మంత్రులు, ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
నేనొక్కడినే ఎంతో చేస్తున్నా.. మీరు పట్టించుకోవడం లేదు
ఇకపై ప్రభుత్వ ప్రచారాన్ని బాగా పెంచాలి
స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు
సమర్థవంతుడైన సీఈవోను నియమిస్తాం.. ఏడు నెలల్లోనే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు
అమరావతికి ఎనిమిది లైన్లతో అవుటర్ రింగ్ రోడ్డు
20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడు నెలల పాలనలో అద్భుతాలు చేశామని విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులు, ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన వారితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తాను ఒక్కడినే ఎంతో చేస్తున్నానని, కానీ ఎంపీలు, మంత్రులు మాత్రం తన స్థాయిలో పని చేయలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలకు వారి పని తీరును బట్టి ర్యాంకులు ఇచ్చి, వాటి గురించి ఈ సమావేశంలో వివరించారు.
కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మంత్రులు, ఎంపీల పనితీరు బాగుందని చెప్పారు. తూర్పుగోదావరి, వైఎస్సార్ జిల్లాల మంత్రులు వెనుకబడ్డారని మండిపడ్డారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో కొందరు వెనుకబడ్డారని తెలిపారు. ఇకపై ప్రభుత్వ ప్రచారాన్ని బాగా పెంచాలని ఆదేశించారు. పలువురు ఎంపీలు సమావేశానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టీల్ ప్లాంట్‌పై హామీని నెరవేర్చాం
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని ఎన్డీఏ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు.
టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇది సమష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. ‘స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ఢిల్లీలో అనేక సమావేశాలు నిర్వహించాం. చిత్తశుద్దితో ముందుకెళ్లాం. ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రుల అభీష్టం, కార్మికుల శ్రమ ఫలించింది’ అన్నారు. ఈ ఫ్యాక్టరీకి సమర్థవంతుడైన సీఈవోను నియమిస్తామని, స్టీల్ ప్లాంట్‌కు 20 వేల ఎకరాల భూములున్నాయని.. అందరం కలిసి కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఈఏపీ ద్వారా ఇప్పించిందని, పోలవరానికి రూ.12,157 కోట్లు సాధించామని, రైల్వే జోన్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారని అన్నారు. ఏడు నెలల్లో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.2 లక్షల 8 వేల కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని, టీసీఎస్, గూగుల్, ఏఐ, డేటా సెంటర్‌తో మంచి ఫలితాలు వస్తాయన్నారు.
అమరావతికి ఎనిమిది లైన్ల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అనుమతి కోరామన్నారు. రూ.400 కోట్లతో సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరాలయం వంటి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొత్తం మీద 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment