పట్టుబడిన తహసిల్దార్ మంజుల(కూర్చున మహిళ)
-
రేషన్ డీలర్ల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
మరిపెడ : మరిపెడ తహసీల్దార్ రేషన్ డీలర్ల నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరిపెడ మండల తహసిల్దార్ మంజుల శుక్రవారం రాత్రి రేషన్ డీలర్ల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాయిబాబా పట్టుకున్నారు. మండలంలో 62 రేషన్ దుకాణాలున్నాయి.
ఒక్కో దుకాణం నుంచి ప్రతీ నెల రూ.500 వసూలు చేసేవారు. అయితే ఈ అ డబ్బులు తహసిల్దార్‌కు సరిపోవడంలేదని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జర్పుల భోధ్యనాయక్ ద్వారా డీలర్లకు సమాచారమిచ్చారు. దీంతో డీలర్లు పాత పద్ధతిలోనే ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన తహసిల్దార్ సోషల్ ఆడిట్ చేసి మీ గుట్టు రట్టు చేస్తానని బెదిరించడమే కాకుండా ఒకటి రెండు రేషన్ దుకాణాలు తనిఖీ చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో డీలర్లు సంప్రదింపులకు దిగారు. ఒక్కో డీలరు రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్ చేయండంతో వారు కాళ్లావేళ్లా పడి రూ.2వేలు ఇస్తామని ఒప్పుకున్నారు. రూ.లక్ష తయారు చేసి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అందుకు తహసిల్దార్ మంజూల సరే అన్నది. అయితే కొంతమంది డీలర్లు మాకు వచ్చే ఆదాయం లేకున్నా నెలనెలా రూ.2వేలు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తామని చెప్పడంతో వారిలో అంతర్మథనం మొదలైంది.
ఈ దశలో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు ఇచ్చిన సూచన మేరకు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సింగనబోయిన నర్సింహ, బైండ్ల శ్రీనివాస్ మరికొంత మంది డీలర్లు కలిసి శుక్రవారం రాత్రి తహసిల్దార్ మంజుల ఇంటికి వెళ్లి డబ్బులు ఇచ్చారు. మంజుల డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసిల్దార్ మంజులను హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. ఈ దాడులలో ఖమ్మం ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌లు పద్మ, రాఘవేంద్రరావు, రమణమూర్తి, వెంకటేశ్వర్లు, మహిళ పోలీసులు పాల్గొన్నారు.