
సాక్షి, అమరావతి బ్యూరో: పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా విచ్చలవిడిగా సాగుతోంది.టీడీపీ అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా చిలకలూరిపేట మారింది. మంత్రి కనుసన్నల్లోనే ఈ దోపిడీ సాగుతుండటంతో అధికారులు సైతం ఏమి చేయలేక చేతులెత్తేస్తున్నారు. రోజుకు సరాసరిన ఈ నియోజక వర్గం నుంచి భారీగా రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్ట్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడనుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ఎన్నికలు ముగిశాక అధికారులు రేషన్ మాఫియాపై దృష్టి సారించారు.
వివిధ జిల్లాల బియ్యం ఇక్కడనుంచే....
ఇటీవల చిలకలూరిపేట నియోజకవర్గంలో వారం వ్యవధిలోనే పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడటం గమనార్హం. ఈ నెల 6వ తేదీన చిలకలూరిపేట మండలం మానుకొండువారిపాలెంలో 3,245 క్వింటాళ్ల బియ్యం, యడ్లపాడు మండలం కొత్తసొలసలో ఈ నెల 12వ తేదీన 164 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, మిల్లులు, గోడౌన్‌లో పౌరసరఫరాల అధికారులు పట్టుకొన్నారు. గతంలో పలు మార్లు ఇక్కడే పట్టుబడటం విశేషం. చిలకలూరిపేట మండలం గణపవరంలో రేషన్ బియ్యం అక్రమ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలంలో సైతం ఇటీవల ఓ మిల్లులో రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు.
మొత్తం మీద చిలకలూరిపేట నియోజకవర్గం గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉండటంతో రెండు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల నుంచి రేషన్ బియ్యం ఇక్కడికి తరలించి రీసైక్లింగ్ చేసి, బియ్యాన్ని ప్లాస్టిక్ సంచుల్లోకి మార్చి కాకినాడ పోర్ట్‌కు తరలించి, అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని చిలకలూరిపేటలోని రేషన్ బియ్యం డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు భోగట్టా. గతంలో ఈ ముఠాలకు మంత్రి అండ ఉండటంతో, అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. ఎన్నికలు ముగిశాక రేషన్ అక్రమ రవాణాపై భారీ ఎత్తున ఫిర్యాదులు రావటంతో, పౌరసరఫరాల శాఖ అధికారులు అక్రమ దందాపై దృష్టి సారించారు. అధికారులు రేషన్ బియ్యం డంపులపై దాడులు చేసినప్పుడు అధికారులపై మంత్రి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు పౌరసరఫరాల ఉన్నతాధికారుల్లోనే చర్చ సాగుతోంది.
అక్రమ దందా ఇలా...
రేషన్ డీలర్లు, కార్డు దారులనుంచి కిలో రూ.7 చొప్పున కొనుగోలు చేసి, చిలకలూరిపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యాన్ని ప్లాస్టిక్ సంచుల్లోకి మార్చుతారు. ఆ తరువాత మిల్లులో రీ సైక్లింగ్ చేసి చక్కగా ప్యాక్ చేసి కొంతమేర రాష్ట్రంలోనే కిలో రూ.20 నుంచి రూ.25లకు విక్రయిస్తారు. ఎక్కువ మొత్తంలో చెక్ పోస్టుల వద్ద మేనేజ్ చేసి, కాకినాడ సమీపంలోని మిల్లులకు తరలించి, అక్కడి నుంచి వారి బిల్లులతో కాకినాడ పోర్ట్‌కు తరలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment