కొనుగోళ్లకు అధిక ప్రా'ధాన్యం' | Rice cultivation at a record level in AP | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లకు అధిక ప్రా'ధాన్యం'

Published Tue, Apr 27 2021 3:44 AM | Last Updated on Tue, Apr 27 2021 3:44 AM

Rice cultivation at a record level in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. కోవిడ్‌ ఉధృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ యంత్రాంగమే తమ ముంగిటకు వచ్చి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోతలు ముందుగా ప్రారంభమైన పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొనుగోళ్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 6,731 మంది రైతుల నుంచి రూ.181.07 కోట్ల విలువైన 96,916 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. నెల్లూరు జిల్లాలో 3,398 మంది రైతుల నుంచి రూ.90.20 కోట్ల విలువైన 47,807 టన్నులు, ప్రకాశం జిల్లాలో 1,514మంది రైతుల నుంచి రూ.23.52 కోట్ల విలువైన 12,506 టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే సేకరించారు. ఈ మూడు జిల్లాల్లో వారం రోజుల వ్యవధిలోనే రూ.294.79 కోట్ల విలువైన 1,57,229 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

రికార్డు స్థాయిలో వరి సాగు
చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది రబీలో రికార్డు స్థాయిలో 23,61,937 ఎకరాల్లో వరి సాగయ్యింది. హెక్టారుకు సగటున 7,025 కేజీల చొప్పున సుమారు 66.37 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు.  అందులో కనీసం 45లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న రబీ ధాన్యంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 48 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మాసూళ్లను పూర్తి చేసిన రైతులు ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు.

‘కృష్ణా’లో అత్యధికంగా 428 కేంద్రాలు
ఇప్పటివరకు 50 వేల మంది రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోగా.. వీటికి అనుబంధంగా ఏర్పాటు చేసిన 1,552 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. గ్రేడ్‌–ఏ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,880, కామన్‌ వెరైటీ ధాన్యానికి రూ.1,860 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 428 కేంద్రాలు ఏర్పాటు చేయగా, తూర్పు గోదావరిలో 373, పశ్చిమ గోదావరిలో 350, నెల్లూరు జిల్లాలో 183, ప్రకాశం జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 67, కడపలో 6, విజయనగరంలో ఒకటి చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

రైతులకు ఇబ్బంది లేకుండా..
వరుసగా రెండో ఏడాది కూడా సాగునీరు పుష్కలంగా ఇవ్వడంతో గత రబీతో పోలిస్తే ఈ ఏడాది రబీలో సాగు విస్తీర్ణం పెరిగింది. మంచి దిగుబడులొస్తాయని అంచనా వేశారు. కోతలు ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో కొనుగోలు సమయంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా సాకుతో దళారులు చెప్పే మాయమాటల్ని నమ్మి రైతులెవరూ మోసపోవద్దు. కనీస మద్దతు ధర కంటే ఒక్క రూపాయి తక్కువకు కూడా ఏ ఒక్కరూ ధాన్యాన్ని అమ్ముకోవద్దు. సకాలంలో చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
– కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement