Veerapandian
-
ఆ బియ్యం.. ఆరోగ్యానికి అభయం
సాక్షి, అమరావతి: చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో నివేదిక ప్రకారం రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య విజయనగరం జిల్లాలో తాజాగా 78.7 నుంచి 66.7 శాతానికి తగ్గింది, మహిళల్లో రక్తహీనత 75.7 నుంచి 64.6 శాతానికి తగ్గడం గమనార్హం. సరైన పోషకాలు అందక సాధారణం కంటే తక్కువ బరువు ఉన్న మహిళల శాతం 25.8 నుంచి 16.9 శాతానికి తగ్గింది. ఆర్థిక భారం పడినా.. ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్టిఫికేషన్ బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులకు(ఎన్ఎఫ్ఎస్ఏ) మాత్రమే ఈ రకమైన బియ్యాన్ని సరఫరా చేస్తుండగా మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో అందచేస్తోంది. ఎన్ఎఫ్ఎన్ఏలో కూడా కేంద్రం 75 శాతం కార్డులకు మాత్రమే అందిస్తోంది. మూడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్రంపై నెలకు సుమారు రూ.1.70 కోట్లకుపైగా అదనపు భారం పడనుండగా ఏడాదికి రూ. 20.40 కోట్లు అదనంగా ఖర్చు కానుంది. విశాఖపట్నం, కడప జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉన్నందున మొదటి దశలో అక్కడ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. ఈ సీజన్లో 27 లక్షల టన్నుల లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా గతేడాది జూన్ నుంచి మధ్యాహ్నం భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ఫలితంగా చాలా వరకు రక్తహీనత సమస్యలు తగ్గాయి. గత సీజన్లో (ఖరీఫ్, రబీ) 2.4 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సేకరించారు. ప్రస్తుత సీజన్లో 27 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని మిల్లుల్లో ఫోర్టిఫైడ్ రైస్‌ను తయారు చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అంటే? బియ్యపు నూకలను పిండిగా చేసి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి 12 లాంటి కీలక సూక్ష్మ పోషకాలను జోడించి నీళ్లు పోసి ముద్దగా చేస్తారు. ఈ ముద్దను యంత్రంలో వేసి ఎక్స్ట్రాషన్ పద్ధతి ద్వారా బియ్యపు గింజలను తయారు చేస్తారు. ఈ కృత్రిమ బియ్యాన్ని ఆరబెట్టి ప్యాకింగ్ చేస్తారు. వీటినే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అంటారు. ఇవి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. కిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ సేకరణకు ప్రభుత్వం రూ.75 చొప్పున ఖర్చు చేస్తోంది. వంద కిలోల సాధారణ బియ్యంలో ఒక కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్‌ను కలిపి పంపిణీ చేస్తారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే చిన్నారుల్లో మెదడు, వెన్నెముక పెరుగుదలతో పాటు మహిళలకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ సంస్థ టెండర్లు నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను కొనుగోలు చేస్తోంది. దశలవారీగా అన్ని జిల్లాల్లో.. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు ఫోర్టిఫైడ్ బియ్యం మంచి పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ బి –12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. విజయనగరంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చింది. దశలవారీగా అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. – గిరిజా శంకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పోషకాలతో కూడిన ఆహారం పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కడప, విశాఖపట్నం జిల్లాల్లో వీటిని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. చౌక బియ్యం ద్వారా సమకూరే పోషకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో త్వరలో విజయనగరం జిల్లాలో సర్వే నిర్వహిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ -
సకాలంలో ధాన్యం డబ్బుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2.96 లక్షల మంది రైతుల నుంచి 21.04 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 1.42 లక్షల మంది రైతులకు రూ.1,969 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా రైతు పొలం ముంగిట నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా ఆధార్ ఆధారిత నగదు జమ పద్ధతులను అవలభిస్తున్నట్టు చెప్పారు. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో రైతులకు కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో ఐదు వేల టన్నుల సేకరణ లక్ష్యం కాగా.. 376 మంది రైతుల నుంచి 2,748 టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. 46 మంది రైతులకు రూ.60 లక్షలు జమ చేసినట్టు వివరించారు. అయితే కొన్ని పత్రికలు(సాక్షి కాదు) వాస్తవాలు గ్రహించకుండా రైతులకు చెల్లింపులు జరపట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ఇలాంటి వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వీరపాండియన్ హెచ్చరించారు. -
కర్ఫ్యూని కఠినంగా అమలు చేస్తాం: కలెక్టర్ వీరపాండియన్
-
కలెక్టర్‌ను కలిసిన నటుడు సాయికుమార్
సాక్షి, కర్నూలు(అర్బన్): ప్రముఖ చలన చిత్ర నటుడు సాయికుమార్ మంగళవారం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్‌ను స్నేహపూర్వకంగా కలిశారు. బెంగళూరులో షూటింగ్ నిమిత్తంహైదరాబాద్ నుంచి వెళ్తున్న సాయికుమార్ కలెక్టర్ జిల్లా పరిషత్‌లో ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరపాండియన్‌తో తనకు చాలా ఏళ్లుగా స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. స్నేహ పూర్వకంగా కలిశానే తప్ప ఎలాంటి ప్రత్యేకతా లేదని స్పష్టం చేశారు. -
ఆ వార్తలు అవాస్తవం: కలెక్టర్ వీరపాండియన్
సాక్షి, కర్నూల్: జిల్లా జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ కొట్టిపారేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హస్పీటల్లో అన్ని వైద్య సదుపాయలు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని స్పష్టం చేశారు. ఎటువంటి ఆక్సీజన్, బెడ్స్ కొరత వంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. జీజీహెచ్‌లో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందుతున్నారంటూ వస్తున్న మీడియా కథనాలు అవాస్తమని వెల్లడించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా పుకార్లు పుట్టిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పుకార్లను నమ్మి ప్రజాలేవరూ ఆందోళన చెందవద్దని, జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్తగా ప్రభుత్వం కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో 11.5 కేఎల్డీ కెపాసిటీతో పెద్ద ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి పైప్ ద్వారా పేషేంట్స్ ఆక్సీజన్ సరఫరా చేస్తుందని తెలిపారు. (చదవండి: ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ) ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 11.5 కె.ఎల్.డి పెద్ద ఆక్సీజన్ ట్యాంక్ కు అదనంగా ఇంకా పాజిటివ్ కేసులు పెరిగినా ఇబ్బంది కలగకుండా మరో 10 కేఎల్డీ కెపాసిటీతో అదనంగా కొత్త ఆక్సీజన్ ట్యాంక్ నిర్మాణపు పనులు పూర్తి దశలో ఉన్నాయన్నారు. నాగపూర్‌లో ఉన్న డైరెక్టర్ జెనరల్ (హైఎక్స్‌ప్లోజివ్స్) నుండి అనుమతి వచ్చిన వెంటనే అదనపు 10 కేఎల్డీ ఆక్సీజన్ ట్యాంక్‌ను ఉపయోగించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ పేషేంట్స్ ఆక్సీజన్ అందక మృతి చెందుతున్నారు అనేది వాస్తవం కాదు కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ప్రస్తుతం 450 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా సౌకర్యం ఉంది. అదనంగా మరో 1131 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా కోసం చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ ఉన్న పాజిటివ్ కేసులకు గాను డైలీ 120 మందికి మాత్రమే ఆక్సీజన్ అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఆస్పత్రిలో సరిపడా ఆక్సీజన్, బెడ్స్ ఉన్నాయన్నారు. (చదవండి: మరో 26 మంది కరోనాను గెలిచారు..) నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గతంలో 20 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా ఉండగా.. అదనంగా మరో 160 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా సదుపాయం కల్పించామని చెప్పారు. ఆదోని ప్రభుత్వ జనరల్ ఏరియా ఆస్పత్రిలో గతంలో ఆక్సీజన్ సరఫరా ఉన్న బెడ్స్ జీరో ఉండగా ప్రస్తుతం 100 బెడ్స్‌కు కొత్తగా ఆక్సీజన్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో 1581 బెడ్స్‌కు, నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 161 బెడ్స్‌తో పాటు, ఆదోని ప్రభుత్వ ఏరియా జనరల్ ఆస్పత్రిలో 100 బెడ్స్‌కు కలిపి మొత్తం 1841 బెడ్స్‌కు ఆక్సీజన్ సదుపాయం ప్రభుత్వం తరఫున కల్పించామన్నారు. కాబట్టి కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో గాని, జిల్లాలో గాని కోవిడ్ పేషేంట్స్‌కు ఆక్సీజన్, బెడ్స్ కొరత లేదని స్పష్టం చేశారు. కావునా ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, పుకార్లను నమ్మోద్దని ఆయన సూచించారు. పుకార్లు పుట్టించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చారించారు. -
మరో 26 మంది కరోనాను గెలిచారు..
సాక్షి, కర్నూలు: కరోనా వైరస్ నివారణాకు ఏపీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవడంతో కర్నూలు జిల్లాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గడంతో జిల్లా వాసులకు ఉపశమనం కలుగుతుంది. కరోనాను జయించిన మరో 26 మంది బాధితులు గురువారం డిశ్చార్జ్ అయ్యారు. నంద్యాల శాంతిరామ్ కోవిడ్ ఆసుపత్రి నుంచి 16 మంది, కర్నూలు విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి 7 మంది, జీజీహెచ్ స్టేట్ కరోనా ఆసుపత్రి నుంచి ముగ్గురు కరోనా నుంచి కోలుకుని క్షేమంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. (కరోనా: నిప్పు రాజేసిన పేకాట, హౌసీ) డిశ్చార్జ్ అయిన వారిలో 17 మంది పురుషులు, 9 మంది మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో కరోనా బారినుంచి కోలుకుని 194 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వృద్ధులు కూడా అధిక సంఖ్యలో కరోనాను జయించారని తెలిపారు. కరోనా మహమ్మారిని జయించవచ్చనే మనోధైర్యం, నమ్మకం.. ప్రజలకు,యంత్రాంగానికి కలిగిందని కలెక్టర్ తెలిపారు. -
కరోనాను జయించి.. విజేతలుగా నిలిచి..
సాక్షి, కర్నూలు: కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి నియంత్రణ చర్యలను చేపట్టడంతో పలువురు కరోనా బాధితులు సురక్షితంగా డిశ్చార్జ్ అవుతున్నారు. ల్యాబ్ సౌకర్యాల నుంచి ఐసోలేషన్ వార్డుల వరకూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన బాధితులు క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు. ప్రభుత్వం అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడంతో కరోనాను గెలిచి మరో 29 మంది క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం కర్నూలు స్టేట్ కోవిడ్ ఆసుపత్రి నుంచి 9 మంది, విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయినవారిలో 25 మంది పురుషులు కాగా, నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో 50 నుంచి 70 ఏళ్ల వృద్ధాప్య వయస్సుతో పాటు బీపీ, షుగర్, గుండె సంబంధింత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 11 మంది కూడా కరోనాను జయించడం జిల్లా వాసులకు పెద్ద రిలీఫ్ కలిగించింది. ఈ సందర్భంగా కలెక్టర్ వీర పాండియన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో 115 మంది కరోనా విజేతలు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా కరోనాను గెలిచి క్షేమంగా బయటపడిన బాధితులను,వారికి సేవలందించిన వైద్యులను కలెక్టర్ అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ప్రకారం కల్టెకర్, అధికారులు కరోనా విజేతలకు ఒక్కొక్కరికి రెండువేలు నగదు అందజేసి.. ప్రత్యేక వాహనాల్లో వారి ఇళ్లకు పంపించారు. -
కర్నూలులో పెరుగుతున్న కరోనా కేసులు..
సాక్షి, కర్నూలు: జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. మొత్తం 130 కరోనా కేసులు నమోదయినట్లు వెల్లడించారు. ఒకరు డిశ్చార్జ్ కాగా, నలుగురు మృతి చెందారని వెల్లడించారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శాంపిల్స్‌ను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. 1425 శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఈ రోజు నుంచే ప్రారంభమయిందని తెలిపారు. ఢిల్లీ జమాత్‌లో పాల్లొన్నవారిలోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. కరోనా బారినపడి ఒక వైద్యుడు మృతి చెందారని.. ఆసుపత్రికి వెళ్లిన వారిపై దృష్టి పెట్టామన్నారు. వైద్యుడిని కలిసిన 213 మంది పైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించామని.. అందులో 13 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. సెకండరీ కాంటాక్ట్ అయిన 900 మందిని గుర్తించామని.. వారికి కూడా టెస్ట్‌లు నిర్వహిస్తామని కలెక్టర్ వీరపాండియన్ వెల్లడించారు. -
‘వారందరూ తక్షణమే హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి’
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఈ రోజు(శనివారం) 3 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నిర్ధారించినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కర్నూలు నగరం రోజా వీధి, అవుకు, బనాగనిపల్లె పట్టణ కేంద్రాలలో ఒక్కొక్కటి చొప్పున 3 కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. శనివారం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నోస్సంతో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం తిరుపతి, అనంతపురం కరోనా ల్యాబ్‌ల నుంచి మరిన్ని రిపోర్టులు వస్తాయని, రిపోర్టులు వచ్చిన తరువాత కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తామన్నారు. కలెక్టర్ వీరపాండియన్ తెలిపిన వివారల మేరకు: మొత్తం శాంపిల్స్ టెస్టింగ్‌కు పంపినవి 449 వారిలో ఢిల్లీ జయాత్‌కు వెళ్లి జిల్లాకు వచ్చిన వారి శాంపిల్స్ టెస్టింగ్‌కు పంపినవి 338. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం.. అనంతపురం, తిరుపతి కరోనా ల్యాబ్‌ల నుంచి రిపోర్టులు వచ్చినవి:90 (నిన్న రాత్రి 80 నెగెటివ్) ఈ రోజు ఉదయం రిపోర్టులు వచ్చినవి 10 వాటిలో 7 నెగటివ్; పాజిటివ్:3 (ఢిల్లీ జమాత్ వెళ్లి వచ్చిన వారిలో) ప్రజలు ఆందోళన చెందకుండా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి కోసం స్థానిక అధికారులు, పోలీసులు తీసుకునే జాగ్రత్త చర్యలకు సహకరించాలని కలెక్టర్ కోరారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం పాజిటివ్ వచ్చిన 3 కేసుల ప్రాంతాల్లో ..కర్నూలు రోజా వీధి చుట్టు పక్కల 3 కిలోమీటర్ల కంటైన్మెంట్ జోన్, 5 కిలో మీటర్ల బఫర్ జోన్, అవుకు, బనాగనిపల్లె పట్టణాల్లో 3 కిలోమీటర్ల కంటైన్ మెంట్ జోన్, 7 కిలోమీటర్ల బఫర్ జోన్ ప్రకటించామని అన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయిన వారందరూ తక్షణమే హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. వారికి కరోనా టెస్ట్ లు చేయించడానికి, టోటల్ శానిటేషన్ చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్లు, ఇన్సిడెండ్ కమాండర్స్, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ‘‘పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల ప్రకారం నిత్యావసరాలకు ఇబ్బంది లేదు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని మొత్తం 4 సెక్టర్లుగా విభజించి మెడికల్ బృందాలతో ఆ ప్రాంతంలో నివాసమున్న వారందరికీ మెడికల్ స్క్ర్రీనింగ్ చేయిస్తాం. ఆ ప్రాంతమంతా క్రిమీ సంహార రసాయనాల స్ప్రే చేయించి.. శానిటేషన్ చేయిస్తున్నాం. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలోనే ఉండండి..బయటకు రావద్దు.. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించండి. కోవిడ్-19 అనుమాన లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ ఆఫీసర్, మునిసిపల్ కమీషనర్, తహశీల్దార్, ఎంపిడిఓలకు సమాచారం ఇవ్వండి. కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం.. కర్నూలు కరోనా కాల్ సెంటర్ 9441300005 కు లేదా 104 కు కాల్ చేసి కరోనా పై ఏవైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చు. కోవిడ్-19/కరోనా పై వదంతులను/పుకార్లను పుట్టిస్తే లేదా సోషల్ మీడియాలో లేదా మీడియాలో వ్యాప్తి చేస్తే చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం’ అని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. -
అక్రమార్కుల మెడకు బిగుస్తున్నఉచ్చు!
సాక్షి, కర్నూలు : వ్యవసాయశాఖలో చోటు చేసుకున్న రూ.97.55 లక్షల కుంభకోణంలో అక్రమార్కుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. కుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షం గా సంబంధం ఉన్న ఆత్మ పీడీ ఉమామహేశ్వరమ్మ, ఇటీవల పదవీ విరమణ చేసిన జేడీఏ ఠాగూర్‌నాయక్, ప్రస్తుతం నంద్యాల రైతు శిక్షణ కేంద్రంలో ఏడీఏగా ఉన్న గిరీష్, జేడీఏ కార్యాలయంలో ఎన్ఎఫ్ఎస్ఎం సీటు నిర్వహిస్తున్న ఏవో అశోక్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను కలిశారు. ఈ కుంభకోణంపై అప్పటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అప్పటి జేసీ–2 మణిమాలతో సహా నలుగురు సభ్యుల కమిటీని వేశారు. ఈ కమిటీ ప్రస్తుత కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. దీనిని పరిశీలించిన కలెక్టర్ వీరపాండియన్.. కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అయిన జూనియర్ అసిస్టెంట్ రాజేష్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశిస్తూ మిగిలిన నలుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కమిషనర్‌కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో తొలుత రూ.28.65 లక్షలు దారి మళ్లినట్లు తేలింది. దీనిపై అప్పటి జేడీఏ ఠాగూర్‌నాయక్ త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజేష్‌ను అరెస్ట్ చేసి.. రూ.3.50 లక్షలు రికవరీ చేశారు. తర్వాత ఫోర్‌మెన్ కమిటీ విచారణలో జాతీయ ఆహార భద్రత పథకం నిధులు మొత్తంగా రూ.97.55 లక్షలు స్వాహా అయినట్లు తేలింది. ప్రధాన సూత్రధారి రాజేష్‌పై మరోసారి క్రిమినల్ కేసు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత జేడీఏ విల్సన్ దీనిపై రెండు, మూడు రోజుల్లో ఫిర్యాదు చేయనున్నారు. విశ్రాంత జేడీఏ ఠాగూర్‌నాయక్, ఆత్మపీడీ ఉమామహేశ్వరమ్మ, నంద్యాల ఎఫ్‌టీసీ ఏడీఏ గిరీష్, ఏవో అశోక్కుమార్రెడ్డిలపై వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ చర్యలు తీసుకోనున్నారు. కుంభకోణంలో విశ్రాంత జేడీఏకు కూడా సంబంధం ఉండటం వల్ల ఆయనకు చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కుంభకోణాన్ని వ్యవసాయ శాఖ కమిషనర్ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఒక్క జూనియర్ అసిస్టెంటు ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడటం సాధ్యమేనా అనే అనుమానాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
అమరావతి వెళ్లిన కలెక్టర్
అనంతపురం అర్బన్: రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి బుధ, గురువారం నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కలెక్టర్ వీరపాండియన్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. కాన్ఫరెన్స్‌కు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించి నివేదికను రెండు రోజుల క్రితమే సిద్ధం చేసుకున్నారు. కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత కోర్టు పనిమీద హైదరాబాద్‌కు వెళ్తారు. తిరిగి ఈ నెల 23 విధులకు హాజరవుతారని అధికారవర్గాల ద్వారా సమాచారం. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి
అనంతపురం అర్బన్: ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని, ఇందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టుల ద్వారా నిఘాను మరింత పటిష్టం చేయాలన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇసుక పాలసీపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్ని రీచ్‌ల ద్వారా ఇసుక లభ్యత ఉందో ముందుగా గుర్తించాలని గనులు, భూగర్భ వనరులశాఖ ఏడీ వెంకటరావుని ఆదేశించారు. ప్రస్తుతం 55 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్ ఇసుకకు రూ.2 వేలు, టిప్పర్‌కు రూ.4 వేల వరకు అన్ని చార్జీలతో కలిసి వసూలు చేస్తున్నారన్నారు. అంతకు పైబడి కిలోమీటర్ దూరానికి ట్రాక్టర్‌కి రూ.36, టిప్పర్‌కి రూ.73 చొప్పున అదనంగా రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక ధరల మానిటరింగ్‌కు ఏర్పాటు చేసి టాస్క్‌ఫోర్స్ మండల కమిటీలో తహశీల్దారు, ఎంపీడీఓ, పోలీసు అధికారి, ఇరిగేషన్ అధికారులు, డివిజన్ కమిటీలో ఆర్డీఓ, డీఎస్పీ, సంబంధిత శాఖలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారన్నారు. జిల్లా ధరల నియంత్రణ, నోటిఫికేషన్ జారీకి సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ, డీటీసీ, నీటిపారుదల శాఖ ఎస్ఈలు సభ్యులుగా ఉంటారన్నారు. గనులు భూగర్భవనరులశాఖ ఏడీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. వీరితో పాటు అదనంగా పంచాయతీరాజ్, హెచ్ఎల్జీ, హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ ఎస్ఈలు, డీడీ గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులు కూడా సభ్యులుగా చేర్చాలని ఏడీని ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులే ఇసుక అక్రమ రవాణాను అరికట్టే బాధ్యతలను నిర్వర్తిస్తారని అన్నారు. -
సూట్ అడిగితే జైల్లో పెట్టండి
కలెక్టర్ వీరపాండ్యన్ పెద్దపప్పూరు : పంట దిగుబడులు అమ్మే సమయంలో రైతులను సూట్ అడిగే వ్యాపారులపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులకు సూచించారు. కరివేపాకు వ్యాపారులు తమను నిలువునా ముంచుతున్నారని, ఓ వ్యాపారి దాదాపు కోటి రూపాయలు చెల్లించకుండా ఎగ్గొట్టాడని ముచ్చుకోట రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేయడంతో పై విధంగా స్పందించారు. మండలంలో బుధవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా మండలంలోని ముచ్చుకోటలో డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్న అరటి, కరివేపాకు పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఆదాయ వ్యయాలను తెలుసుకున్నారు. నీటి లభ్యతపై ఆరా తీయగా.. రైతులు మాట్లాడుతూ గ్రామంలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో అందరం నీరు లభించే ఒకే ప్రాంతంలో బోరుబావులు తవ్వుకుని పైప్‌లైన్ ద్వారా పొలాలకు నీటిని మల్లించుకుంటున్నామని, దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు అవుతున్నాయని వాపోయారు. గ్రామ సమీపంలోని ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరిస్తే తమ పొలాల్లో ఉన్న బోర్లకు నీళ్లు ఎక్కుతాయని, రిజర్వాయర్‌కు నీళ్లిచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేసి కూలీల ఖర్చయినా తగ్గించాలని కొందరు రైతులు కోరారు. అనంతరం కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన ఇంటిని ప్రారంభించారు. నిర్మాణ వ్యయంతోపాటు ప్రభుత్వం అందించిన సిమెంట్, నగదు వివరాలను లబ్ధిదారులనడిగి తెలుసుకున్నారు. అనంతరం జె.కొత్తపల్లి గ్రామంలోని జాజికొండవాగు వంకలో చేస్తున్న నీరు - చెట్టు పనులను, సోమనపల్లి సమీపంలో కొండపై ఉపాధి పనులను పరిశీలించారు. కూలి డబ్బులు వస్తున్నాయా, గిట్టుబాటు అవుతోందా అంటూ కూలీలతో మాట్లాడారు. అలాగే తిమ్మనచెరువు గ్రామ సమీపంలోని చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రాజెక్టులకు నీటి లభ్యతపై ఇరిగేషన్ అధికారులతో ఆరా తీశారు. ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు ఆయనను కోరారు. పెండేకల్లు ప్రాజెక్ట్‌లో ముళ్లపొదలను తొలగించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరగా ఆ పనులు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్‌తోనే చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మలోల, డ్వామా ఏపీడీ విజయశంకర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ రాజశేఖర్, డీఈ శైలజ, ఏడీఏ వెంకట్‌కుమార్, తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ పరమేశ్వర్, ఏఓ దేవిపద్మలత, ఉద్యానవన అధికారి ఫజులునిస్సాబేగం, హౌసింగ్ ఏఈ సంధ్య, ఏపీఓ పుల్లారెడ్డి, ఇరిగేషన్ ఏఈ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కమిషనర్‌పై వీరంగం!
తిట్లపురాణం అందుకున్న టీడీపీ ప్రజాప్రతినిధులు విజయవాడలో రోడ్డెక్కిన ఫుడ్ కోర్టు తరలింపు రగడ ఎదురుతిరిగిన వ్యాపారులు బంగ్లా వద్ద అర్ధరాత్రి హైడ్రామా మనస్తాపానికి గురైన కమిషనర్ విజయవాడ సెంట్రల్ : కృష్ణా రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్, అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరుతో విజయవాడ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఫుడ్‌కోర్టులను తరలించాలనే ఆలోచనే ఇంతటి వివాదానికి దారితీసింది. అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ బాబు.ఎ, మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్‌కు అప్పగించారు. దీంతో నగరపాలక సంస్థ తరఫున పద్మావతి ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అయితే ఆశించిన స్థాయిలో షాపింగ్ ఫెస్టివల్ విజయవంతం కాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రోడ్డులో ఉన్న ఫుడ్‌కోర్టును తరలించడంలో కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. వ్యాపారులు ఎదురుతిరిగారన్న సమాచారం అందుకున్న కమిషనర్ ఆదివారం అర్ధరాత్రి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఖాళీ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వ్యాపారులు లెక్క చేయలేదు. దీంతో కమిషనర్‌కు చిర్రెత్తుకొచ్చింది. తినుబండారాల్లో ఫినాయిల్, బ్లీచింగ్ పోయాలంటూ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. దీంతో వివాదం ముదిరింది. క్షణాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడకు చేరుకున్నారు. దీంతో సీన్ మారిపోయింది. ప్రజాప్రతినిధులే తిట్లపురాణం లంకించుకోవడంతో కమిషనర్ కారెక్కారు. వ్యాపారులు చుట్టిముట్టి ఆందోళనకు దిగడంతో విధిలేని పరిస్థితిలో నడుచుకుంటూ బంగ్లాకు వెళ్లాల్సి వచ్చింది. జరిగిన విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు బాబు.ఎకు కమిషనర్ ఫోన్‌ద్వారా వివరించారు. ఆయన అక్కడకు చేరుకొనేలోపే వ్యాపారుల ఆందోళన బంగ్లాకు చేరింది. కమిషనర్ బయటకు రావాలని ఆందోళనకారులు రెచ్పిపోయారు. దిమ్మ తిరిగింది ... రాత్రి 10 గంటలకు ప్రారంభమైన ఫుడ్ కోర్టు వివాదం తెల్లవారుజాము మూడు గంటల వరకు కొనసాగింది. కమిషనర్ బంగ్లా వద్ద ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి ఆందోళన జరగడం నగరంలో చర్చనీయాంశమైంది. తమతో ఒక్కమాటైనా చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే గద్దె కమిషనర్‌ను గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది. తిట్టడం, వెంటపడి ఆందోళన చేయడంపై కమిషనర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కార్పొరేషన్ ఉద్యోగుల ద్వారా తెలుస్తోంది. కృష్ణా రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్, అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరుతో నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఫుడ్‌కోర్టులను తరలించాలనే ఆలోచనే ఇంతటి వివాదానికి దారితీసింది. పద్మావతి ఘాట్ వద్దకు ఫుడ్‌కోర్టును తరలించాలని చెప్పిన టీడీపీ ప్రజాప్రతినిధులే ఆందోళనకారులకు కొమ్ముకాయడంతో అధికారులకు దిమ్మ తిరిగి నంతపనైంది. -
చిన్నతరహా వ్యాపారాల ప్రోత్సాహానికి కేపీజీల ఏర్పాటు
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలో చిన్నతరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు అర్హులైన గిరిజన మహిళలతో కూడిన గ్రూపులను గుర్తించాలని ఐటీడీఏ పీవో వీరపాండియన్ సూచించారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిర ంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు, గుండాల అదే విధంగా భద్రాచలం డివిజన్లోని ఎనిమిది మండలాల్లో ఉమ్మడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఒక్కో మండలంలో ఏడు గ్రామాలను ఎంపిక చేసి మొత్తం 70 కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఆయా మండలాల్లో లభ్యమయ్యే పంటల ఆధారంగా ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో మిర్చి ఎక్కువగా పండిస్తున్నందున ఇందుకు సంబంధించిన వ్యాపారాలను ప్రోత్సహించాలన్నారు. ఆయా మండలాల్లో చైతన్య వంతులైన గిరిజన మహిళలతో కృషి ప్రొడ్యూసర్ గ్రూపు(కేపీజీ)లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రూ.5 లక్షల వ్యయంతో కారం మిల్లులను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల్లో తాటి చెట్లు ఎక్కువగా ఉన్నందున అక్కడ తాటి పీచు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అదే విధంగా కూనవరం మండలం కరకగూడెంలో పౌష్టికాహార కేంద్రాలకు సర ఫరా చేసే సరుకుల ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రతిపాదనల ద్వారా గిరిజనులకు లబ్ధిచేకూర్చేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటికి సంబంధించిన వివరాలను సాధ్యమైనంత త్వరగా సర్వే చేసి ఇవ్వాలని ఎస్ఆర్పీలను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐకేపీ ఏపీడీ ఆర్ జయశ్రీ, కొండరెడ్ల ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి, ఏపీవో అగ్రికల్చర్ నారాయణరావు, మర్కెటింగ్ డీపీఎం రంగారావు, సెర్ప్ అధికారి మూర్తి, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఎస్ఆర్పీలు పాల్గొన్నారు. -
ఆరోగ్య కేంద్రాలలో ‘ఈ-పీహెచ్సీ’
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల పనితీరును పరిశీలించేందుకు ‘ఈ-పీహెచ్సీ’ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు ఐటీడీఏ పీఓ వీరపాండియన్ ప్రకటించారు. దీనికి సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రులలో ఇప్పటికే అమలవుతున్న సాప్ట్‌వేర్‌ను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో వైద్యం, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల పనితీరుపై సంబంధిత అధికారులతో ఐటీడీఏ సమావేశపు మందిరంలో శుక్రవారం పీఓ సమీక్ష సమవేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ -పీహెచ్సీ విధానం ద్వారా వైద్యుల పనితీరు మెరుగవుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అందించే వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైద్యాధికారుల పనితీరును పరిశీలించేందుకు ప్రతి నెలలో రెండో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. పీహెచ్సీలలో ఏర్పాటు చేసిన బర్త్ వెయింటింగ్ రూంలపై గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు సరిపడినన్ని ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్లకు వేతనాన్ని వారి ఖాతాలలో జమ చేస్తామన్నారు. వైద్యాధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలని, పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు వెంటనే చేయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పీహెచ్సీలలో మూమెంట్ రిజిస్టర్లను అప్డేట్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుల్లయ్య, డీఎంఓ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు. -
ఆస్పత్రి ఆధునికీకరణకు రూ. 23 కోట్లు
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 23 కోట్ల నాబార్డు నిధులు విడుదల చేసిందని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ అన్నారు. గురువారం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఆయన భవన నిర్మాణాలు చేపట్టాల్సిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ నాబార్డు నిధులతో భవన నిర్మాణాలతో పాటు ఆహ్లాదాన్నిచ్చే మొక్కలు నాటాలని, ఆస్పత్రిని సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. లే-అవుట్ ఫిక్షేషన్లో నూతన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణ అందంగా తీర్చిదిద్దేందుకు లాన్‌గ్రాస్, కూర్చునేందుకు బల్లాలు, అందమైన మొక్కలు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు ఉండాలని హార్టీకల్చర్ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు, స్టోర్‌రూంలు ఉండేలా, ఆస్పత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ముఖ్యమైన మౌళిక సదుపాయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు జిల్లా వైద్యాధికారి పి పుల్లయ్య, ఏపీఓ అగ్రికల్చర్ వై నారాయణరావు, టీఏ బీవీవీ గోపాలరావు, యుగంధర్, శ్రీనాధ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
‘పీసా’తో గిరిజన సాధికారిత
భద్రాచలం, న్యూస్‌లైన్: షెడ్యూల్డ్ ఏరియాలో పీసా (ప్రొవిజన్ ఆఫ్ పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్) పటిష్టంగా అమలయితే గిరిజన సాధికారిత సాధించవచ్చని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ అన్నారు. పీసా చట్టంపై భద్రాచలంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం అధికారులు, సర్పం చులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్య అతిధిగా పీఓ వీరపాండియన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చట్టాలకు లోబడి అటవీ సంపదపై సర్వ హక్కులు పొందవచ్చని అన్నారు. పీసా చట్టం పకడ్బందీగా అమలుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఏజెన్సీలో ఎంపిక చేసిన పదిమంది సర్పంచులకు భద్రాచలంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఆ తరువాత, వీరు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు. పం చాయతీరాజ్ చట్టం ప్రకారం ఏడాదికి నాలుగుసార్లు గ్రామ సభలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అన్నారు. గ్రామ పంచాయతీలోని శివారు గ్రామాల్లో కూడా అవసరమైన సందర్భాల్లో గ్రామసభలు నిర్వహించుకోవచ్చన్నారు. సర్పంచ్ అధ్యక్షతన జరిగే గ్రామసభలో ఉపాధ్యక్షడు, కార్యదర్శిని ఎంపిక చేసుకోవాల్సుంటుందని అన్నారు. గ్రామ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే అభివృద్ధి పనుల ఎంపిక ఉంటుందన్నారు. గ్రామాభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేసి నివేదిక ఇస్తే వాటికి సంబంధించిన నివేధికలను ఇస్తే తిరిగి మరిన్ని పనులు చేపట్టే అవకాశముంటుందని అన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనులపై కూడా గ్రామ సభ చర్చించవచ్చన్నారు. గ్రామస్థాయిలోని ప్రభుత్వ ఉద్యోగులపై కూడా గ్రామ సభ ద్వారా అజమాయిషీ చేయవచ్చని అన్నారు. వారు సరిగా పనిచేయనట్టయితే తొలగించే అధికారం కూడా గ్రామ సభకు ఉంటుందని చెప్పారు. ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం సవ్యంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. పీసా చట్టం అమలులో సర్పంచుల పాత్ర కీలకమైందని అన్నారు.