బీఆర్‌ఎస్‌లో మిగిలేది ఆ ఐదుగురే: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ | Telangana Govt Whip Adi Srinivas Slams Brs On Party Defections | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో మిగిలేది ఆ ఐదుగురే: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

Published Fri, Nov 22 2024 2:48 PM | Last Updated on Fri, Nov 22 2024 2:54 PM

Telangana Govt Whip Adi Srinivas Slams Brs On Party Defections

సాక్షి,హైదరాబాద్:ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం(నవంబర్‌ 22) ఆది శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు.‘హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడింది. ఎమ్మెల్యేల అనర్హతపై సర్వాధికారాలు స్పీకర్‌కు ఉన్నాయని కోర్టు తేల్చింది.

తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే కోర్టు సూచించింది. నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్‌ నడుచుకుంటారు. కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయంలో ఎగిరెగిరి పడ్డారు.

అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లుగా హడావిడి చేశాడు. చేసిన పాపం గోచిలో పెట్టుకొని కాశీకి పోయినట్లు కేటీఆర్,బీఆర్ఎస్ నేతల తీరు ఉంది. పదేళ్లపాటు రాజ్యాంగాన్ని అపహస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60మందికి పైగా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలను బీఆర్ఎస్ చేర్చుకుంది.

ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను క్యాబినెట్‌లో చేర్చుకొని నైతిక విలువలను తీసుకెళ్లి కాళేశ్వరంలో కలిపారు. పార్టీలకు పార్టీలను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్ లెక్కచేయలేదు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఫిరాయింపులు చేసుకోవచ్చునని నిర్లజ్జగా చెప్పుకొని తిరిగారు.

అధికారం పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌కు రాజ్యాంగం,న్యాయస్థానాలు గుర్తుకు వచ్చాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం.ఐదారుగురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు,కేటీఆర్ గెస్ట్‌హౌస్‌కు,హరీష్‌రావు నార్సింగిహౌస్‌కు పరిమితం కావాల్సిందే’అని ఆది శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యేల అనర్హతపై ట్విస్ట్‌ ఇచ్చిన హైకోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement