prattipati Pulla Rao
-
ప్రత్తిపాటి దోపిడీ లో బయటపడ్డ సంచలన నిజాలు
-
AP: ప్రత్తిపాటి కుమారుడికి రిమాండ్.. జైలుకు తరలింపు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా : జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు శరత్‌ను శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు తరలించారు. గురువారం రాత్రి అరెస్టు అనంతరం శరత్‌ను పోలీసులు విజయవాడలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. శరత్ రిమాండ్ పై రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. శరత్ తరపున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే తరహా కేసు తెలంగాణలో కూడా నమోదు చేసినట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్.ఐ.ఆర్ లు పెట్టడం నిబంధనలకు విరుద్దమని తెలిపారు. కాగా, జీఎస్టీ ఎగవేత కేసులో గురువారం రాత్రి శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్లో శరత్‌పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. వీరిలో పుల్లారావు భార్య, బావమరిది ఉన్నారు. ఇదీ చదవండి.. అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ -
‘రేషన్ మంత్రి’ ఇలాకాలోనే రీసైక్లింగ్
సాక్షి, అమరావతి బ్యూరో: పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా విచ్చలవిడిగా సాగుతోంది.టీడీపీ అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా చిలకలూరిపేట మారింది. మంత్రి కనుసన్నల్లోనే ఈ దోపిడీ సాగుతుండటంతో అధికారులు సైతం ఏమి చేయలేక చేతులెత్తేస్తున్నారు. రోజుకు సరాసరిన ఈ నియోజక వర్గం నుంచి భారీగా రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్ట్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడనుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ఎన్నికలు ముగిశాక అధికారులు రేషన్ మాఫియాపై దృష్టి సారించారు. వివిధ జిల్లాల బియ్యం ఇక్కడనుంచే.... ఇటీవల చిలకలూరిపేట నియోజకవర్గంలో వారం వ్యవధిలోనే పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడటం గమనార్హం. ఈ నెల 6వ తేదీన చిలకలూరిపేట మండలం మానుకొండువారిపాలెంలో 3,245 క్వింటాళ్ల బియ్యం, యడ్లపాడు మండలం కొత్తసొలసలో ఈ నెల 12వ తేదీన 164 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, మిల్లులు, గోడౌన్లో పౌరసరఫరాల అధికారులు పట్టుకొన్నారు. గతంలో పలు మార్లు ఇక్కడే పట్టుబడటం విశేషం. చిలకలూరిపేట మండలం గణపవరంలో రేషన్ బియ్యం అక్రమ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలంలో సైతం ఇటీవల ఓ మిల్లులో రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. మొత్తం మీద చిలకలూరిపేట నియోజకవర్గం గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉండటంతో రెండు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల నుంచి రేషన్ బియ్యం ఇక్కడికి తరలించి రీసైక్లింగ్ చేసి, బియ్యాన్ని ప్లాస్టిక్ సంచుల్లోకి మార్చి కాకినాడ పోర్ట్‌కు తరలించి, అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని చిలకలూరిపేటలోని రేషన్ బియ్యం డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు భోగట్టా. గతంలో ఈ ముఠాలకు మంత్రి అండ ఉండటంతో, అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. ఎన్నికలు ముగిశాక రేషన్ అక్రమ రవాణాపై భారీ ఎత్తున ఫిర్యాదులు రావటంతో, పౌరసరఫరాల శాఖ అధికారులు అక్రమ దందాపై దృష్టి సారించారు. అధికారులు రేషన్ బియ్యం డంపులపై దాడులు చేసినప్పుడు అధికారులపై మంత్రి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు పౌరసరఫరాల ఉన్నతాధికారుల్లోనే చర్చ సాగుతోంది. అక్రమ దందా ఇలా... రేషన్ డీలర్లు, కార్డు దారులనుంచి కిలో రూ.7 చొప్పున కొనుగోలు చేసి, చిలకలూరిపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యాన్ని ప్లాస్టిక్ సంచుల్లోకి మార్చుతారు. ఆ తరువాత మిల్లులో రీ సైక్లింగ్ చేసి చక్కగా ప్యాక్ చేసి కొంతమేర రాష్ట్రంలోనే కిలో రూ.20 నుంచి రూ.25లకు విక్రయిస్తారు. ఎక్కువ మొత్తంలో చెక్ పోస్టుల వద్ద మేనేజ్ చేసి, కాకినాడ సమీపంలోని మిల్లులకు తరలించి, అక్కడి నుంచి వారి బిల్లులతో కాకినాడ పోర్ట్‌కు తరలిస్తారు. -
కృష్ణ..కృష్ణా..!
► డబ్బుల్లేవ్..అంచనాలు తగ్గించండి ► పుష్కర పనులపై అధికారుల అంతర్గత ఆదేశాలు ► ఆహ్వానించిన టెండర్ల రద్దుకు చర్యలు ► స్నానఘాట్లలో భక్తులకు తప్పని ఇక్కట్లు చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ ఓ వైపు ప్రకటనలు చేస్తుంటే, మరో వైపు ఉన్నతాధికారులు పుష్కర పనుల అంచనాలనుతగ్గిస్తున్నారు. చిన్నపాటి మరమ్మతులతో పాత ఘాట్లను పూర్తి చేసి, అత్యవసర పనులనుచేయాలంటున్నారు. ఇప్పటి వరకు చేసిన అంచనాల మొత్తాలను 80 శాతం తగ్గించాలని, ఆహ్వానించిన టెండర్లను రద్దు చేయాలని అంతర్గత ఆదేశాలు ఇస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : గోదావరి పుష్కరాల కంటే వైభవంగా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు రూ.1500 కోట్ల వరకు నిధులు కేటాయిస్తామన్నారు. దీంతో వివిధ శాఖల ఇంజినీర్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పాత స్నానఘాట్లను పరిశీలించారు. అవసరమనుకున్న ప్రాంతంలో కొత్త ఘాట్ల నిర్మాణాలకు అంచనాలు తయారు చేశారు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పడేసి పాత ఘాట్లకు తాత్కాలిక మరమ్మతులు చేయడానికి అంచనాలు తయారు చేయాలని, ఘాట్ల వద్ద భక్తులు పడిపోకుండా గ్రిప్ టైల్స్ ఏర్పాటుకు అంచనాలు తయారు చేస్తే, అవేమీ అక్కర్లేదు పాడైపోయిన ఘాట్లకు సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయాలని, గ్రిప్ టైల్స్ వేయకుండా ఘాట్లకు రెడాక్సైడ్ రంగు వేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. కృష్ణా నదిలో నీటిమట్టం గరిష్టంగా పడిపోయిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన భక్తులు స్నానమాచరించడానికి నదిలో ఒక పాయను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను నిలిపివేసి, జల్లు స్నానంకు అంచనాలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నెల 12న విజయవాడ నీటిపారుదల సర్కిల్ కార్యాలయం, విజయవాడ కేసీ డివిజన్ ఇంజినీర్లు ప్రకాశం బ్యారేజి దిగువనున్న 33 పుష్కర ఘాట్ల మర్మమతులకు టెండర్లు ఆహ్వానించారు. సుమారు రూ.20 కోట్ల విలువైన పనులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ప్రొక్యూర్మెంట్ మార్కెట్ ప్లేస్‌లో ఏర్పాటు చేశామని వివిధ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు ఒక్క విజయవాడ పరిధిలోనే పుష్కర ఘాట్లకు రూ.20 కోట్లకుపైగా నిధులు కేటాయింపు జరిగినట్టు ఆ నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలుసుకున్న కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత కృష్ణాజిల్లా కలెక్టర్ ఆ అంచనాల మొత్తాలను 80 శాతం తగ్గించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఆ శాఖ ఇంజినీర్లు బిత్తరపోవడమే కాకుండా పుష్కర ఘాట్లకు గ్రిప్టైల్స్ వేయకుండా మరమ్మతులు చేస్తే భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు. అదే అభిప్రాయాన్ని వెల్లడించినా, టైల్స్ అవసరం లేదు. రెడ్ ఆక్సైడ్ వేయండంటూ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా అంచనాల మొత్తాలను పూర్తిగా తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో సాగునీటిశాఖ అధికారులు పనులు ఎలా పూర్తి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. గుంటూరు జిల్లాలోనూ ఇంతే... గుంటూరు జిల్లాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వివిధ శాఖల అధికారులు చేసిన అంచనాలకు భిన్నంగా అరకొరగా నిధులు మంజూరు చేయడంతో ముఖ్యమైన పనుల జాబితాలను తయారు చేసే పనిలో అధికారులున్నారు. పుష్కర ఘాట్లకు రూ.150 కోట్లతో అంచనాలు తయారు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.65 కోట్లను మంజూరు చేసింది. సీతానగరం ఘాట్‌లో 3 పనులకు రూ.20 కోట్లతో అంచనాలు తయారు చేస్తే రూ.15 కోట్లకు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని మొత్తం అన్ని శాఖలు రూ.485 కోట్లతో అంచనాలు తయారు చేస్తే ఇప్పటి వరకు రూ.360 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అంచనాలను భారీ ఎత్తున రూపొందించినప్పటికీ, ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉండడంతో వాటిలో కోత విధిస్తోంది. ఆగస్టులో జరగనున్న ఈ పుష్కరాలకు ఇంకా ప్రతిపాదనలు దశ పూర్తికాకపోవడం, టెండర్లు ఆహ్వానించే దశలోనే అధికారులు ఉండడంతో పనులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.