కోల్‌కతా/డిస్పూర్ : అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు విడుదల చేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) ముసాయిదా జాబితా అస్సాం, పశ్చిమ బెంగాల్‌లతో పాటు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో చిచ్చురేపుతోంది. ఇదివరకే అస్సాంలో ఎన్‌ఆర్‌సీ ముసాయిదా కారణంగా 40 లక్షల మంది పౌరసత్వం కోల్పోయారు. తదుపరి బెంగాల్‌లోనే ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను కేంద్రం చేపట్టనుందన్న వాదన తెరపైకి వచ్చింది. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. మా రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ ఎలా చేపడతారో వారి సంగతి చూస్తామన్నారు. అసలు బెంగాల్‌లో పౌరసత్వాల గురించి తనిఖీ చేయాలన్న సందేహాలు ఎందుకు తలెత్తుతున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కని వారు నిజంగానే విదేశీ అక్రమ వలసదారులు కాదని, భారతీయులే వీటి వల్ల అధికంగా నష్టపోతున్నారని మమత అభిప్రాయపడ్డారు. అస్సాం నుంచి బెంగాళీయులను తరిమి కొట్టేందుకు ఇలాంటి ముసాయిదాలను కేంద్ర చేపట్టిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అస్సాం నుంచి బెంగాలీలను పంపిచేందుకు ఎన్‌ఆర్‌సీ ముసాయిదా అని పేర్కొన్న మమత వ్యాఖ్యలను అస్సాం టీఎంసీ చీఫ్ ద్విపెన్ పాఠక్ ఖండించారు. మమత చేస్తున్న విమర్శలు అర్థరహితమని, ఆమె వ్యాఖ్యల వల్ల అస్సాంలో అల్లర్లు జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మమత వ్యాఖ్యలను నిరసిస్తూ అస్సాం టీఎంసీ చీఫ్ పదవికి ఆయన గురువారం రాజీనామా చేశారు. టీఎంసీ అధినేత్రి చేసిన వ్యాఖ్యల దుష్ప్రభావం, దుష్పరిణామాలను పరోక్షంగా అస్సాంలో తాను ఎదుర్కోవాల్సి వస్తుందన్న నేపథ్యంలో ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment