నెల్లూరులో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఒంగోలు: ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖలో రూ.29.87 కోట్ల అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులు, ఉద్యోగుల నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు నిర్వహించింది. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ పి.పద్మ, అసిస్టెంట్ మేనేజర్‌లు సీహెచ్.చల్లా జయశంకర్, ఎంవీవీడీ శర్మ, రికార్డ్ అసిస్టెంట్ పి.అరుణ కుమారి, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివ కుమార్‌లకు విజయవాడ, ఒంగోలు, నెల్లూరుల్లో ఉన్న నివాసాల్లో ఏసీబీ బృందాలు బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగించాయి.
ఆ అధికారుల ఆస్తుల పత్రాలు, బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఇతర విలువైన వస్తువులను ఏసీబీ జప్తు చేసింది. ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఈ ఏడాది మొదట్లో ఇంటర్నెల్ ఆడిట్ నిర్వహించగా అవినీతి వ్యవహారం బయటపడింది. 2020–21, 2021–22లకు సంబంధించి రూ.29.87 కోట్ల నిధులు దారి మళ్లినట్లు గుర్తించారు.
దాంతో పి.పద్మ, చల్లా జయశంకర్, ఎంవీవీడీ శర్మ, టి.అరుణ కుమారి, శివ కుమార్‌లతోపాటు కాంట్రాక్టర్ చేజెర్ల దయాకర్, ప్రైవేటు వ్యక్తులు ఎం.రాడమ్మ, సూరి పవన్, చీపురుపల్లి రాజు, చేజెర్ల కామాక్షి, గరికిపాటి ప్రశాంతిలపై నెల్లూరులోని విద్యాధరపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
అనంతరం ఆ కేసును ఏసీబీకి బదిలీ చేశారు. దీంతో వారిపై ఈ నెల 6న కేసు నమోదు చేసిన ఏసీబీ..బుధవారం అధికారులు, ఉద్యోగుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. సోదాలు పూర్తి అయిన తరువాత ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment