సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రైస్ కార్డుదారులందరికీ సబ్సిడీపై కందిపప్పు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జనవరిలో ఎనిమిదివేల టన్నుల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 23వ తేదీలోగా మండలస్థాయి నిల్వ కేంద్రాలకు (ఎంఎల్‌ఎస్ పాయింట్లకు) సరుకు తరలించనుంది. ప్రస్తుత నెలలో 46.64 లక్షల మందికి సుమారు 4,604 టన్నుల కందిపప్పును కిలో రూ.67కే అందించింది. గిరిజన ప్రాంతాల్లోని జీసీసీల ద్వారా కూడా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలు సాగించేలా ప్రోత్సహించనుంది.
ఏడాదిగా మార్కెట్‌లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి. మహారాష్ట్రలో భారీవర్షాలకు కందిపంట పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కందిపప్పునకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లోకి కొత్తపంట వస్తుండటంతో రేటు నెమ్మదిగా దిగొస్తోంది. ఒకప్పుడు మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.115 ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రేటు రూ.160–170కి పెరిగినా సబ్సిడీని తగ్గించలేదు. మధ్యలో మూడు, నాలుగునెలలు మార్కెట్‌లో లోటు ఉండటంతో పీడీఎస్‌లో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇకపై నిరంతరాయంగా పంపిణీ చేసేలా పౌరసరఫరాలశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది.
గోధుమపిండికి డిమాండ్
పీడీఎస్ లబ్దిదారులకు వీలైనన్ని ఎక్కువ పౌష్టికాహార పదార్థాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో ఫోరి్టఫైడ్ (విటమిన్లతో కూడిన) గోధుమపిండిని పరిచయం చేసింది. ప్రజల నుంచి స్పందన బాగుండటంతో నెమ్మదిగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం నెలకు మూడువేల టన్నుల గోధుమపిండి సరఫరా చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటా పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కిలో రూ.16కే అందిస్తుండటం గమనార్హం.
లబ్ధిదారులకు దీన్ని మరింత తక్కువ రేటుకు ఇచ్చేలా పౌరసరఫరాలశాఖ కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపనుంది. రైస్ కార్డుదారుల ఇష్టం మేరకు కిలో బియ్యానికి బదులు కిలో గోధుమపిండి ఇవ్వనుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బియ్యం పరిమాణాన్ని తగ్గించుకుని దానికి బదులు గోధుమలను సరఫరా చేస్తుంది. వాటిని ప్రాసెసింగ్ చేసి ఫోరి్టఫైడ్ అనంతరం ప్యాకింగ్, రవాణాకు అయ్యే ఖర్చులను లెక్కించి పౌరసరఫరాలశాఖ ధర నిర్ణయించనుంది.
ఈ విధంగా కిలో రూ.11–12కే గోధుమపిండి ఇవ్వొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులకు మాత్రమే నెలకు 1,800 టన్నుల గోధుమలను కేంద్రం అందిస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పంపిణీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొత్తం కార్డుదారులకు గోధుమపిండిని అందుబాటులో ఉంచేలా కసరత్తు చేస్తోంది. వీటితోపాటు పంచదార, రాయలసీమలో చిరుధాన్యాల పంపిణీకి అవసరమైన నిల్వలను తరలిస్తోంది.
నెలాఖరులోగా కందుల సేకరణ
పౌరసరఫరాలసంస్థ ద్వారా స్థానిక రైతుల నుంచి మద్దతు ధరకు కందులు సేకరించడంతోపాటు వాటిని ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసి తిరిగి పీడీఎస్‌లోకి ప్రవేశపెట్టేలా పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ నెలాఖరులోగా ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. అవసరమైతే మార్కెట్ రేటును చెల్లించైనా రైతుల నుంచి 35 వేల టన్నులకుపైగా కందులను సేకరించాలని నిర్ణయించింది. ధాన్యం మాదిరిగానే రవాణా, కూలీ, గోతాల ఖర్చులను సైతం రైతులకు ఇవ్వనుంది. కందులు సేకరించిన వారంలోగా రైతుల ఖాతాల్లో మద్దతు ధరను జమచేయనుంది.
నాణ్యతలో రాజీలేకుండా
ఇప్పటివరకు పీడీఎస్‌లో పంపిణీ చేస్తున్న కందిపప్పు బయట ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నదే. తొలిసారిగా ఏపీలో పండిన పంటను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి మర ఆడించి ప్రత్యేక ప్యాకింగ్‌లో రైస్ కార్డుదారులకు ఇవ్వాలని నిర్ణయించాం. తద్వారా అక్కడక్కడ కందిపప్పు నాణ్యతపై వస్తున్న విమర్శలను అధిగమించవచ్చు.
ఏపీ అవసరాలకు తగినంత నిల్వలను ఇక్కడే సేకరిస్తాం. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇకపై జాప్యం లేని పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకేలోని క్షేత్రస్థాయి సిబ్బంది, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలసంస్థ సిబ్బంది సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించి కందులు కొనుగోలు చేస్తా – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాలశాఖ
Comments
Please login to add a commentAdd a comment