ఆంధ్ర, తెలంగాణల్లో రేషన్‌ అనుసంధానం | Ration Portability in AP and Telangana Starts From August 15 | Sakshi
Sakshi News home page

ఆంధ్ర, తెలంగాణల్లో రేషన్‌ అనుసంధానం

Published Sun, Jul 28 2019 12:15 PM | Last Updated on Sun, Jul 28 2019 12:16 PM

Ration Portability in AP and Telangana Starts From August 15 - Sakshi

రేషన్‌ షాపులో తూకం వేస్తున్న బియ్యం

కాకినాడ సిటీ: రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులు పోర్టబులిటీ విధానంలో ఎక్కడి నుంచయినా సరుకులు తీసుకోవచ్చు. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తులు వివిధ రాష్ట్రాలో ఉంటే వారు అక్కడే రేషన్‌ సరుకులు పొందేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మన రాష్ట్రానికి చెంది  తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనుల కోసం వెళ్లిన వారు ఆ రాష్ట్రంలో ఎక్కడ ఉంటే అక్కడ రేషన్‌ సరుకులు తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం ఆగస్టు 1 నుంచి ఈ పోర్టబులిటీ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో నిర్వహించేందుకు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రేషన్‌ పోర్టబులిటీ ద్వారా జిల్లాలో ఎక్కడి నుంచైనా చౌకధరల దుకాణాల నుంచి సరుకులు తీసుకునే వెసులుబాటు ఇప్పటికే ఉంది. దీని ద్వారా అర్హులైన ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదవారు, ఉపాధి నిమిత్తం ఇతర ఊర్లకు, ప్రాంతాలకు వెళ్లిన కార్డుదారులకు ఉపయోగకరంగా ఉంది. ఇదే తరహాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు రేషన్‌ సరుకులు తీసుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.

దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పర అంగీకారం ప్రాతిపదికన ఆ రాష్ట్రం వారు మన రాష్ట్రంలోను, మన వారు తెలంగాణలోనూ రేషన్‌ సరుకులు తీసుకునేలా నిర్ణయించారు. జిల్లా ప్రజలు ఉపాధి, ఇతర కారణాలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్నారు. ఆ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల నుంచి వచ్చిన వారు మన జిల్లాలోని పలు పరిశ్రమల్లో పనులు చేసుకుని జీవిస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలే వలస వచ్చి ఉన్నారు. వారంతా వివిధ రేషన్‌ కార్డులు కలిగిన వారే. ఉపాధి కోసం వేర్వేరు జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఉండటం వల్ల వారు రేషన్‌ సరుకులకు దూరం అవుతున్నారు. కొద్ది నెలలపాటు వాటిని తీసుకోకపోతే ఆయా కార్డులు రద్దు చేస్తున్న పరిస్థితులున్నాయి. ఈ సమస్యల నుంచి పరిష్కారం చూపడంతో పాటు జాతీయ ఆహార భద్రత చట్టం–2013ను పక్కాగా అమలు చేయడం, వారందరికీ నెలనెలా ఇబ్బంది లేకుండా సరుకులు అందించేలా, అంతరాష్ట్ర అనుసంధానం అమలు చేసేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.

ఇందుకు సంబందించి ఇటీవలే కేంద్రం నుంచి కూడా అనుమతి వచ్చినట్టు డీఎస్‌ఓ డి.ప్రసాదరావు తెలిపారు. తెలంగాణలో ఉన్న మన జిల్లా వారికి అక్కడే రేషన్‌ సరుకులు అందించే ఈ కార్యక్రమం ఆగస్టు 1 నుంచే అమలు చేస్తారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు పౌరసరఫరాల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మన జిల్లా వారు ఎంత మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో అంచనాలు సిద్ధం చేశారు. వారందరి వివరాలనూ ప్రభుత్వానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 16,43,584 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిలో అన్నపూర్ణ 1,320, అంత్యోదయ అన్న యోజన 83,120, తెలుపు రేషన్‌ కార్డులు 15,59144 ఉన్నాయి. వారందరి వివరాలనూ ప్రభుత్వానికి పంపారు. వీరిలో సుమారు 20 నుంచి 25 వేల మంది కార్డుదారులు తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి నిమిత్తం వెళ్లి ఉంటారని చెబుతున్నారు.

అలాగే అక్కడి వారు మన జిల్లాలో 100 నుంచి  150 మంది వరకు ఉండవచ్చంటున్నారు. జిల్లాలో ఈ పోర్టబులిటీ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రజలు మన జిల్లాలో ఉంటే వారిని గుర్తించాలని ఇప్పటికే జిల్లాలోని అందరు వీఆర్వోలకు సమాచారం అందించామన్నారు. ప్రస్తుతం నలుగురు వ్యక్తుల మాత్రమే కాకినాడ, కరప ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. రాజమహేంద్రవరంలో తెలంగాణకు చెందిన వ్యక్తులు ఉండవచ్చని, ఆ దిశగా సర్వే జరుగుతోందన్నారు. మన జిల్లాకు చెందిన వారు ఆ రాష్ట్రంలో ఉంటూ, అక్కడ రేషన్‌ పొందాలంటే అక్కడ డీఎస్‌ఓ కార్యాలయం, సంబంధిత తహసీల్దారు, పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహసీలార్లకు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్‌ఓ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement