
వజ్రకరూరు/ ఉరవకొండ: వజ్రకరూరు మండలం ఛాయపురం గ్రామానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు దరూర్ పుల్లయ్య (93) కన్నుమూశారు. సోమవారం బళ్లారి సమీపంలోని కంప్లి వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రం నుంటి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుకు గురై ఆయన ప్రాణాలు విడిచారు.
దరూర్ పుల్లయ్య 1932 జూన్ 20న ఛాయపురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు భార్య సత్యవతితో పాటు కుమారుడు దరూర్ రమేష్, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. మద్రాసులోని లా కళాశాలలో దరూర్ పుల్లయ్య బీఏ, బీఎల్ పూర్తి చేశారు. ఆ తరవాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1969 నుంచి 1974 వరకు ఛాయపురం సర్పంచ్‌గా సేవలందించారు.
ఆ తర్వాత ఉరవకొండ సమితి అధ్యక్షులుగా పనిచేశారు. 1962 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 1977, 1980 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. 1976 నుంచి 1995 వరకు అనంతపురం ఏపీ లైటింగ్ ఎండీగా, కంప్లి షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గానూ పనిచేశారు. నీటి పారుదల రంగంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన దరూర్ పుల్లయ్య జిల్లాలో తాగు, సాగునీటి కల్పన కోసం కృషి చేశారు. పుల్లయ్య మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.