సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానంతో పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు అడ్డు వేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేసింది. పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో 5 టన్నుల సామర్థ్యం ఉన్న ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను (ఈవేయింగ్ మెషీన్), ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నింపే యంత్రాలను (ప్యాడీ ఫిల్లింగ్ మెషీన్) ప్రవేశపెట్టాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే రబీ నుంచి కొన్ని కొనుగోలు కేంద్రాల్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. అనంతరం ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. రేషన్ డీలర్లకు కచ్చితమైన తూకంతో నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థకు చెందిన 170 గోదాముల్లో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ఏర్పాటు చేయబోతోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ శనివారం చర్లపల్లిలోని మెట్‌వే ఇండియా ఫ్యాక్టరీలో ఈ యంత్రాల పనితీరును పరిశీలించారు. మార్చి 31 నాటికి అన్ని గోదాముల్లో ఎలక్ట్రానిక్ తూకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ యంత్రాలను సాఫ్ట్‌వేర్ ద్వారా పౌరసరఫరాల భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు, జిల్లాల్లో మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లకు అనుసంధానం చేస్తామని చెప్పారు. దీని ద్వారా వేయింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎనిమిదో తరగతి విద్యార్థి అభిషేక్ కనిపెట్టిన ధాన్యాన్ని నింపే యంత్రాన్ని వచ్చే యాసంగి (రబీ) నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశపెట్టాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.
విద్యార్థి అభిషేక్‌కు అభినందన..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న అభిషేక్ ప్యాడీ ఫిల్లింగ్ మెషీన్‌ను తయారుచేశారు. అభిషేక్ తల్లిదండ్రులు రాజవ్వ, లక్ష్మీరాజ్యం, సిరిసిల్ల జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మీన్, స్కూల్ హెడ్‌మాస్టర్ ఉమారాణి, గైడ్ వెంకటేశంలు శనివారం పౌరసరఫరాల భవన్‌లో కమిషనర్ అకున్ సబర్వాల్‌కు ఈ యంత్రం పనితీరు గురించి వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ అభిషేక్‌కు రూ. 10 వేల నగదు, రోబో బొమ్మను బహూకరించి, అభిషేక్‌కు మంచి భవిష్యత్తు ఉందని ప్రశంసించారు. రైతులకు ఎంతో ఉపయోగపడే ఈ యంత్రాన్ని కనిపెట్టిన అభిషేక్‌ను అభినందించారు. యంత్రానికి సంబంధించి కొన్ని మార్పులు సూచించారు. అభిషేక్ తయారు చేసిన యంత్రం చిన్నదిగా ఉందని, హమాలీలకు సరిపోయే విధంగా ఎత్తును పెంచాలని కోరారు. ప్రస్తుతం ఈ యంత్రం 20 కేజీల బరువును మాత్రమే తూకం చేసే విధంగా ఉందని, దీన్ని 40–45 కిలోల బస్తా బరువు మోసే విధంగా, కొద్దిగా వెడల్పుగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మార్పులు చేసిన తరువాత కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. యంత్రం భద్రత విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
వరి అభిషేక్ పేరుతో పేటెంట్ హక్కులు..
తెలంగాణ ప్రభుత్వం పేరుతో పాటు ’వరి అభిషేక్’ పేరుతో పేటెంట్ హక్కులను తీసుకుంటామని అకు న్ సబర్వాల్ అన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మెషీన్‌తో నలుగురు చేసే పనిని ఒక్కరే చేయవచ్చు. దాని బరువును కూడా కొలవవచ్చు. బస్తా నిండిన తర్వాత ఎక్కడ నిల్వ చేయాలో అక్కడి వరకు ఈ యంత్రంతోనే తరలించవచ్చు. రైతులకు సమయం, డబ్బు ఆదా చేయడమే కాకుండా, శ్రమ కూడా తగ్గుతుంది. ఈ యంత్రాన్ని రైతులు వారి పొలంలో, ఇళ్ల వద్ద, ఐకేపీ సెంటర్లలో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ యంత్రం ద్వారా కూలీల కొరతనూ అధిగమించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment