సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోయింది. గురువారం ఉదయం హైదరాబాద్ మినహా ఇతర జిల్లాలో లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ మొదలవగా, మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం నుంచి వచ్చిన అత్యవసర ఆదేశాల నేపథ్యంలో రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. బియ్యం పంపిణీ నిలిపివేతకు గల కారణాలను అటు ప్రభుత్వం కానీ, పౌర సరఫరాల శాఖ కానీ వెల్లడించలేదు. మొత్తంగా 2.80 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టి గురువారం ఉదయం నుంచి పంపిణీ మొదలు పెట్టింది. కరీంనగర్‌లో ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీని ఆరంభించగా, మిగతా చోట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేలు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించారు.
ఈ పంపిణీలో లబ్ధిదారులు ఒకే దగ్గర గుమికూడకుండా వార్డుల వారీగా, టోకెన్ పద్ధతిన పంపిణీ మొదలు పెట్టారు. అయితే కొన్ని చోట్ల ఉచిత బియ్యం కావడంతో జనాలు ఎగబడ్డారు. 20మందికి మించి రావద్దని విన్నవించినా వందల సంఖ్యలో ఎగబడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకా చాలా చోట్ల ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పంపిణీ జరిగింది. ఇక మరోపక్క ఈ–పాస్, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి కీ రిజిష్టర్ ఆధారంగా పంపిణీకి అవకాశం ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం సైతం విన్నవించింది. ఇలా అయితేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని తెలిపింది. ఈ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాక మధ్యాహ్నం మూడు గంటలకు ఎక్కడికక్కడ బియ్యం సరఫరా నిలిపివేయాలని అత్యవసర ఆదేశాలు వెళ్లాయి. దీంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది.
దీనిపై పౌర సరఫరాల అధికారుల వివరణ కోరగా, స్పష్టమైన సమాధానం రాలేదు. చాలా జిల్లాల్లో ఇంకా పూర్తి స్థాయిలో బియ్యం రేషన్ దుకాణాలకు సరఫరా కాలేదని, ఈ దృష్ట్యా అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న కారణంతోనే నిలిపివేసి ఉంటారని ఒక అధికారి తెలుపగా, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దానిపై స్పష్టత వచ్చాక 12 కిలోల బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మరో అధికారి స్పష్టం చేశారు. ఈ అంశంపై శుక్రవారం స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment