ధాన్యం ఆరబెడుతున్న రైతులు
- యాసంగిలో 80 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పౌర సరఫరాల శాఖ, ఇప్పటికే 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది.
- కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, గద్వాల వంటి జిల్లాల్లో గత ఏడాది యాసంగి కన్నా ఈసారి రెట్టింపునకు పైగా ధాన్యం సేకరించారు.
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణలో రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోంది. 2019-20లో 1.11 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన ప్రభుత్వం.. 2020–21 ఏడాది రెండు సీజన్లలో కలిపి ఏకంగా 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి చరిత్ర నెలకొల్పింది. ఒక్క యాసంగి సీజన్‌లోనే లక్ష్యానికి మించి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం విశేషం. గత ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో నీటి సమృద్ధి పెరిగింది. దీంతో యాసంగిలో కేవలం వరి పంటే 53 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. ఉత్పత్తికి అనుగుణంగా ప్రభుత్వం ధాన్యం సేకరణ చేపట్టి దాదాపుగా పూర్తి చేసింది. ఇప్పటికే 90 లక్షల మెట్రిక్ టన్నుల మార్కును దాటగా, మరో యాభై వేల నుంచి లక్ష టన్నుల మేర ధాన్యం సేకరించి ఈ సీజన్‌కు ముగింపు పలకనుంది. గత సీజన్‌లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది.
నిండుగా కాల్వలు.. అలుగు దుంకిన చెరువులు
రాష్ట్రంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల కింది కాల్వలన్నీ నిండుగా పారాయి. ఆరు నుంచి ఏడు తడులుగా నీటిని పారించడంతో పంటలకు కావాల్సినంత నీరు అందింది. దీనికితోడు 46 వేలకు పైగా చెరువులకు గానూ 38 వేలకు పైగా చెరువులు అలుగు దుంకాయి. ఈ నేపథ్యంలో 53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా.. 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేశారు. అందులో స్థానిక అవసరాలకు పోనూ 80 లక్షల టన్నులు సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లక్ష్యానికి మించి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. దీని విలువ సుమారు రూ.17 వేల కోట్ల మేర ఉండగా, ఇందులో రూ.14 వేల కోట్ల చెల్లింపులు పూర్తి చేసినట్లు పౌర సరఫరాల సంస్థ వర్గాలు వెల్లడించాయి.
ఏడేళ్లలో ఐదింతలు పెరిగిన సేకరణ
రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఏడేళ్ల కాలంలో ఐదింతలకు పైగా పెరిగింది. నిరంతర విద్యుత్, రైతుబంధు, కాళేశ్వరం సహా చెరువుల ద్వారా పెరిగిన నీటి లభ్యత కారణంగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా ఉంది. దీనికి తగ్గట్లే గత ఏడాది యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. తాజాగా కరోనా, హమాలీల కొరత, లాక్‌డౌన్ వంటి పరిస్థితులను అధిగమించి సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో 6,967 కేంద్రాల ద్వారా 15 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటివరకు 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం.
- మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment