లోక్‌సభలో మాట్లాడుతున్న అధిర్ రంజన్
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పౌరసత్వ బిల్లు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని ఆ పిటిషన్‌లో ఐయూఎంఎల్ ఆరోపించింది. మత ప్రాతిపదికన ఒక వర్గానికి చెందిన అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించే ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా, గురువారం రాత్రి ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
దాంతో ఈ బిల్లు పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఐయూఎంఎల్ తరఫున న్యాయవాది పల్లవి ప్రతాప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తక్షణమే బిల్లుకు సంబంధించిన కార్యాచరణపై స్టే విధించాలని కోర్టును కోరారు. ఏ చట్టమైనా అక్రమ వలసదారులను ఉద్దేశించి రూపొందించాలంటే.. మతం, కులం, జాతీయత ఆధారంగా కాకుండా.. మొత్తం అక్రమ వలసదారులను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించి చట్టాన్ని రూపొందించాలని పేర్కొన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదే కాదు, అమానవీయమైనది కూడా అని అన్నారు. కాగా, ఈ బిల్లు సుప్రీంకోర్టు కొట్టివేయడం తథ్యమని కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు.
పార్లమెంట్లో రభస
పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ హింసను రాజేస్తోందని అధికార పక్షం వ్యాఖ్యానించడంతో గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజ్వరిల్లుతున్న హింస అంశాన్ని జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి లేవనెత్తారు. ఈ బిల్లు వల్ల మొత్తం ఈశాన్య ప్రాంతమంతా అట్టుడుకుతోందన్నారు. ‘ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఈశాన్యం మరో కశ్మీర్‌లా మారింది’ అన్నారు.
వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ఈ రెండు ప్రాంతాల్లో సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే హింసను రాజేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జోషి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. వారితో పాటు డీఎంకే సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment