న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు కాస్తా పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టమైంది మొదలు.. దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేయగా, ప్రతిపక్షాలు సైతం ఈ అంశంపై పోరుకు సన్నద్ధమవుతున్నాయి.
ఎన్‌ఆర్‌సీ అంటే..?
జాతీయ స్థాయిలో అర్హులైన పౌరులదరితో కూడిన జాబితాను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్.. క్లుప్తంగా ఎన్‌ఆర్‌సీ అంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల ఏరివేత కోసం ఇటీవలే ఈ ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పూర్తి చేశారు కూడా. ప్రత్యేక జాతులపై ప్రభావం పడరాదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను అస్సాంలో చేపట్టారు. అయితే అక్కడ ఎన్‌ఆర్‌సీ పూర్తయినప్పటి నుంచి జాతీయ స్థాయిలో అమలుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. హోం మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ అగ్రనేతలు పలువురు ఇందుకు బహిరంగంగానే మద్దతిచ్చారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఓ చట్టం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లు అంచనా. దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీ చట్టం అమల్లోకి వస్తే.. ప్రభుత్వం ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించడంతోపాటు అదుపులోకి తీసుకునేందుకు అవకాశముం టుంది. వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకూ అధికారాలు లభిస్తాయి.
నష్టం ఎవరికి?
ప్రస్తుతానికి ఎన్‌ఆర్‌సీ చట్టం అనేది ఓ ప్రతిపాదన మాత్రమే. అమల్లోకి వస్తే అక్రమ వలసదారులే లక్ష్యంగా మారతారు. అయితే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్, పార్శీలకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. మతపరమైన హింసను స్వదేశాల్లో ఎదుర్కొన్నందుకే ఇక్కడకు వచ్చామని వారు చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే ఎన్‌ఆర్‌సీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పైన చెప్పుకున్న మూడు దేశాలు మినహా మిగిలిన ఏ దేశపు అక్రమ వలసదారు కూడా ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా.. ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలూ చిక్కుల్లో పడతారు.
ఎందుకంటే వీరు పౌరసత్వ చట్ట సవరణ నిబంధనల్లో లేరు కాబట్టి. దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని డిటెన్షన్ కేంద్రాలకు తరలించాల్సి వస్తుంది. అస్సాంలో ఇప్పటికే గుర్తించిన 19 లక్షల మంది అక్రమ వలసదారులను ఇలాగే డిటెన్షన్ కేంద్రాల్లోనే ఉంచారు. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను ఇలా డిటెన్షన్ కేంద్రాలకు తరలించిన తరువాత విదేశీ వ్యవహారాల శాఖ ఆయా దేశాలకు సమాచారం ఇస్తుంది. ఆయా దేశాలు అంగీకరిస్తే వారిని తిప్పి పంపుతారు. దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీకి కట్టుబడి ఉన్నామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారా? అన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది.
ఎన్‌ఆర్‌సీపై ప్రశాంత్ కిషోర్ భగ్గు!
అక్రమ వలసదారులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ నిర్వహిస్తామన్న అధికార బీజేపీ ప్రకటనలపై ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ భగ్గుమంటున్నారు. ఈ చర్య పెద్దనోట్ల రద్దు మాదిరిగానే పేదలు, దిగువ తరగతి వారికి తీవ్ర నష్టం చేయనుందని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment