సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. మిల్లుల్లో నిల్వ ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం సేకరణ పేరుతో రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 ఎల్‌ఎంటీల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో రూ.300 కోట్లు..మొత్తం రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో బి–టాక్స్, యు–ట్యాక్స్, ఆర్‌ఆర్– ట్యాక్స్ రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు శంభీపూర్ రాజు, పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు.
4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు..
‘బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2022–23 యాసంగిలో రైతుల నుంచి సేకరించి మిల్లర్ల దగ్గర నిల్వ ఉంచిన 35 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపింది. అధికారంలోకి వచ్చి 50 రోజులైనా కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25న కమిటీ వేసి, మార్గదర్శకాలు జారీ చేశారు. క్వింటాలుకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేయానికి రైస్ మిల్లర్లు ముందుకు వచ్చినప్పటికీ తిరస్కరించి గ్లోబల్ టెండర్లు పిలిచారు.
ప్రత్యేక నిబంధనలతో కేవలం 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాకాఫ్ అనే నాలుగు సంస్థలు బిడ్లను దక్కించుకున్నాయి. గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయనందుకు కేంద్రీయ భండార్ అనే సంస్థను 2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ కోసం నిబంధనలు సడలించింది..’అని కేటీఆర్ విమర్శించారు.
టెండర్ మొత్తానికంటే అదనంగా వసూళ్లు
‘మిల్లర్లు క్వింటాలు రూ.2,100కు కొంటామన్నప్పటికీ సగటున రూ.200 తగ్గించి రూ.1,885– రూ.2,007 మధ్య ఆ 4 సంస్థలు కొనేలా ఒప్పందం చేశారు. టెండర్ మార్గదర్శకాల ప్రకారం 90 రోజుల్లో 35 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి రూ.7,500 కోట్లు చెల్లించాలి. మిల్లర్లతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. కానీ మిల్లర్లతో ఆయా సంస్థలు నేరుగా ఆర్థిక లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయి. గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకుపోకుండా రైస్ మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడ్డాయి.
టెండర్లు వేసిన మొత్తానికి కాకుండా అదనంగా చెల్లించాలంటూ రాష్ట్రంలోని 4 వేల మంది రైస్ మిల్లర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ‘సీఎం పేషీకి ఖర్చయ్యింది.. ఢిల్లీకి పోవాలి.. పార్లమెంటు ఎన్నికలు’అంటూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.236 అదనంగా చెల్లించి తీరాలని ఒత్తిడి చేస్తున్నారు. క్వింటాలుకు రూ.236 ఎక్కువగా ఇస్తే ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు క్లియరెన్స్ ఇస్తామంటూ బంపరాఫర్ కూడా ఇచ్చారు. ఈ మేరకు జలసౌధలో అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
దాదాపు 35 ఎల్‌ఎంటీలకు గాను కింటాలుకు రూ.200 చొప్పున రూ.700 కోట్ల అదనపు డబ్బు మనీలాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారు. మరోవైపు ధాన్యం లిఫ్ట్ చేసేందుకు గడువు ఈ నెల 23తో అయిపోయింది. ఇప్పటికీ 20 శాతం కూడా లిఫ్ట్ చేయలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. కానీ తమకు రావాల్సిన రూ.700 కోట్లు మొత్తం వాళ్ల చేతికి రాలేదు కాబట్టి ఈ డెడ్‌లైన్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు..’అని కేటీఆర్ ఆరోపించారు.
సన్న బియ్యం పేరిట మరో స్కాం
‘రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి 2.20 ఎల్‌ఎంటీల సన్న బియ్యం కావాలి. వీటి కోసం కూడా పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ పిలిచింది. ఇందులో కూడా అవే నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధర కిలో రూ.42–45 ఉంది. కానీ బహిరంగ మార్కెట్, మిల్లర్లను పక్కనబెట్టి టెండర్ల పిలిచారు. కిలోకు రూ.15 అదనంగా అంటే రూ.57కు టెండర్ ఖరారు చేశారు.
2.20 ఎల్‌ఎంటీలకు కిలోకు అదనంగా రూ.15 చొప్పున రూ.300 కోట్ల స్కామ్ జరిగింది. ఇలా మొత్తంగా రూ.1,000–1,100 కోట్ల స్కామ్ జరిగింది..’అపి కేటీఆర్ వివరించారు. ‘మా ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసిన దాంట్లో 1.6 ఎల్‌ఎంటీల సన్న ధాన్యం ఉంది. దాన్ని మిల్లింగ్ చేసి విద్యాశాఖకు ఇస్తే.. కేవలం 60 వేల టన్నులే కొనాల్సి వచ్చేది. కానీ 1.6 ఎల్‌ఎంటీల సన్న ధాన్యం కిలో రూ.22.59 పైసలకు అమ్మేశారు..’అని విమర్శించారు.
‘పౌర సరఫరా’లో రూ.1,000 కోట్ల స్కాం!: కేటీఆర్
Published Mon, May 27 2024 4:51 AM | Last Updated on Mon, May 27 2024 4:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment