జిల్లాలో సివిల్ సప్లయిస్ కార్యదర్శి, కలెక్టర్ పర్యటన
ఎట్టకేలకు ముమ్మరంగా సాగుతున్న ధాన్యం సేకరణ
కంకిపాడు: ఎట్టకేలకు అధికారగణం కదిలింది. ధాన్యం సేకరణలో జరుగుతున్న లోటుపాట్లను సరిచేసేలా చర్యలకు ఉపక్రమించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం సేకరణలో నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం సేకరణ ప్రహసనంగా సాగుతున్న తీరు, రైతుల అవస్థలపై ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఫలితంగా నిన్నటి వరకూ కల్లాల్లోనే ఉన్న ధాన్యం రాశులు ఇప్పుడు మిల్లులకు తరలుతున్నాయి.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.64 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. పది రోజులకుపైగా జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే గోనె సంచులు అందక, రవాణా వాహనాలను సమకూర్చటంలో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడే ధాన్యం రాశులు ఉండిపోయి, మరో వైపు తుపాను భయంతో ఆందోళనకు గురయ్యారు. రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’లో వచి్చన కథనాలతో సివిల్ సప్లయిస్ అధికారులు స్పందించారు.
ఆ శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి ఉయ్యూరు మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. రవాణా శాఖ, రెవెన్యూ అధికారులు ప్రైవేటు వాహనాలను సమకూర్చి గ్రామాలకు పంపుతున్నారు. ఆయా వాహనాల్లో బస్తాలకెత్తిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులకు తరలిస్తున్నారు.
అనంతరం ఉయ్యూరు ఆర్‌డీఓ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై వీరపాండ్యన్ సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలూ తీసుకుంటున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం తేమ శాతమే తుది నిర్ణయం అని, మిల్లర్లు ఆ ప్రకారమే ధాన్యం సేకరించాలని ఆదేశించినట్టు తెలిపారు.
సివిల్ సప్లయిస్ డీఎంగా పద్మాదేవి
ధాన్యం సేకరణలో నెలకొన్న ఇబ్బందులు, రైతులకు కలిగిన అసౌకర్యంపై సివిల్ సప్లయిస్ అధికారులు శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తంగా ఉండటాన్ని గుర్తించారు. సివిల్ సప్లయిస్ ఇన్‌చార్జి డీఎం బాధ్యతల నుంచి డి.సృజనను తప్పించారు.
ఈ మేరకు ఆ శాఖ ఎండీ మనజీర్ జిలానీ సమూన్ మంగళవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఎస్‌పీఎస్ నెల్లూరులో డెప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీహెచ్ పద్మాదేవికి కృష్ణా జిల్లా సివిల్ సప్లయిస్ ఇన్‌చార్జి డీఎంగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మనజీర్ జిలానీ సమూన్ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment