సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దుస్సంకల్పంతో సీఎం చంద్రబాబు ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోవడం లేదు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రేషన్ డీలర్లను సైతం వాడుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు రేషన్ డీలర్ల ద్వారా ఇంటింటికీ డబ్బు పంపిణీ చేసే బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే రాష్ట్రం అంతటా పర్యటించి ప్రతి ఒక్క రేషన్ డీలర్‌ను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో సహకరించేందుకు వీలుగా అందరినీ సమాయత్తం చేసే బాధ్యతను రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ దివి లీలామాధవరావుకు అప్పగించారు. ఆయన పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వమే చేసింది. తాను కూడా రేషన్ డీలర్ అనే విషయాన్ని మరచిపోయి దివి లీలామాధవరావు ఏకంగా పసుపు కండువా కప్పుకుని టీడీపీ విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అవగాహన సదస్సుల పేరిట ఆయన జిల్లాల వారీగా రేషన్ డీలర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు డీలర్లకు ప్రకటించిన వరాలు గుర్తు చేస్తున్నారు. డీలర్ మృతి చెందితే మట్టి ఖర్చుల కోసం రూ. 15 వేలు, డీలర్లందరినీ చంద్రన్న బీమా పరిధిలోకి తీసుకురావడం, 95 శాతం లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసిన డీలర్లకు నెలకు రూ. 5 వేలు ప్రోత్సాహకం, బియ్యం పంపిణీ చేసినందుకు క్వింటాల్‌కు రూ. 100 కమీషన్ ఇవ్వడంతో పాటు పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రయోజనాలు కల్పించిన చంద్రబాబుకు సహకరించాలని దివి లీలామాధవరావు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇప్పటికే రాయలసీమ, కోస్తా జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేసి డీలర్ల నుంచి టీడీపీకి మద్దతు కూడగట్టినట్లు సమాచారం. అయితే ఒక పార్టీకి అనుకూలంగా పని చేయండని బహిరంగంగా కోరటం సరికాదని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ సానుభూతి పరులైన కొంతమంది డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవగాహన నదస్సుల నిర్వహణ ఎన్నికల నిబంధనల పరిధిలోకి రావంటూ ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తుడటం విమర్శల పాలవుతోంది. పైగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే గ్రామ స్థాయిలో వలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టి డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తారని సదస్సుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.
ఎన్నికల్లో సహకరించకపోతే డీలర్‌షిప్ రద్దు చేస్తాం..
ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయని వారిని తొలగిస్తాం అంటూ దివి లీలామాధవరావు రేషన్ డీలర్లను బెదిరిస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వతేదీ వరకు పేదలకు సరుకులు పంపిణీ చేస్తారు. పోలింగ్ 11న ఉండడంతో అంతకుముందు ఒకటి రెండు రోజులు ముందే ఓటర్లకు డబ్బు లేదా ఇతర వస్తువుల పంపిణీకి అవసరమైతే సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా సబ్సిడీ సరుకుల కోసం రేషన్ షాపులకు వచ్చే లబ్ధిదారుల పేర్లు రాసుకుని వారికి డబ్బు ముట్టజెప్పి.. అవసరమైతే టీడీపీకి ఓటు వేయాలని లిఖితపూర్వకంగా రాయించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా టీడీపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న డీలర్ల జాబితాను తయారు చేసి వారికి ఎన్నికల్లో ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం పోలింగ్ ఉన్నందున సోమవారం రాత్రికి రేషన్ డీలర్లకు నగదు ఇచ్చి వారి ద్వారా పంపిణీ చేసేలా పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ విషయం బయటకు పొక్కితే పంపిణీ బాధ్యతను డీలర్ల సమీప బంధువులకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment