కొత్త బేరం!
సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ 6.5 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా సేకరించాల్సిన పరిస్థి మిల్లర్ల తీరుపై పౌరసరఫరాల శాఖ గుర్రు వంద శాతం సీఎమ్మార్ రైస్ అందజేసిన మిల్లుల నుంచే బియ్యాన్ని సేకరించేందుకు సిద్ధం పభుత్వ నిర్ణయంతో మింగుడుపడని రైస్‌మిల్లర్లు బియ్యం కొనాలంటూ లాబీయింగ్ చేస్తున్న జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం నేత
కరీంనగర్ : సర్కారు సొమ్మును మిల్లర్లు సోకు చేసుకోవడమంటే ఇదేనేమో! రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి నిర్దేశిత సమయంలో బియ్యం సరఫరా చేయాల్సిన రైస్‌మిల్లర్లు నిబంధనలను తోసిరాజేసి తమ వ్యాపారాలకు వాడుకుంటూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా నేటికీ రైస్‌మిల్లర్లే వద్దే ఉండిపోయింది. మిల్లర్ల నుంచి బియ్యం రాకపోవడంతో రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని మళ్లీ కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తద్వారా ఈ ఏడాది ప్రభుత్వంపై రూ.2వేల కోట్లకుపైగా అదనపు భారం పడబోతోంది. మిల్లర్ల తీరుపై గుర్రుగా ఉన్న పౌరసరఫరాల శాఖ వంద శాతం కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అందజేసిన మిల్లర్ల నుంచే బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఇది మింగుడు పడని జిల్లాకు చెందిన రైస్‌మిల్లర్ల సంఘం నేత హైదరాబాద్‌లో మకాం వేసి తనుకున్న పలుకుబడితో ఆ జీవోను సడలించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తూ ప్రభుత్వానికి నష్టం చేకూర్చే పనిలో పడ్డారు. అందుకోసం మంత్రితో తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని పౌరసరఫరాల శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి 2.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా ఇవ్వాలని రైస్‌మిల్లర్లకు అప్పగించారు. నిబంధనల ప్రకారం 15 నుంచి 45 రోజుల్లోగా కస్టమ్ మిల్లింగ్ చేసి ఇవ్వాల్సి ఉంది. మిల్లింగ్ చేసినందుకు క్వింటాలు దొడ్డు బియ్యానికి రూ.30, ఉప్పుడు బియ్యానికి రూ.50 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.
కస్టమ్ మిల్లింగ్ గడువు ముగిసినప్పటికీ నేటికీ పూర్తి స్థాయిలో బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 65 శాతం బియ్యం మాత్రమే పౌరసరఫరాల శాఖకు అప్పగించారు. మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్ల వద్దే ఉంచుకుంటూ వందల కోట్ల రూపాయల వ్యాపారం నడిపిస్తున్నారు.
అధికారులు సీరియస్...
నిర్దేశిత గడువులోగా మిల్లింగ్ రైస్ పంపాలంటూ పౌరసరఫరాల శాఖ మొత్తుకున్నా మిల్లర్లు పట్టించుకోకపోవడం లేదు. రైస్‌మిల్లర్ల నిర్వాకంవల్ల పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం నిల్వలు పౌరసరఫరాల శాఖ వద్ద లేకపోవడంతో మళ్లీ కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఈ సీజన్‌లో 6లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్‌మిలర్ల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కిలో బియ్యం 24 రూపాయల చొప్పున కొనుగోలు చేసి పేదలకు రూపాయికే కిలో బియ్యం చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లర్ల నుంచి సకాలంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం రాకపోవడంవల్లే మళ్లీ బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రభుత్వానికి రూ.2040 కోట్లు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. మిల్లర్ల తీరుతో విసిగిపోయిన పౌరసరఫరాల శాఖ అధికారులు వందశాతం కస్టమ్ మిల్లింగ్ చేసిన మిల్లుల నుంచి మాత్రమే బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు.
అడ్డుకుంటున్న జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం నేత
సరిగ్గా ఇదే సమయంలో జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం నేత రంగప్రవేశం చేశారు. మంత్రికి సన్నిహితుడనని చెప్పుకునే సదరు నేత ఇతర జిల్లాలకు చెందిన మిల్లర్ల సంఘం నేతలను కూడగట్టి హైదరాబాద్‌లో మకాం వేశారు. ఆ జీవోను సవరించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. అందుకోసం ఉన్నతస్థాయిలో పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉందంటూ రైస్‌మిల్లుల యజమానుల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు తెలిసింది. ఒకవైపు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులపైన, మరోవైపు మంత్రి పేషీపైన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మంత్రి ఈటల రాజేందర్ మాత్రం ఈ విషయంలో మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గకుండా వందశాతం కస్టమ్ మిల్లింగ్ చేసిన మిల్లర్ల నుంచే బియ్యాన్ని కొనుగోలు చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.