పౌర సరఫరాల శాఖలో రూ.1,100 కోట్ల స్కాం జరిగింది: కేటీఆర్
ఇందులో మంత్రి ప్రమేయం లేకున్నా పెద్దల ప్రమేయం ఉందని ధ్వజం
సభాసంఘానికి డిమాండ్ చేసిన బీఆర్‌ఎస్.. ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్
ఇది సభనా..? బస్టాండా?.. ఇదేం పద్ధతి: భట్టి
ఏదీ జరగకుండానే జరిగినట్లు ఆరోపించడం తగదు: ఉత్తమ్
సమాధానమిచి్చనా కూడా సభ నుంచి పారిపోయారు: శ్రీధర్‌బాబు
అసెంబ్లీలో సివిల్ సప్లయ్స్ పద్దుపై చర్చ
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కాం జరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోళ్లలో జరిగిన కుంభకోణంపై సభాసంఘాన్ని నియమించా లన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించనందున, ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి తమ పార్టీ సభ్యు లతో కలిసి మంగళవారం రాత్రి శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియకుండా సివిల్ సప్లయ్స్ శాఖలో చాలా జరుగుతున్నాయని ఆరోపించారు.
రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమా ధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రతిపక్షం ఏం చెప్పినా ప్రభుత్వానికి రుచించటం లేదని దుయ్యబట్టారు. దీనిలో మంత్రి హస్తం లేకపోయినా పెద్దల హస్తం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ కుంభకోణంపై హౌజ్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్‌కాట్ చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు సభా సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లో బైఠాయించి చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కలి్పంచుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సన్న బియ్యం కొనలేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ.. సన్నబియ్యం ఒక్క గింజకూడా కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. తన శాఖలో ఏమి జరిగినా అందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని, ఏదీ జరగకుండానే జరిగినట్లు ఆరోపించడం తగదని చెప్పారు. మీ హయాంలో రబీలో సేకరించిన ధాన్యం మిల్లుల్లో లేదన్నారు. అప్పట్లో ప్రభుత్వం ధాన్యం విక్రయానికి టెండర్లు పిలిస్తే క్వింటాల్‌కు రూ. 1700 మాత్రమేనని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక దొడ్డు బియ్యానికి రూ.2007, సన్నధాన్యానికి రూ.2400 ఇచి్చనట్లు గుర్తు చేశారు.
పారిపోయారు: శ్రీధర్‌బాబు
పౌరసరఫరాల పద్దుపై విపక్ష సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా సమాధానం ఇచ్చినా కూడా వారు సభ నుంచి పారిపోయారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. వారి హయాంలో అన్ని అవకతవకలేనని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క రైతుకైనా పంట నష్టపరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు.
సభనా..? బస్టాండా..?: భట్టి విక్రమార్క
‘ఇది సభనా? బస్టాండా? సభలో వెల్‌లోకి వచ్చి చప్పట్లు కొట్టడం ఏంటి..? వీరు మంత్రులుగా పనిచేశారు.. ఇదేం పద్ధతి? పదేళ్లు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఒక్క రోజైనా మేము ఇలా సభామర్యాదలను అగౌరవపరిచేలా చేశామా? వెల్‌లోకి వచ్చి చప్పట్లు కొట్టడం, ప్లకార్డులు ప్రదర్శించడం సబబు కాదు. సభాసంప్రదాయాలను మంట కలిపేలా వ్యవహరించడం సరికాదు. ప్రజలు ఇప్పటికే వారికి (బీఆర్‌ఎస్) బుద్ధి చెప్పారు. బుద్ధి తెచ్చుకొని వారిని సీట్లలోకి వెళ్లి కూర్చోమనండి అధ్యక్షా..! సభాసంప్రదాయాలు పాటించే వారే ఈ సభలో ఉండాలి’ అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment