వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ | Distribution of pulses from next month | Sakshi
Sakshi News home page

వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ

Published Fri, Oct 27 2023 4:51 AM | Last Updated on Fri, Oct 27 2023 4:51 AM

Distribution of pulses from next month - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల (నవంబర్‌) నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కిలో చొప్పున అందించనుంది. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు హైదరాబాద్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ (హాకా)కు ఆర్డర్‌ ఇచ్చింది. అయితే హాకా వద్ద కూడా తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల సరఫరాకు అంగీకరించింది.

ఇందులో భాగంగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనుంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే నెల అవసరాలకు గాను 2,300 టన్నుల సరఫరాకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా పప్పుధాన్యాల కొరతతో రేట్లు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లిపోవడంతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)వద్ద కూడా నిల్వలు కరువయ్యాయి. ఫలితంగా కందిపప్పు పంపిణీకి అవాంతరాలు ఏర్పడ్డాయి.  

ఈ నెలాఖరుకు సరుకు తరలింపు 
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హాకా నుంచి మద్దతు ధర ప్రాతిపదికనే కందులు సేకరించినప్పటికీ.. వాటికి అదనంగా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు అవ్వనున్నాయి.

ఈ మొత్తంలో రూ.67కు మాత్రమే కిలో కందిపప్పును ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వనుంది. అంటే దాదాపు సబ్సిడీ రూపేణా ప్రభుత్వం రూ.70పైగానే భరిస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు నాటికి చౌక ధరల దుకాణాల వద్దకు అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సరుకును తరలించనుంది. డిసెంబర్, జనవరిల్లో పూర్తి స్థాయిలో కార్డుదారులకు సబ్సిడీ కందిపప్పును ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.   

మార్కెట్‌ రేటుకే కందుల కొనుగోలు 
రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా 50 వేల టన్నుల కందిపప్పును కేటాయించాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసింది. తొలుత కర్ణాటకలోని బఫర్‌ స్టాక్‌ నుంచి 9,764 టన్నులు కందులు కేటాయించగా వాటిలో నాణ్యత లోపించింది. ఆ తర్వాత రెండుసార్లు జూన్, సెపె్టంబర్‌ల్లో కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ, కేంద్రం నుంచి స్పందన రాలేదు.

మండల స్టాక్‌ సెంటర్‌ (ఎంఎల్‌ఎస్‌)ల్లోని స్టాక్‌ మొత్తాన్ని పంపిణీకి విడుదల చేయడంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం హాకా నుంచి కందిపప్పును తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలలకు హాకా సరఫరా చేసే కందిపప్పును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది.

భవిష్యత్తులో అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు జనవరి నుంచి పౌరసరఫరాల సంస్థ ద్వారా నేరుగా రైతుల నుంచి మార్కెట్‌ ధరకు ప్రభుత్వం కందులు సేకరించనుంది. తొలుత ఈ ఖరీఫ్‌లో 30 వేల టన్నులు సేకరించాలనే యోచనలో ఉన్నారు. వాటిని స్వయంగా మరాడించి ప్యాకింగ్‌ చేయించి సబ్సిడీపై కార్డుదారులకు అందించేలా ప్రణాళిక రూపొందించారు.

బాబుగారి ‘పప్పు’ డ్రామా 
అంతర్జాతీయంగా మార్కెట్‌ ఒడిదుడుకులకు లోబడి డిమాండ్, సప్లై ఆధారంగా నిత్యావసరాల రేట్లు మారుతుంటాయి. చంద్రబాబు హయాంలో రేట్లు ఎంత పెరిగినా ఇచ్చే సబ్సిడీ మాత్రం పెరిగేది కాదు. పైగా ఆయన పాలన చేపట్టిన తర్వాత సెపె్టంబర్‌ 2014–జూలై 2015 వరకు కందిపప్పు ఊసే లేదు. ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున రూ.50 నుంచి రూ.120 మధ్యన రేట్లు పెంచి విక్రయించారు.

2015 డిసెంబర్‌లో ఏకంగా రూ.90కి పెంచారు. 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120 చేశారు. 2018లో కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.63 ఉన్నప్పుడు  చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.23 రాయితీ ఇచ్చింది. చివరి ఏడాది మాత్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు కిలోల కందిపప్పు డ్రామా ఆడారు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మొత్తం పంపిణీ చేసింది కేవలం 93 వేల టన్నులు మాత్రమే. ఇందు కోసం రూ.1605 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 3.15 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.3,084 కోట్లు ఖర్చు చేసింది. కరోనా సమయంలో నిత్యావసరాలను పూర్తి ఉచితంగా అందించింది.

కార్డుదారులకు నిరంతరాయంగా పంపిణీ చేసేలా చర్యలు 
కార్డుదారులకు ప్రతి నెలా నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాం. హాకా ద్వా­రా కందిపప్పును సేకరిస్తున్నాం. ఇప్పటికే నాణ్యత ప్రమాణాలను పరిశీలించాం. ఈ నెలాఖరు నాటికి ఎఫ్‌పీ దుకాణాలకు సరుకు చేర్చేలా ఆదేశాలు జారీ చేశాం. డిసెంబర్, జనవరిల్లో వంద శాతం కార్డులకు పంపిణీ చేస్తాం. ఈ ఖరీఫ్‌లో రైతుల నుంచి కందులు కొనుగోలు చేయనున్నాం.

ఇప్పటికే అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు కందుల కొనుగోలుపై ప్రచారం కల్పించాలని ఆదేశించాం. మన రైతుల నుంచి మార్కెట్‌ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్ర వినియోగానికి వాడుకుంటే.. రైతులకు, లబ్దిదారులకు ఎంతో మేలు జరుగుతుంది.      – హెచ్‌.అరుణ్‌ కుమార్,  కమిషనర్, పౌరసరఫరాల శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement