ration dealars
-
రేషన్ బియ్యం: బస్తాకు 4 నుంచి 11 కిలోల తక్కువ
కౌడిపల్లి (నర్సాపూర్): రేషన్ బియ్యం బస్తా సాధారణంగా 50 కిలోలు ఉంటుంది. కాగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేసిన రేషన్ బియ్యం బస్తాల్లో మాత్రం ఒక్కో బస్తా ఒక్కోరకంగా ఉంటుంది. ఒక బస్తాలో 46 కిలోలు ఉండగా మరో బస్తా 40 కిలోలు మాత్రమే ఉంది. లెక్కమాత్రం 50 కిలోల చొప్పున ఇస్తున్నారు. దీంతో రేషన్‌డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో నష్టాన్ని తిరిగి డీలర్లు ప్రజలపైనే రుద్దుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి మే నెలకు సంబంధిం రేషన్ బియ్యం 70క్వింటాళ్ల 60 కిలోలు (140) బస్తాలు పంపించారు. ఇక్కడి డీలర్ పదవీ విరమణ చేయడంతో సమీపంలోని కొట్టల గ్రామ డీలర్ కిషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం బియ్యం పంపిణీ చేయగా గ్రామ ఉపసర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజిపేట రాజేందర్ తదితరులు పరిశీలించారు. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచి్చన ఒక్క బస్తాకూడ 50కిలోలు లేదు. ఒక్కో బస్తాలో 4 నుంచి 11కిలోల బియ్యం తక్కువగా వచ్చాయి. దీంతో 70క్వింటాళ్లు రావాల్సిన బియ్యం 60 క్వింటాళ్లు కూడా రాలేదు. చర్యలు తీసుకోవాలి.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ప్రతి రేషన్ షాపునకు బియ్యం వస్తున్నాయి. ఒక్క వెల్మకన్న డీలర్‌కు వచ్చిన బియ్యంలోనే పది క్వింటాళ్లు తక్కువగా వస్తే జిల్లా మొత్తంలో ఇలాగే జరుగుతుంది. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్వద్ద పెద్దమొత్తంలో కుంభకోణం జరుగుతుంది. దీని వెనక ఉన్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. - కాజిపేట రాజేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు -
తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోయింది. గురువారం ఉదయం హైదరాబాద్ మినహా ఇతర జిల్లాలో లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ మొదలవగా, మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం నుంచి వచ్చిన అత్యవసర ఆదేశాల నేపథ్యంలో రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. బియ్యం పంపిణీ నిలిపివేతకు గల కారణాలను అటు ప్రభుత్వం కానీ, పౌర సరఫరాల శాఖ కానీ వెల్లడించలేదు. మొత్తంగా 2.80 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టి గురువారం ఉదయం నుంచి పంపిణీ మొదలు పెట్టింది. కరీంనగర్లో ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీని ఆరంభించగా, మిగతా చోట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేలు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ పంపిణీలో లబ్ధిదారులు ఒకే దగ్గర గుమికూడకుండా వార్డుల వారీగా, టోకెన్ పద్ధతిన పంపిణీ మొదలు పెట్టారు. అయితే కొన్ని చోట్ల ఉచిత బియ్యం కావడంతో జనాలు ఎగబడ్డారు. 20మందికి మించి రావద్దని విన్నవించినా వందల సంఖ్యలో ఎగబడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకా చాలా చోట్ల ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పంపిణీ జరిగింది. ఇక మరోపక్క ఈ–పాస్, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి కీ రిజిష్టర్ ఆధారంగా పంపిణీకి అవకాశం ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం సైతం విన్నవించింది. ఇలా అయితేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని తెలిపింది. ఈ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాక మధ్యాహ్నం మూడు గంటలకు ఎక్కడికక్కడ బియ్యం సరఫరా నిలిపివేయాలని అత్యవసర ఆదేశాలు వెళ్లాయి. దీంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై పౌర సరఫరాల అధికారుల వివరణ కోరగా, స్పష్టమైన సమాధానం రాలేదు. చాలా జిల్లాల్లో ఇంకా పూర్తి స్థాయిలో బియ్యం రేషన్ దుకాణాలకు సరఫరా కాలేదని, ఈ దృష్ట్యా అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న కారణంతోనే నిలిపివేసి ఉంటారని ఒక అధికారి తెలుపగా, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దానిపై స్పష్టత వచ్చాక 12 కిలోల బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మరో అధికారి స్పష్టం చేశారు. ఈ అంశంపై శుక్రవారం స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
ఈకేవైసీ నమోదుకు రేషన్ డీలర్ల విముఖత
సాక్షి, అమరావతి: తెల్లరేషన్ కార్డుదారులకు ఈకేవైసీ నమోదు చేసేందుకు పలువురు రేషన్ డీలర్లు విముఖత చూపుతున్నారు. వారికి బిజీగా ఉన్నామని, తర్వాత రావాలంటూ రోజుల తరబడి తిప్పుకుంటూ చుక్కలు చూపుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ప్రయోజనం కన్పించడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 4.16 కోట్ల మంది పేర్లు (యూనిట్లు) నమోదై ఉన్నాయి. రేషన్ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేసినప్పటికీ 72 లక్షల మంది (యూనిట్లు) ఇప్పటికీ ఈ–పాస్ మిషన్లలో ఈకేవైసీ నమోదు చేసుకోలేదు. దీంతో వీరికి సంబంధించిన వేలిముద్రల వివరాలు అందుబాటులో లేవు. ఈ కారణంగా ఇందులో చాలా మంది తిరిగి మరోచోట తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల ఒక్కో కుటుంబానికి రెండు మూడు రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. ఇలాంటి వారు రెండు మూడు కార్డులకు కూడా సబ్సిడీ బియ్యం తీసుకుంటున్నారు. ఈకేవైసీ చేసుకోనందున అనర్హుల చేతుల్లో కార్డులు ఉండి అర్హులైన పేదలకు అందకుండా పోతున్నాయి. -
విచ్చలవిడి డబ్బు పంపిణీకి టీడీపీ ప్లాన్ ఇదే!
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దుస్సంకల్పంతో సీఎం చంద్రబాబు ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోవడం లేదు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రేషన్ డీలర్లను సైతం వాడుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు రేషన్ డీలర్ల ద్వారా ఇంటింటికీ డబ్బు పంపిణీ చేసే బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే రాష్ట్రం అంతటా పర్యటించి ప్రతి ఒక్క రేషన్ డీలర్‌ను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో సహకరించేందుకు వీలుగా అందరినీ సమాయత్తం చేసే బాధ్యతను రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ దివి లీలామాధవరావుకు అప్పగించారు. ఆయన పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వమే చేసింది. తాను కూడా రేషన్ డీలర్ అనే విషయాన్ని మరచిపోయి దివి లీలామాధవరావు ఏకంగా పసుపు కండువా కప్పుకుని టీడీపీ విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అవగాహన సదస్సుల పేరిట ఆయన జిల్లాల వారీగా రేషన్ డీలర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు డీలర్లకు ప్రకటించిన వరాలు గుర్తు చేస్తున్నారు. డీలర్ మృతి చెందితే మట్టి ఖర్చుల కోసం రూ. 15 వేలు, డీలర్లందరినీ చంద్రన్న బీమా పరిధిలోకి తీసుకురావడం, 95 శాతం లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసిన డీలర్లకు నెలకు రూ. 5 వేలు ప్రోత్సాహకం, బియ్యం పంపిణీ చేసినందుకు క్వింటాల్‌కు రూ. 100 కమీషన్ ఇవ్వడంతో పాటు పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రయోజనాలు కల్పించిన చంద్రబాబుకు సహకరించాలని దివి లీలామాధవరావు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇప్పటికే రాయలసీమ, కోస్తా జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేసి డీలర్ల నుంచి టీడీపీకి మద్దతు కూడగట్టినట్లు సమాచారం. అయితే ఒక పార్టీకి అనుకూలంగా పని చేయండని బహిరంగంగా కోరటం సరికాదని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ సానుభూతి పరులైన కొంతమంది డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవగాహన నదస్సుల నిర్వహణ ఎన్నికల నిబంధనల పరిధిలోకి రావంటూ ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తుడటం విమర్శల పాలవుతోంది. పైగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే గ్రామ స్థాయిలో వలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టి డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తారని సదస్సుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎన్నికల్లో సహకరించకపోతే డీలర్షిప్ రద్దు చేస్తాం.. ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయని వారిని తొలగిస్తాం అంటూ దివి లీలామాధవరావు రేషన్ డీలర్లను బెదిరిస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వతేదీ వరకు పేదలకు సరుకులు పంపిణీ చేస్తారు. పోలింగ్ 11న ఉండడంతో అంతకుముందు ఒకటి రెండు రోజులు ముందే ఓటర్లకు డబ్బు లేదా ఇతర వస్తువుల పంపిణీకి అవసరమైతే సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా సబ్సిడీ సరుకుల కోసం రేషన్ షాపులకు వచ్చే లబ్ధిదారుల పేర్లు రాసుకుని వారికి డబ్బు ముట్టజెప్పి.. అవసరమైతే టీడీపీకి ఓటు వేయాలని లిఖితపూర్వకంగా రాయించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా టీడీపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న డీలర్ల జాబితాను తయారు చేసి వారికి ఎన్నికల్లో ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం పోలింగ్ ఉన్నందున సోమవారం రాత్రికి రేషన్ డీలర్లకు నగదు ఇచ్చి వారి ద్వారా పంపిణీ చేసేలా పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ విషయం బయటకు పొక్కితే పంపిణీ బాధ్యతను డీలర్ల సమీప బంధువులకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
రేషన్ డీలర్లకూ.. కుచ్చుటోపీ
రేషన్ డీలర్లకు ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టింది. నిరంతరం సేవలందిస్తోన్న రేషన్ డీలర్లను ఆదుకుంటామని ఇప్పటి వరకూ 5 జీవోలు జారీ చేసింది. అయితే ఇందులో కేవలం ఒక్క జీఓను మాత్రమే అమలు చేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా డీలర్లు 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు గత ఏడాది డిసెంబరు 16న వాటిలో ఐదు డిమాండ్లను సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆమోదించి, ఆందోళనలు, నిరసనలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో డీలర్లు ఆందోళనల్ని విరమించారు. అయితే ఆమోదించిన డిమాండ్ల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని డీలర్లు మండిపడుతున్నారు. డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు డీలర్ల అసోసియేషన్లు ఒకే వేదికపైకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. ఆయా సమస్యల్ని పరిష్కరించేందుకు జీఓను జారీ చేస్తామని మంత్రి ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కేశారని వాపోతున్నారు. ఐదు హామీలకూ ఐదు జీఓలు జారీ చేయాల్సి ఉండగా ఒక్క జీఓను మాత్రమే ప్రభుత్వం జారీ చేసింది. రేషన్ షాపుల ద్వారా విక్రయించే బియ్యానికి క్వింటాలుకు రూ.100 కమీషన్ చెల్లించే విధంగా జారీ చేసిన జీఓ ఎట్టకేలకు అమలు జరిపినప్పటికీ మిగిలిన నాలుగు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. రాష్ట్రంలో 28,935 మంది డీలర్లున్నారు. సుమారు 1.16 లక్షల కుటుంబాల వారు రేషన్ షాపులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. కనీస వేతనాలు కూడా దక్కని విధంగా రేషన్ షాపులలో పనిచేస్తున్న డీలర్లకు వేధింపులు కూడా ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయకీయ రొచ్చులోకి డీలర్లు ప్రజా పంపిణీలో విశిష్ట సేవలందించే డీలర్లను రాజకీయ రొచ్చులోకి ఆపద్ధర్మ టీడీపీ ప్రభుత్వం లాగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు, ఎన్నికల్లో డీలర్లు ప్రత్యక్షంగా పాల్గొనకూడదని చట్టం ఉన్నప్పటికీ డీలర్ల సంఘ రాష్ట్ర నాయకుల్ని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని రాష్ట్ర సంఘ నాయకుడికి ఎర వేయడంతో అతను తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. రాష్ట్రస్థాయి డీలర్ల సంఘాలు నాలుగు ఉండగా వీటిలో ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ అధ్యక్షుడుగా కొనసాగుతున్న లీలా మాధవరావు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల డీలర్ల అవగాహన సదస్సులు నిర్వహించిన ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలనే సందేశాల్ని ఇవ్వడంపై çపలువురు డీలర్లు తీవ్రంగా మథనపడుతున్నారు. సదస్సుకు ‘పశ్చిమ’ వ్యతిరేకం రాష్ట్రస్థాయిలో డీలర్ల సంఘ అధ్యక్షుడు మాధవరావు నిర్వహిస్తున్న సదస్సులకు జిల్లా డీలర్లు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలిసింది. ఒక పార్టీకి కొమ్ము కాయడం వల్ల వచ్చే ఎన్నికల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, తదనంతరం ఏఏ ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందోనని జిల్లా డీలర్లు ఆందోళన చెందుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం రాష్ట్రవ్యాప్తంగా డీలర్లను ఒక పార్టీకి తాకట్టు పెట్టడం దారుణమని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు డిమాండ్లు ఆమోదించిన ఐదు డిమాండ్లు ఆర్థికంగా ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదని డీలర్లు పేర్కొంటున్నారు. ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించినా వాటిని అమలు చేయడంలేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా బియ్యానికి కమీషన్ రూ.70 నుంచి 100కు పెంచాలి. సరుకుల దిగుమతి చార్జీలను ప్రభుత్వమే భరించాలి. డీలర్లకు ఆరేళ్లుగా రావలసిన బకాయిలు రూ.100 కోట్లను వెంటనే చెల్లించాలి. డీలర్ చనిపోతే మట్టి ఖర్చులకు గాను రూ.20 వేలు చెల్లించాలి. డీలర్లకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలి. ఆదేశాలిచ్చాం రేషన్ డీలర్లు రాజకీయ కార్యక్రమాల్లోనూ, ఓటు ప్రభావిత కార్యక్రమాల్లోనూ, పార్టీల ప్రచారంలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేశాం. సభలు, సమావేశాలు డీలర్లు నిర్వహిస్తే కోడ్ ఉల్లంఘన అవుతుంది. కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. –జి.మోహనబాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు -
డీలర్ల భర్తీకి కసరత్తు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల్లో డీలర్లను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. స్థానికంగా కిరోసిన్ హాకర్ ఉండి రేషన్ డీలర్ లేకుంటే వారికే స్థానికత ఆధారంగా రేషన్ దుకాణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపడుతోంది. జిల్లాలో 669 రేషన్ దుకాణాలు ఉండగా 53 షాపులకు డీలర్లు లేరు. వీటిలో ఖమ్మం డివిజన్లో 38ఉండగా కల్లూరు డివిజన్ పరిధిలో 15ఉన్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాం తాల్లోని ఇతర రేషన్ డీలర్లకు ఇన్చార్జి అపగించారు. దీంతో సరుకులు పంపిణీలో స్థానికం గా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో డీలర్ల భర్తీకి ప్రభుత్వం ఉపక్రమించింది. 1994 నుంచి ఉన్నవారికే ప్రాధాన్యం.. జిల్లాలో కిరోసిన్ హాకర్లను రాష్ట్ర ప్రభుత్వం 1994వ సంవత్సరంలో నియమించింది. ఆ ప్రాతిపదికన నాటి నుంచి అనేక మంది హాకర్లు వచ్చే కొద్ది గొప్పో ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాంటి వారికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలోని 53 రేషన్ దుకాణాల్లో 1994వ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్న వారికి మాత్రమే ఖాళీగా ఉన్న ప్రాంతంలో రేషన్ దుకాణాన్ని అప్పగించనున్నారు. దరఖాస్తు ఇలా.. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలను ఆర్డీవోల పరిధిలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో కిరోసిన్ హాకర్ ఉండి రేషన్ డీలర్ లేకుంటే హాకరే దరఖాస్తు చేసుకుంటే రేషన్ దుకాణం రానున్నది. 53దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో స్థానికంగా ఉన్న వారికి మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు. హాకర్లు ఆయా ప్రాంతాల్లోని డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే జిల్లా పౌరసరఫరాల శాఖలో ఎవరైనా దరఖాస్తును అందిస్తే వారు సైతం ఆర్డీవోకు పంపిస్తారు. ఎంపిక పారదర్శకత జిల్లాలో రేషన్ డీలర్లను భర్తీ చేసేందుకు ఆర్డీవోలు పారదర్శకతతో వ్యవహరించనున్నారు. ఖమ్మం ఆర్డీవోగా సబ్ కలెక్టర్ ఉన్న దృష్ట్యా పారదర్శకంగా రేషన్ దుకాణానికి డీలర్‌గా ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం భర్తీ చేసే 53దుకాణాల్లో కిరోసిన్ హాకర్లు నియమ నిబంధనల ప్రకారం లేకుంటే ఎన్నికల అనంతరం కొత్తగా నోటిఫికేషన్లు వేసి కొత్త డీలర్లను ఎంపిక చేయనున్నారు. నిబంధనలిలా... 1994వ సంవత్సరం నుంచి కిరోసిన్ హాకర్‌గా ఉండాలి. 7వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. వయసు నిబంధన లేదు. హాకర్లకే రేషన్ దుకాణాలు జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలను భర్తీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో 53రేషన్‌దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. అక్కడ కిరోసిన్ హాకర్ ఉంటే వారి సమీపంలోని ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం అక్కడి అధికారులు డీలర్లను ఎంపిక చేస్తారు. – సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, ఖమ్మం -
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్
రేషన్ డీలర్ల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు మరిపెడ : మరిపెడ తహసీల్దార్ రేషన్ డీలర్ల నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరిపెడ మండల తహసిల్దార్ మంజుల శుక్రవారం రాత్రి రేషన్ డీలర్ల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాయిబాబా పట్టుకున్నారు. మండలంలో 62 రేషన్ దుకాణాలున్నాయి. ఒక్కో దుకాణం నుంచి ప్రతీ నెల రూ.500 వసూలు చేసేవారు. అయితే ఈ అ డబ్బులు తహసిల్దార్‌కు సరిపోవడంలేదని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జర్పుల భోధ్యనాయక్ ద్వారా డీలర్లకు సమాచారమిచ్చారు. దీంతో డీలర్లు పాత పద్ధతిలోనే ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన తహసిల్దార్ సోషల్ ఆడిట్ చేసి మీ గుట్టు రట్టు చేస్తానని బెదిరించడమే కాకుండా ఒకటి రెండు రేషన్ దుకాణాలు తనిఖీ చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో డీలర్లు సంప్రదింపులకు దిగారు. ఒక్కో డీలరు రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్ చేయండంతో వారు కాళ్లావేళ్లా పడి రూ.2వేలు ఇస్తామని ఒప్పుకున్నారు. రూ.లక్ష తయారు చేసి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అందుకు తహసిల్దార్ మంజూల సరే అన్నది. అయితే కొంతమంది డీలర్లు మాకు వచ్చే ఆదాయం లేకున్నా నెలనెలా రూ.2వేలు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తామని చెప్పడంతో వారిలో అంతర్మథనం మొదలైంది. ఈ దశలో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు ఇచ్చిన సూచన మేరకు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సింగనబోయిన నర్సింహ, బైండ్ల శ్రీనివాస్ మరికొంత మంది డీలర్లు కలిసి శుక్రవారం రాత్రి తహసిల్దార్ మంజుల ఇంటికి వెళ్లి డబ్బులు ఇచ్చారు. మంజుల డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసిల్దార్ మంజులను హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. ఈ దాడులలో ఖమ్మం ఏసీబీ ఇన్స్పెక్టర్లు పద్మ, రాఘవేంద్రరావు, రమణమూర్తి, వెంకటేశ్వర్లు, మహిళ పోలీసులు పాల్గొన్నారు. -
టీడీపీలో ‘రేషన్’ గోల !
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అంటే ఇదే! ‘అధికారంలోకి వచ్చాం.. అనుచరగణాన్ని అందలమెక్కిద్దాం’ అని టీడీపీ పాతనేతలు ఆలోచిస్తుంటే.. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినంత మాత్రాన తమ వర్గానికి అన్యాయం జరిగితే సహించేది లేదని గల్లా వర్గం గట్టిగా వాదిస్తోంది. దీంతో చంద్రగిరి, తిరుపతిలో ‘రేషన్ డీలర్ల’ తొలగింపు.. కొత్త వారి నియామకం టీడీపీలో చిచ్చు రేపుతోంది. తమ్ముళ్ల తగువులాటతో ఎటు అడుగు వేయాలో తెలీక జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరకు ఈ పంచాయతీ చంద్రబాబు దృష్టికి వెళ్లిందంటే టీడీపీలో ఇంటిపోరు ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది. సాక్షి, చిత్తూరు : అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీలో ఇంటిపోరు మొదలైంది. కొన్నేళుగ్లా పార్టీకోసం పనిచేసినవారికి... అధికారం కోసం కాంగ్రెస్ నుంచి టీడీపీకి అరువొచ్చిన వారికి మధ్య వైరం తారస్థాయికి చేరింది. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న రేషన్ డీలర్లను తొలగించి వారి స్థానంలో తాము సూచించిన వారిని నియమించాలని వలపల దశరథనాయుడు, మాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఇందు శేఖర్లు పాత జిల్లా కలెక్టర్ రాంగోపాల్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీధర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే పాతవారంతా తాను నియమించినవారని, వారంతా తన అనుచరవర్గమని, వారి జోలికి వస్తే ఊరుకునేది లేదని మాజీమంత్రి గల్లా అరుణకుమారి కూడా తనదైన శైలిలో జిల్లా యంత్రాంగానికి హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఇద్దరి సిఫార్సులను పక్కకునెట్టారు. సీఎం చంద్రబాబుతో విషయం చర్చించి ఆయన చెప్పినట్లు నడుచుకునేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో రెండువర్గాలు తమ పంచాయితీని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మొదటినుంచి టీడీపీలోకి గల్లా అరుణకుమారి రాకను వ్యతిరేకిస్తున్న మాజీమంత్రి గాలిముద్దుకృష్ణమనాయుడు, ఇందుశేఖర్, దశరథనాయుడు ఓవైపు ఉంటే గల్లా అరుణకుమారి ఒక్కరే ఓ వైపు ఉన్నారు. తిరుపతిలో సైతం చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే వెంకటరమణ మధ్య కూడా రేషన్‌డీలర్ల వివాదం ముదరుతోంది. ఎవరి వాదన వారిది పదేళ్లుగా కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది. ఈ కాలంలో మంత్రిగా చెలామణి అయిన గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందిపెట్టారని దశరథనాయుడు వర్గం ఆరోపిస్తోంది. తప్పుడు కేసులు, ఆర్థికంగా అణిచివేయడం లాంటి చర్యలతో టీడీపీ శ్రేణులను గడగడలాడించారని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు అండగా నిలిచి, పార్టీ ఉన్నతి కోసం శ్రమించామని, గల్లాకు వ్యతిరేకంగా పోరాటం చేశామంటున్నారు. పంచాయతీ, సింగిల్‌విండో ఎన్నికల్లో పార్టీ విజయానికి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేసి తాము అప్పులపాలయ్యారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తనను కాదని కాంగ్రెస్ నుంచి గల్లా అరుణకుమారిని అరువు తెచ్చుకుని టిక్కెట్టు ఇవ్వడంపై చంద్రబాబుపై దశరథ గుర్రుగా ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో పాతడీలర్లను తొలగించి, కొత్తవారిని నియమించాలని దశరథ, ఇందుశేఖర్ ఓ జాబితా జేసీకి ఇచ్చినట్లు తెలిసింది. వీరికి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా మద్దతు పలుకుతున్నారు. కొన్నేళ్ల నుంచి కార్యకర్తలు తనను నమ్ముకుని ఉన్నారని, అలాంటి వారిని తొలగించేందుకు వీళ్లేదని గల్లా కూడా గట్టిగా వాదిస్తున్నారు. పైగా ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన బడి సుధాయాదవ్ను గాలి, దశరథ, శేఖర్ ఓడించారని, వారి మద్దతుతోనే రెబల్ అభ్యర్థి మునికృష్ణయ్య గెలిచారని గల్లా వర్గం అంటోంది. ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి సిఫార్సులను పట్టించుకోవాల్సిన పనిలేదని ఇప్పటికే ఫోన్లో చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. తిరుపతిలోనూ ఇదే రగడ తిరుపతి తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే రచ్చ నడుస్తోంది. పాత డీలర్లను తొలగించేందుకు మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యే వెంకటరమణ అడ్డుపడుతున్నారని తెలిసింది. ఆయన కూడా గల్లా వాదననే విన్పిస్తున్నారు. తనకు అండగా ఉన్న నేతలు, కార్యకర్తలే డీలర్లుగా కొనసాగుతున్నారని, అలాంటి వారిని తొలగించేందుకు వీల్లేదని అంటున్నారు. దీంతో టీడీపీ అధికారంలోకి రాకముందు గల్లా, వెంకటరమణ పెత్తనమే కొనసాగిందని, వారి మద్దతుదారులే డీలర్లుగా ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారే ఉంటే తమ సంగతేంటని పాత టీడీపీ కార్యకర్తలు వారి నాయకుల వద్ద వాదిస్తున్నారు. మరి చంద్రబాబు ఏవైపు మొగ్గుతారో.. ఏ నేతకు అండగా నిలుస్తారో వేచి చూడాలి. -
పామా‘యిల్లే’!
- అస్తవ్యస్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థ - నిలిచిపోయిన పామాయిల్ సరఫరా - ఏ వస్తువు ఎప్పుడు వస్తుందో ఏమో - అయోమయంలో లబ్ధిదారులు తిరుపతిక్రైం, న్యూస్‌లైన్: ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఏ వస్తువు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అమ్మహస్తం సరుకుల్లో ఇప్పటికే కోత పడగా తాజాగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఏప్రిల్ నెలలో పూర్తిగా పామాయిల్ అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మే నెలకు రేషన్ డీలర్లు పామాయిల్‌కు డబ్బు కట్టాల్సిన అవసరం లేదని సివిల్ సప్లయ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 లక్షల 86 వేల 450 మంది కార్డుదారులకు పామాయిల్ అందే పరిస్థితి కనిపించడంలేదు. తిరుపతి అర్బన్ మండలానికి గత నెలకు 62 వేల లీటర్ల పామాయిల్ సరఫరా చేయాల్సి ఉండగా 59 వేల 556 లీటర్లను మాత్రమే సరఫరా చేశారు. మే నెలకు సంబంధించి రేషన్ డీలర్లకు పామాయిల్‌కు డీడీలు కట్టరాదని ముందస్తుగానే సివిల్ సప్లయ్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఎన్నికల హడావిడిలో పడి అధికారులు పామాయిల్ సరఫరాను పూర్తిగా విస్మరించారు. పామాయిల్ లీటర్ ధ ర 63.50 పైసలు ఉండగా కేంద్ర ప్రభుత్వం 23.50 పైసలు సబ్సిడీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులకు రూ.40 చొప్పున లీటర్ పామాయిల్ ప్యాకెట్‌ను పంపిణీ చేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకుండా మొండి చేయి చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫలితంగా ఏప్రిల్ నెలలో పామాయిల్ సరఫరా ఆగిపోయింది. ఇక మేనెలకు డీడీలు కట్టరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాకే.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పామాయిల్ సరఫరా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పామాయిల్ సబ్సిడీ విషయం గవర్నర్ దృష్టికి వెళ్లినా స్పందనలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక దీన్ని పునరుద్ధరిస్తారో.. లేదో వేచిచూడాల్సిందే.