నేషనల్‌ అ‘టెన్షన్‌’..‘అస్సాం రిజిస్టర్‌’ | Government releases NRC list in Assam | Sakshi
Sakshi News home page

నేషనల్‌ అ‘టెన్షన్‌’..‘అస్సాం రిజిస్టర్‌’

Published Tue, Jul 31 2018 3:10 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

Government releases NRC list in Assam - Sakshi

జాబితాలో తమ పేరు ఉందోలేదో చూసుకునేందుకు తేజ్‌పూర్‌లో ఆఫీసుకొచ్చిన జనం

గువాహటి/న్యూఢిల్లీ: అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు (ఎన్నార్సీ) తుది ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. దరఖాస్తుదారుల్లోని 40.07లక్షల మంది తమ అస్సామీ గుర్తింపును చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది. దీంతో తుది ముసాయిదాతో 40 లక్షల మందికి పైగా ప్రజల భవితవ్యం అనిశ్చితిలో పడింది. గువాహటిలో సోమవారం భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ శైలేశ్‌.. ఎన్నార్సీ ముసాయిదా వివరాలను వెల్లడించారు. ‘భారత్, అస్సాం చరిత్రలో ఇదో చరిత్రాత్మకమైన రోజు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఓ అద్భుతమైన న్యాయ ప్రక్రియ’ అని ఈయన పేర్కొన్నారు. అయితే ఇది తుది ముసాయిదా మాత్రమేనని మిగిలిన వారికీ తమ అభ్యంతరాలను వెల్లడించే అవకాశం ఇస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అయితే ఇది ఓటుబ్యాంకు కోసం కేంద్రం చేసిన ప్రయత్నమని విపక్షాలు మండిపడుతున్నాయి.

బహిరంగపరచలేం!
40 లక్షల మంది పేర్లను జాబితాలో ప్రచురించకపోవడంపై ఎన్నార్సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్‌ హజేలా మాట్లాడుతూ.. ‘మేం ఎంచుకున్న ప్రక్రియను బహిరంగంగా చెప్పలేం. ఎన్నార్సీ సేవా కేంద్రాలను సందర్శించి తమ దరఖాస్తుల తిరస్కరణకు కారణాలు తెలుసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. నాలుగు కేటగిరీల (అనుమానాస్పద ఓటర్లు, వారి వంశస్థులు, విదేశీయుల ట్రిబ్యునల్స్‌లో రిఫరెన్సులు పెండింగ్‌లో ఉన్నవారు, వీరి వంశస్థులు)కు సంబంధించిన ప్రజల అర్హతను సుప్రీంకోర్టు పక్కనపెట్టడంతో తుది ముసాయిదాలో వీరెవరికీ చోటు దక్కలేదన్నారు. ‘దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు జరుగుతుంది. ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు చాలినంత సమయముంది’ అని పేర్కొన్నారు. ‘తుది జాబితాలో లేని వారిని మేం భారతీయులుగానో, భారతీయేతరులుగానో పిలవడం లేదు. వీరిపై వెంటనే ఓ నిర్ణయానికి రాలేం’ అని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గ్‌ స్పష్టం చేశారు.  

ఇది ప్రజావిజయం: సోనోవాల్‌
ఎన్నార్సీ విడుదల సందర్భంగా అస్సాం ప్రజలకు ముఖ్యమంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చరిత్రాత్మక రోజు ఎప్పటికీ రాష్ట్ర ప్రజల స్మృతిపథంలో మిగిలిపోతుందని ప్రశంసించారు. జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందవద్దని వారికున్న అన్ని అవకాశాలను సమీక్షిస్తామని ముసాయిదా విడుదల అనంతరం సోనోవాల్‌ వెల్లడించారు.

ఎన్నార్సీ పారదర్శకం: రాజ్‌నాథ్‌
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగానే ఎన్నార్సీని రూపొందించినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. జాబితాలో పేర్లు లేనివారు భారత జాతీయతను నిరూపించుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ‘ఎవరిపైనా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోం. మీరెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇది కేవలం తుది ముసాయిదానే. తుది జాబితా కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. జాబితాలో పేర్లు లేనివారు విదేశీయుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని రాజ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు. డిసెంబర్‌ 31వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

పార్లమెంటులో నిరసన
ఎన్నార్సీ ముసాయిదా విడుదలపై పార్లమెంటులో విపక్షాలను నిరసన తెలిపాయి. కాంగ్రెస్, తృణమూల్, ఎస్పీ సహా పలువురు విపక్ష సభ్యులు రాజ్యసభలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో చైర్మన్‌ సభను వాయిదా వేశారు. అనంతరం సభలో ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ వివరణ ఇస్తూ.. ‘ఈ ప్రక్రియలో కేంద్రం ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ముసాయిదా’ అని పేర్కొన్నారు.  ఎన్నార్సీ విడుదల విషయంలో కేంద్రం చాలా ఆలస్యంగా స్పందించిందని.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. కనీసం సమస్య పరిష్కారంలోనైనా వేగంగా స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. చాలా మంది భారతీయులకు ఈ జాబితాలో చోటు దక్కలేదని రాహుల్‌ విమర్శించారు. ఎన్సార్సీ ముసాయిదా నుంచి 40 లక్షల మందిని తప్పించడంపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ మండిపడ్డారు. ‘సొంతగడ్డపై భారతీయులే శరణార్థులయ్యారు’ అని పేర్కొన్నారు.

40 లక్షల మంది భవితవ్యమేంటి?
అస్సాం జాతీయ పౌర గుర్తింపు తుది ముసాయిదాలో 40 లక్షల మందికి చోటు దక్కకపోవడంతో అస్సాంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పౌరసత్వం లభించని వాళ్లంతా ఓటు హక్కుని కోల్పోతారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అందవు. సొంతంగా ఆస్తుల్ని కొనుక్కొనే వీలుండదు. ఇప్పటికే సొంత ఆస్తులు ఉన్నవారిపై దాడులు జరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను వెనక్కి పంపేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు ఉద్రిక్తతల్ని పెంచుతున్నాయి. ఇప్పటికే అస్సామీ భాష మాట్లాడే బ్రహ్మపుత్ర లోయ, బెంగాలీ మాట్లాడే బారక్‌ వ్యాలీ మధ్య విభేదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే ముసాయిదాలో చోటు లభించని వాళ్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్రం అంటోంది. ఎన్నార్సీ కేంద్రాల్లో ఫిర్యాదు చేయొచ్చనీ.. అదీ కాకపోతే విదేశీ ట్రిబ్యునల్‌లో సవాల్‌ చేసుకోవచ్చని సూచిస్తోంది. అయితే ట్రిబ్యునల్‌ తీర్పులు ఎన్నాళ్లకొస్తాయో చెప్పలేని పరిస్థితి.  

వీరిని ఎక్కడుంచాలి?
ఇప్పటికే అస్సాంలో నివసిస్తున్న దాదాపు వెయ్యిమందిని ఈ ప్రత్యేక కోర్టులు విదేశీయులుగా ప్రకటించాయి. వారిలో బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారు. వారందరినీ ఇప్పటికే అరడజనకు పైగా శరణార్థి శిబిరాల్లో ఉంచారు. ట్రిబ్యునల్స్‌ కూడా వీరిని విదేశీయులుగా గుర్తిస్తే వారిని బంగ్లాదేశ్‌కు పంపాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే అనేకసార్లు భారత ప్రభుత్వం ఇలాంటి విదేశీయుల్ని తిప్పిపంపించడానికి ప్రయత్నించగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అనుమతించలేదు.  బంగ్లాదేశ్‌తో మనకు శరణార్థుల అప్పగింతకు సం బంధించిన ఒప్పందాలేమీ లేవు. కొత్త శరణార్థులకు చోటు కల్పించలేమని బంగ్లాదేశ్‌ చేతులెత్తేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ 40 లక్షల మంది శరణార్థుల్ని ఎక్కడ ఉంచాలన్నది కేంద్రం ముందున్న సవాల్‌.

3డీ ఫార్ములా
ఈ ఒప్పందం ప్రకారం ‘3డీ’ ఫార్ములా (డిటెక్షన్‌ (గుర్తింపు), డిలీషన్‌ (తొలగింపు), డిపోర్టేషన్‌(బంగ్లాకు పంపించేయడం)) అమలుచేయాలని నిర్ణయించారు. 1951–61 మ«ధ్య దేశంలోకి వచ్చినవారికి ఓటు హక్కుతో కూడిన పౌరసత్వం ఇస్తారు. 1961–71 మధ్య వచ్చిన వారికి భారత పౌరసత్వం ఉంటుంది. కానీ ఓటు హక్కుండదు. 1971 మార్చి 24 తర్వాత సరైన పత్రాల్లేకుండా ప్రవేశించిన వారిని వెనక్కి పంపించేయాలి. అయితే ఎన్నో సవాళ్ల మధ్య ఎన్నార్సీ రూపకల్పన ఆలస్యమవుతూ వచ్చింది. అసోంలో నిరసనకారులు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ అసోం గణ పరిషత్‌ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా ఈ ప్రక్రియను చేపట్టడంలో విఫలమైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సగం సగమే ఈ పని చేసింది. పౌరసత్వ గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పిల్‌ వేయడంతో సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ విధించింది.

ఎన్నార్సీ వెనక ప్రతీక్‌ హజేలా
ఎన్‌ఆర్‌సీ ముసాయిదా జాబితా రూపొందించడంలో అసోం హోం శాఖ  ప్రధాన కార్యదర్శి ప్రతీక్‌ హజేలా పాత్ర కీలకం. ఢిల్లీ ఐఐటీలో బీటెక్‌ చేసి, ఐఏఎస్‌ అయిన ప్రతీక్‌ ఎన్నార్సీ అనుసంధాన కర్తగా కత్తి మీద సాములాంటి ఒక అత్యంత క్లిష్టమైన ప్రక్రియను చేపట్టారు. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వారసత్వ వివరాలు తెలిసేలా, అవన్నీ అత్యంత పారదర్శకంగా ఉండేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 68 వేల మంది అధికారుల్ని నియమించారు. 2,500 నాగరిక్‌ సేవా కేంద్రాలను ఏర్పాటుచేశారు. అసోంకు చెందిన ఐటీ కంపెనీ బొహ్నమాన్‌ సిస్టమ్స్‌ దీనికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎవరు అసలైన పౌరులో గుర్తించడానికి  2014 సెప్టెంబర్‌లో మొదలైన ఈ కసరత్తు మూడన్నరేళ్లకు పైగా సాగింది. ఇంతటి సంక్లిష్టమైన ప్రక్రియను చేపట్టిన ప్రతీక్‌ ఎన్ని ప్రశంసలు పొందుతున్నారో, అదే స్థాయిలో విమర్శలూ ఎదుర్కొంటున్నారు.  

ఎందుకీ వివాదం?
బంగ్లాదేశ్‌ నుంచి అస్సాంలోకి అక్రమ వలసల వివాదం ఈ నాటిది కాదు. అస్సాంలో భారత పౌరుల కంటే బంగ్లా వలసదారులే ఎక్కువ. 1971లో పాకిస్తాన్‌ యుద్ధం సమయంలో లక్షలాది మంది అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించారు. అప్పటినుంచి వలసదారులు తమ భూములు, ఉద్యోగాలు లాక్కుంటారని, తమ సంస్కృతిని నాశనం చేస్తారని స్థానికుల ఆందో ళన. ఈ పరిణామాలతో అస్సాం ఆరేళ్ల పాటు ఘర్షణలతో అట్టుడికింది. చివరికి 1985 ఆగస్టు 15న.. నిరసనకారులు (ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌), అస్సాం ప్రభుత్వం, నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి జాతీయ పౌరసత్వ గణన చెయ్యాలని మూడు పక్షాలు ఒక అవగాహనకు వచ్చాయి.


ఎన్నార్సీ తుది ముసాయిదాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకునేందుకు సేవా కేంద్రానికి గుర్తింపు పత్రాలతో వచ్చిన అస్సాంలోని మోరీగావ్‌ జిల్లా బుర్గావ్‌ గ్రామస్తులు  


            గువాహటిలో తమ పేర్లు జాబితాలో లేవని పత్రాలు చూపిస్తున్న స్థానికులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement