భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల పనితీరును పరిశీలించేందుకు ‘ఈ-పీహెచ్‌సీ’ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు ఐటీడీఏ పీఓ వీరపాండియన్ ప్రకటించారు. దీనికి సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రులలో ఇప్పటికే అమలవుతున్న సాప్ట్‌వేర్‌ను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో వైద్యం, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల పనితీరుపై సంబంధిత అధికారులతో ఐటీడీఏ సమావేశపు మందిరంలో శుక్రవారం పీఓ సమీక్ష సమవేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ -పీహెచ్‌సీ విధానం ద్వారా వైద్యుల పనితీరు మెరుగవుతుందన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అందించే వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైద్యాధికారుల పనితీరును పరిశీలించేందుకు ప్రతి నెలలో రెండో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. పీహెచ్‌సీలలో ఏర్పాటు చేసిన బర్త్ వెయింటింగ్ రూంలపై గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు సరిపడినన్ని ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్లకు వేతనాన్ని వారి ఖాతాలలో జమ చేస్తామన్నారు. వైద్యాధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలని, పీహెచ్‌సీ భవనాలకు మరమ్మతులు వెంటనే చేయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీలలో మూమెంట్ రిజిస్టర్లను అప్‌డేట్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుల్లయ్య, డీఎంఓ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రాలలో ‘ఈ-పీహెచ్‌సీ’
Published Sat, Dec 28 2013 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement