
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2.96 లక్షల మంది రైతుల నుంచి 21.04 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 1.42 లక్షల మంది రైతులకు రూ.1,969 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా రైతు పొలం ముంగిట నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా ఆధార్ ఆధారిత నగదు జమ పద్ధతులను అవలభిస్తున్నట్టు చెప్పారు.
ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో రైతులకు కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో ఐదు వేల టన్నుల సేకరణ లక్ష్యం కాగా.. 376 మంది రైతుల నుంచి 2,748 టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. 46 మంది రైతులకు రూ.60 లక్షలు జమ చేసినట్టు వివరించారు. అయితే కొన్ని పత్రికలు(సాక్షి కాదు) వాస్తవాలు గ్రహించకుండా రైతులకు చెల్లింపులు జరపట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ఇలాంటి వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వీరపాండియన్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment