భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలో చిన్నతరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు అర్హులైన గిరిజన మహిళలతో కూడిన గ్రూపులను గుర్తించాలని ఐటీడీఏ పీవో వీరపాండియన్ సూచించారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిర ంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు, గుండాల అదే విధంగా భద్రాచలం డివిజన్‌లోని ఎనిమిది మండలాల్లో ఉమ్మడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఒక్కో మండలంలో ఏడు గ్రామాలను ఎంపిక చేసి మొత్తం 70 కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఆయా మండలాల్లో లభ్యమయ్యే పంటల ఆధారంగా ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో మిర్చి ఎక్కువగా పండిస్తున్నందున ఇందుకు సంబంధించిన వ్యాపారాలను ప్రోత్సహించాలన్నారు.
ఆయా మండలాల్లో చైతన్య వంతులైన గిరిజన మహిళలతో కృషి ప్రొడ్యూసర్ గ్రూపు(కేపీజీ)లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రూ.5 లక్షల వ్యయంతో కారం మిల్లులను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల్లో తాటి చెట్లు ఎక్కువగా ఉన్నందున అక్కడ తాటి పీచు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అదే విధంగా కూనవరం మండలం కరకగూడెంలో పౌష్టికాహార కేంద్రాలకు సర ఫరా చేసే సరుకుల ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రతిపాదనల ద్వారా గిరిజనులకు లబ్ధిచేకూర్చేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటికి సంబంధించిన వివరాలను సాధ్యమైనంత త్వరగా సర్వే చేసి ఇవ్వాలని ఎస్‌ఆర్‌పీలను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐకేపీ ఏపీడీ ఆర్ జయశ్రీ, కొండరెడ్ల ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి, ఏపీవో అగ్రికల్చర్ నారాయణరావు, మర్కెటింగ్ డీపీఎం రంగారావు, సెర్ప్ అధికారి మూర్తి, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఎస్‌ఆర్‌పీలు పాల్గొన్నారు.
చిన్నతరహా వ్యాపారాల ప్రోత్సాహానికి కేపీజీల ఏర్పాటు
Published Sat, Jan 4 2014 5:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement