
సాక్షి, కాకినాడ : అవినీతికి నిలయాలుగా... అక్రమాల దందాలకు ఆలవాలాలుగా...అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాలుగా మారిన పౌర సరఫరాల గోదాములపై నిఘా కన్ను పడనుంది. ప్రజా పంపిణీలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలకు కూడా అడ్డుకట్ట వేయడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా పౌరసరఫరాల గోదాముల్లో అక్రమాలకు చెక్ పెట్టడడంలో భాగంగా నిఘా కెమెరాలను అమర్చుతున్నారు.
జిల్లా పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి గోదాములు కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. కాకినాడ, రావులపాలెంలో సొంత గోదాములున్నాయి. వీటి నుంచి జిల్లాలోని 2,666 చౌకధరల దుకాణాలకు నిత్యావసర సరకులను రవాణా చేస్తున్నారు. నెలనెలా రూ.400 కోట్లకు తగ్గకుండా నిత్యావసర సరకులు నిల్వ ఉంచుతున్నారు. వీటిని కాంట్రాక్టర్ల వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారంలోనే అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.
గోదాము రికార్డుల్లో ఉన్న సరుకు మొత్తాలకు వాస్తవంగా ఉన్న సరకు నిల్వలకు భారీగానే తేడాలు ఉంటుంటాయి. ఇంత జరుగుతున్నా ఇంతకాలం అడిగే నాథుడే కరువయ్యాడు. తెల్ల రేషన్ కార్డుపై మంచి బియ్యం అందించాలని సీఎం జగన్ నిర్ణయించడంతో ఇక నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిఘాను పట్టిష్టం చేసి అక్రమాలకు చెక్ పెట్టే ప్రక్రియకు పకడ్బందీగా శ్రీకారం చుట్టారు.
జిల్లా కేంద్రం నుంచే పర్యవేక్షణ
మండల స్థాయి గోదాముల పరిధిలో కెమేరాలను అమర్చి అక్కడ నిత్యం జరిగే లావాదేవీలను జిల్లా కేంద్ర స్థాయిలోనే పర్యవేక్షించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో మండల స్థాయి గోదాముల్లో కెమెరాలను అమర్చారు. ఈ గోదాముల్లో 24 గంటలపాటు ఈ కెమెరాలు ఆన్‌లోనే ఉంటాయి. కెమేరాల నుంచి ఆధారాలు కావాల్సి వచ్చినా తీసుకొనే విధంగా రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఈ పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. డీఎం నిత్యం ఇక్కడి నుంచి మండల స్థాయి లావాదేవీలను పర్యవేక్షించాలి. మండల స్థాయిలో ఏమి జరుగుతుందో డీఎం పర్యవేక్షిస్తే.. డీఎం కార్యాలయం నుంచి మండల స్థాయిలోని లావాదేవీలన్నీ ఎండీ కార్యాలయంలో పర్యవేక్షించే విధంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
మోసాలు ఇక చెల్లవు
జిల్లాలోని మండల స్థాయి గోదాముల నుంచి 16,43,584 తెల్లకార్డులున్న లబ్ధిదారులకు బియ్యం 20,222 మెట్రిక్ టన్నులు, పంచదార 830 క్వింటాళ్లు, కందిపప్పు 165 మెట్రిక్ టన్నులు, రాగులు 500 టన్నులు, జొన్నలు 150 టన్నులు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని పలు గోదాముల్లో బియ్యం, కందిపప్పు మాయంపై కేసులు నమోదైఉన్నాయి. ఇప్పటికీ కొందరు ఉద్యోగులపై కేసులు, విచారణలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
మండల స్థాయి గోదాముల నుంచి ఇచ్చే సరుకుల్లో తూకాల్లో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై ఇక నుంచి నిఘా, పర్యవేక్షణ పెరగనుంది. మండల స్థాయిలో ఉన్న రికార్డుల పరిశీలన జరుగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన గోదాముల్లో ఉన్న తేడాలను బయటకు తీయనున్నారు. ఏ సమాచారం కావాలన్నా, ఎలాంటి సమాచారం అవసరమున్నా వెంటనే తీసుకొనే విధంగా మండల స్థాయి నుంచి డీఎం కార్యాలానికి అనుసంధాన వ్యవస్థను మరింత పటిష్ట పరచనున్నారు. తూకాల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టనున్నారు. అడ్డగోలుగా వ్యవహరించే అధికారులపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే చర్యలు తీసుకొనే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
నిఘా అమలులో
పౌరసరఫరాల ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి నిఘా వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలులోకి తెచ్చారు. ఇందుకోసం కెమెరాల బిగింపు కార్యక్రమం పూర్తయిందని పౌర సరఫరాల డీఎం ఇ.జయరాములు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో అద్దె గోదాములున్న చోట్ల సొంత గోదాములు నిర్మాణాలు జరుగుతున్నాయని, అక్కడ కూడా కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీనిని క్రమేణా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సీఎంఆర్ విధానానికి వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లోనే వ్యవస్థను అన్ని విధాలుగా పటిష్ట పరుస్తామని చెప్పారు. ఈ కెమెరాల వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే కోట్ల రూపాయల దుర్వినియోగానికి చెక్ పెట్టినట్టవుతుందని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment