సూట్ అడిగితే జైల్లో పెట్టండి
- కలెక్టర్ వీరపాండ్యన్
పెద్దపప్పూరు : పంట దిగుబడులు అమ్మే సమయంలో రైతులను సూట్ అడిగే వ్యాపారులపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులకు సూచించారు. కరివేపాకు వ్యాపారులు తమను నిలువునా ముంచుతున్నారని, ఓ వ్యాపారి దాదాపు కోటి రూపాయలు చెల్లించకుండా ఎగ్గొట్టాడని ముచ్చుకోట రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేయడంతో పై విధంగా స్పందించారు. మండలంలో బుధవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు.
ముందుగా మండలంలోని ముచ్చుకోటలో డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్న అరటి, కరివేపాకు పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఆదాయ వ్యయాలను తెలుసుకున్నారు. నీటి లభ్యతపై ఆరా తీయగా.. రైతులు మాట్లాడుతూ గ్రామంలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో అందరం నీరు లభించే ఒకే ప్రాంతంలో బోరుబావులు తవ్వుకుని పైప్‌లైన్ ద్వారా పొలాలకు నీటిని మల్లించుకుంటున్నామని, దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు అవుతున్నాయని వాపోయారు. గ్రామ సమీపంలోని ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరిస్తే తమ పొలాల్లో ఉన్న బోర్లకు నీళ్లు ఎక్కుతాయని, రిజర్వాయర్‌కు నీళ్లిచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేసి కూలీల ఖర్చయినా తగ్గించాలని కొందరు రైతులు కోరారు.
అనంతరం కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన ఇంటిని ప్రారంభించారు. నిర్మాణ వ్యయంతోపాటు ప్రభుత్వం అందించిన సిమెంట్, నగదు వివరాలను లబ్ధిదారులనడిగి తెలుసుకున్నారు. అనంతరం జె.కొత్తపల్లి గ్రామంలోని జాజికొండవాగు వంకలో చేస్తున్న నీరు - చెట్టు పనులను, సోమనపల్లి సమీపంలో కొండపై ఉపాధి పనులను పరిశీలించారు. కూలి డబ్బులు వస్తున్నాయా, గిట్టుబాటు అవుతోందా అంటూ కూలీలతో మాట్లాడారు. అలాగే తిమ్మనచెరువు గ్రామ సమీపంలోని చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రాజెక్టులకు నీటి లభ్యతపై ఇరిగేషన్ అధికారులతో ఆరా తీశారు.
ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు ఆయనను కోరారు. పెండేకల్లు ప్రాజెక్ట్‌లో ముళ్లపొదలను తొలగించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరగా ఆ పనులు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్‌తోనే చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మలోల, డ్వామా ఏపీడీ విజయశంకర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ రాజశేఖర్, డీఈ శైలజ, ఏడీఏ వెంకట్‌కుమార్, తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ పరమేశ్వర్, ఏఓ దేవిపద్మలత, ఉద్యానవన అధికారి ఫజులునిస్సాబేగం, హౌసింగ్ ఏఈ సంధ్య, ఏపీఓ పుల్లారెడ్డి, ఇరిగేషన్ ఏఈ నాయక్ తదితరులు పాల్గొన్నారు.