నారు. పౌర హక్కుల్ని అంతిమంగా న్యాయవ్యవస్థే పరిరక్షిస్తుందని ఈ కేసుతో మరోసారి తేటతెల్లమైందని అభిప్రాయపడ్డారు. సదరు కేసులో అలహాబాద్‌ హైకోర్టు కూడా ట్రయల్‌ కోర్టు తీర్పునే సమర్థించింది. దాంతో శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ సీజేఐ సారథ్యంలోని ధర్మాసనమే శుక్రవారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘మనిషి ప్రవర్తన సజావుగా ఉండేలా చూడటంలో చట్టంతో పాటు నైతికతది కూడా కీలక పాత్ర. మన బయటి ప్రవర్తనను చట్టం నియంత్రిస్తే మనోభావపరమైన లోపలి ప్రవర్తనను నైతికత దారిలో ఉంచుతుంది’’ అని ఈ సందర్భంగా సీజేఐ అభిప్రాయపడ్డారు.

కోర్టుల వల్లే సుస్థిర ప్రజాస్వామ్యం
ఎమర్జెన్సీ సమయంలో కోర్టుల స్వతంత్ర వ్యవహార శైలే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బాంబే హైకోర్టులో సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘‘ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొంటూ స్వతంత్రంగా, నిర్భీతిగా వ్యవహరించే న్యాయస్థానాలే నాడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాయి.

మనకబారిన ప్రజాస్వామ్య స్వేచ్ఛా ప్రమిద పూర్తిగా కొడిగట్టిపోకుండా జస్టిస్‌ రాణే వంటి న్యాయమూర్తులే కాపాడారు. బార్‌ నుంచి వచ్చిన న్యాయమూర్తులు కూడా ఇందులో కీలక పాత్ర పోషించి ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా నిలిపారు. మన ప్రజాస్వామ్యం ఇప్పటికీ సుస్థిరంగా నిలిచి ఉందంటే అదే కారణం’’ అన్నారు. పలువురు న్యాయమూర్తులతో తాను పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘యువత న్యాయవాద వృత్తిని చేపట్టేలా ప్రోత్సహించడంలో బాంబే బార్‌ అసోసియేషన్‌ చురుౖMðన పాత్ర పోషించాలి. ఈ విషయంలో న్యాయమూర్తులపైనా గురుతరమైన బాధ్యత ఉంది’’ అని అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement