అదనపు బియ్యం..ఏదో భయం? | Niranjan Reddy Says Millers Do not need to worry | Sakshi

అదనపు బియ్యం..ఏదో భయం?

May 1 2019 3:34 AM | Updated on May 1 2019 3:34 AM

Niranjan Reddy Says Millers Do not need to worry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గడచిన ఖరీఫ్‌ సీజన్‌లో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద వచ్చిన బియ్యాన్ని తరలించడంలో గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను వెంటనే తీసుకునేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సిద్ధంగా ఉన్నా..వాటిని ఇచ్చేందుకు మిల్లర్లు వెనకడుగు వేస్తుండటంతో సమస్య తలెత్తుతోంది. నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా ఎఫ్‌సీఐ కొర్రీలు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బియ్యం అప్పగింతకు మిల్లర్లు తటపటాయిస్తున్నారు.మరో వైపు ఇప్పటికే యాసంగి సీజన్‌ ఆరంభం కావడంతో కొత్తగా వచ్చే బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక పౌర సరఫరాల శాఖ కలవరపడుతోంది.

ఈ ఏడాది ఖరీఫ్‌లో తెలంగాణలో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అయింది. పౌరసరఫరాల శాఖ 40.42 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం  మిల్లర్లకు అప్పగించింది. రైస్‌ మిల్లర్ల నుంచి ‘సీఎంఆర్‌’ కింద ముడి బియ్యాన్ని ఏటా రేషన్‌ అవసరాల మేరకు సరిపడే నిల్వలను పక్కనబెట్టగా, మిగిలిన 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల రారైస్, 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ బియ్యం (ఉప్పుడు బియ్యం)  ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇందులో బాయిల్డ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ మిల్లర్ల నుంచి సేకరించగా, ముడి బియ్యం మాత్రం తీసుకోలేదు.గత నెల పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌ అశ్వినీ కుమార్‌తో సమావేశమై మిల్లర్ల నుంచి రారైస్‌ను సైతం సేకరించాలని కోరారు. దీనికి ఎఫ్‌సీఐ అంగీకరించింది. అందుకు అనుగుణంగా 54వేల మెట్రిక్‌ టన్నుల రారైస్‌ను సేకరించింది.

మిగతా 2.96లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అప్పగించడంలో మాత్రం మిల్లర్లు వెనకడుగు వేస్తున్నారు. నూక ఎక్కువగా ఉన్నా, పాలిష్‌ తక్కువగా ఉన్నా, మిగతా ప్రమాణాల్లో ఎక్కడ తేడావచ్చినా వాటిని ఎఫ్‌సీఐ వెనక్కి పంపుతుంది. అదే జరిగితే మిల్లర్లకు నష్టం వస్తుంది. ఈ నేపథ్యంలో మిల్లర్లు విముఖత చూపుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో పౌర సరఫరరాల శాఖ 40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 2,830 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, 1,51,066 మంది రైతుల నుంచి రూ.1836 కోట్ల విలువైన 10.38 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో 9.44 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించింది. ఈ నిల్వలు సైతం వస్తున్న సమయంలో పాత నిల్వలను ఖాళీ చేయడం ఎలా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఖాళీ చేయకుంటే పౌర సరఫరాల శాఖకు గోదాముల్లో నిల్వ సామర్ధ్యం తగ్గుతుంది. నాణ్యతలో ఇబ్బంది తలెత్తుతుంది. దీంతో మిల్లర్లు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నగా మారింది. 

మిల్లర్లు ఆందోళన చెందొద్దు : మంత్రి నిరంజన్‌
రైస్‌ మిల్లర్ల దగ్గర ఉన్న కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ తీసుకుంటుందని, ఈ విషయం లో  మిల్లర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శా ఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రక టనలో స్పష్టం చేశారు. మిల్లర్ల దగ్గర ఉన్న 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి బియ్యాన్ని తీసుకో వడానికి ఎఫ్‌సీఐ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఒకవేళ ఎఫ్‌సీఐ తీసుకోని పక్షంలో ఏం చేయాలనే దానిపై పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థకు చెందిన నలుగురు సీనియర్‌ అధికారుల తో కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కమిటీ నివేదికను అందిస్తుం దని, నివేదిక రాగానే ముఖ్యమంత్రితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి మిల్లర్లకు హామీ ఇచ్చారు. రైస్‌ మిల్లర్ల సమస్యల పరిష్కా రంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఎ లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement