న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా పరిపూర్ణమూ, లోపరహితమూ కాజాలదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక వ్యవస్థ అయిన కొలీజియాన్ని గట్టిగా సమర్థించారు. కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియం వ్యవస్థ తీవ్ర విభేదాలకు కారణంగా మారడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఇండియాటుడే సదస్సులో సీజేఐ మాట్లాడుతూ కొలీజియంను అత్యుత్తమ వ్యవస్థగా అభివర్ణించారు.
న్యాయవ్యవస్థపై బయటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా కాపాడుకోవాల్సి ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడే అది స్వతంత్రంగా పని చేయగలుగుతుందన్నారు. కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు ఆమోదం తెలపకపోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను కొలీజియం బయట పెట్టడంపై కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అసంతృప్తిని సీజేఐ తోసిపుచ్చారు. ‘‘వీటిపై న్యాయ మంత్రితో చర్చకు దిగదలచుకోలేదు. కానీ భిన్నాభిప్రాయాలు సర్వసాధారణం’’ అన్నారు.
అయితే కేసుల విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఏ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో గత 23 ఏళ్లలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదన్నారు. అలాగే న్యాయమూర్తుల లైంగిక ప్రవృత్తికి, వారి సామర్థ్యానికి సంబంధం లేదంటూ ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొలీజియం సిఫార్సు చేసిన వారిలో కొందరు తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకోవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment